"ఎక్మో" చికిత్స ప్రాణాలను కాపాడగలదా?

By Kiran.G Sep. 25, 2020, 06:12 pm IST
"ఎక్మో" చికిత్స  ప్రాణాలను కాపాడగలదా?

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం తీవ్రంగా విషమించిండంతో ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య స్థితిని చక్కదిద్దడానికి వైద్యులు వెంటిలేటర్ ద్వారా ఎక్మో చికిత్స అందించినా సరే ఆయన ప్రాణాలను కాపాడలేక పోయారు..

బాలసుబ్రహ్మణ్యం కరోనా నుండి బయట పడ్డారని,హుషారుగా ఉన్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం తీవ్ర విషమంగా మారినట్లు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలు ఉండడంతో వెంటిలేటర్ ద్వారా ఎక్మో చికిత్స అందించారు. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా వైద్యులు ఎక్మో చికిత్స అందించారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యంకు కూడా ఎక్మో చికిత్స అందించిన నేపథ్యంలో ప్రజలకు ఎక్మో చికిత్స పట్ల అనేక అనుమానాలు అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

ఎక్మో చికిత్స అంటే ఏంటి?

ఆధునిక యుగంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు సరిగా పనిచేయని నేపథ్యంలో ఎక్మో చికిత్స ద్వారా రోగిని బ్రతికించే ప్రయత్నం చేస్తారు వైద్యులు. శరీరంలో ప్రతీ కణానికి ఆహారం రక్తం ద్వారానే అందుతుంది. మనం తిన్న ఆహారం రక్తం ద్వారా కణంలోకి సరఫరా అవుతుంది. కణంలో శక్తి పుట్టాలి అంటే ఆహారం మండించబడాలి. ఆహారాన్ని మండించడానికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ముక్కు ద్వారా మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సీజన్ ఊపిరితిత్తుల్లో రక్తంలో కలుస్తుంది.రక్తం ద్వారా కణాల్లో ఆక్సీజన్ సరఫరా జరుగుతుంది.ఆక్సీజన్ సహాయంతో కణాలు ఆహారాన్ని మండించి శక్తిని పుట్టిస్తాయి.ఈ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సయిడ్ పుడుతుంది. ఈ వాయువును రక్తం ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. అనంతరం ఊపిరితిత్తులు రక్తం నుండి కార్బన్ డై ఆక్సయిడ్ ను వేరు చేసి బయటకు పంపిస్తాయి.

మనిషి ఊపిరితిత్తులు పనిచేయలేని పరిస్థితుల్లో అవి చేసే పనిని ఒక యంత్రం ద్వారా వైద్యులు చేయిస్తారు. దీనినే ఎక్మో చికిత్స అంటారు. అంటే మనిషి రక్తాన్ని ఊపిరితిత్తులకు కాకుండా యంత్రానికి చేరేలా వైద్యులు ఏర్పాటు చేస్తారు. యంత్రం ద్వారా ఆక్సిజన్ నేరుగా రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాల్లో కలుస్తుంది. అదేవిధంగా ఆహారం కణాల్లో దహనం అయిన తర్వాత రక్తంలో కలిసిన కార్బన్ డై ఆక్సయిడ్ ను యంత్రం వేరు చేసి బయటకు పంపిస్తుంది. యంత్రం ద్వారా శరీర భాగాలకు రక్త సరఫరా జరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులపై భారం తగ్గి మాములు స్థితికి వచ్చేలా వైద్యులు చర్యలు తీసుకుంటారు. మొత్తం పనిని యంత్రమే చేసేస్తే ఊపిరితిత్తులు ఫెయిల్ అయి పూర్తిగా పనిచేయకుండా మానేసే అవకాశం ఉంది. అందుకే వైద్యులు కొద్దిపాటి రక్తం ఊపిరితిత్తులకు చేరేలా చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఊపిరితిత్తులపై పనిభారం తగ్గి తిరిగి మాములు స్థితికి చేరుకున్నాక అవి పూర్తిస్థాయిలో పని చేస్తాయని వైద్యులు నిర్దారణకు  వచ్చిన అనంతరం ఊపిరితిత్తులకు గుండె నుండి పూర్తి స్థాయిలో రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు.

ఎక్మో చికిత్స ప్రముఖుల ప్రాణాలను కాపాడగలదా?

గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆరోగ్యం పూర్తిస్థాయిలో విషమించిన పరిస్థితుల్లో వైద్యులు ఎక్మో చికిత్స అందించారు. దాదాపు 74 రోజుల చికిత్స అనంతరం జయలలిత మృతిచెందారు. వైద్యులు జయలలిత ప్రాణాలు నిలపడానికి ఎంతగా ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. ఆ సమయంలో జయలలిత మరణం చుట్టూ అనేక అనుమానాలు ఏర్పడి అనేక వివాదాలు చుట్టుముట్టాయి.తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు కూడా వైద్యులు ఎక్మో చికిత్స అందించినా సరే ఆయన ప్రాణాలు నిలబడలేదు.

కరోనా లక్షణాలతో ఆగస్టు 5 న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలసుబ్రహ్మణ్యం కరోనా నుండి కోలుకున్నారు కూడా.పూర్తిగా కోలుకుంటున్నారని అభిమానులు ఆనందపడుతున్న సమయంలో గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు ప్రకటించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల ఆశలను అడియాసలు చేస్తూ ఈ శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్వర్గస్తులవడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎస్పీబి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎక్మో చికిత్స ద్వారా ఆయనను బ్రతికించడానికి వైద్యులు శాయశక్తులా కృషి చేశారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించినప్పుడు కూడా చివరి రోజులు ఆస్పత్రిలోనే గడిపారు. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా జయలలిత ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. ఇప్పుడు ఎస్పీబి విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురయింది.

మనిషి టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకుపోయినా సరే ప్రాణాలని నిలబెట్టే యంత్ర పరికరాలను మాత్రం తయారుచేయలేక పోయాడు. ఎక్మో చికిత్స ద్వారా ఎస్పీబి స్పందించి తిరిగి కోలుకుని వస్తారని మళ్ళీ తన గానామృతంలో అభిమానులను,సంగీత ప్రియను ఓలలాడిస్తారని ఆశపడ్డ అభిమానులకు తన పాటను వదిలి ఎస్పీబి స్వర్గస్తులవడం సంగీత ప్రియులకు జీర్ణించుకోలేని విషయం. పాట ఉన్నంత కాలం ఆయన గాత్రం వినిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు.మనిషికి మరణం ఉంటుందేమో కానీ గళానికి గాత్రానికి మరణం లేదు.. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp