Chandrababu- పాలన వదిలి పొలిటికల్‌ స్టంట్లు చేయాలంటారా బాబూ..?

By Aditya Nov. 24, 2021, 09:00 pm IST
Chandrababu- పాలన వదిలి పొలిటికల్‌ స్టంట్లు చేయాలంటారా బాబూ..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వృద్ధుడని అందుకే జనంలో తిరగడం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితం అవుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన ఆయన రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై వింత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని, తన హయాంలో వరదలను అడ్డుకోవడానికి రాత్రిళ్లు కూడా పనిచేసి కలెక్టర్లను క్షేత్రస్థాయికి పంపానని చెప్పారు. ఈ ప్రభుత్వానికి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియదని, అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రజలను ఆదుకోవడం గురించి సీనియర్‌గా సలహాలు ఇవ్వడం మాని ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం బాబుకు తగునా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీ హయాంలో విపత్తులు రాలేదా అన్న ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారో?

జగన్‌ వృద్ధుడైతే బాబు నవ యవ్వనుడా!

70 ఏళ్ల పైబడ్డ వయసులో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి అపసోపాలు పడుతున్న చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డిని వృద్ధుడు అని వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ప్రజా సమస్యలపై జనంలో తిరగడం రాజకీయ పార్టీలు సహజంగా చేసే పనేనని, ఇంతోటి దానికి తానేదో నవ యవ్వనంలో ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడడం మరీ చోద్యంగా ఉందని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించడం కూడా ఏదో తప్పయినట్టు మాట్లాడడం వింతగా ఉందని విమర్శిస్తున్నారు. వరద బాధితులకు తక్షణ సాయంగా నిత్యావసర సరుకులు, రూ.రెండు వేలు చొప్పున అందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులు మరణిస్తే రూ.25 లక్షల చొప్పున ఇవ్వడమే కాక, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  ఈ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనానికి సక్రమంగా పాలన అందించడం ముఖ్యం కాని, వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.

Also Read : Nani ,Vamsi -కొడాలి నాని ,వంశీ మరికొందరు ఎమ్మెల్యే లకు భద్రత పెంపు

కోవిడ్‌తో జనం కష్టాలు పడిన రోజుల్లో దాదాపు ఏడాదిన్నర హైదరాబాద్‌కే పరిమితమైన చంద్రబాబు ఇప్పుడు జనంలోకి వచ్చి రోడ్‌ షో చేసేస్తే ప్రజల సమస్యలు పరిష్కరించేసినట్టా అని ప్రశ్నిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వృద్ధుడు అయితే ఈయన కుమార రత్నం లోకేశ్‌ ఎప్పుడూ ట్విట్టర్‌కే పరిమితం అవుతున్నారని, మరి ఆయనను ఏమనాలి? అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రమంతా పాదయాత్రగా తిరిగిన తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి జనం కష్టాలపై అవగాహన ఉందని, అందుకే సజావుగా పరిపాలిస్తున్నారని అంటున్నారు.
 ‍
దొంగ ఓట్లు వేస్తే మీరేం చేశారు?

వైఎస్సార్‌ సీపీ కుప్పంలో రౌడీయిజం చేసి, దొంగ ఓట్లు వేసి గెలిచిందని, దానికే విర్ర వీగిపోతోందని వ్యాఖ్యానించారు. తాను ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత ఐదుకోట్ల మంది ప్రజలపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం పోరాడుతోందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఆడలేక మద్దెల ఓడె అంటే ఇదే! కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది మొదలు పోలింగ్‌ పూర్తయ్యే వరకు తమ శక్తియుక్తులు అన్ని వినియోగించి టీడీపీ గెలుపు కోసం పోరాడిన చంద్రబాబు తీరా ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఈ విధంగా వ్యాఖ్యానించడం విడ్డూరం కాక మరేమిటి? తమ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లు ఎదుటివారు గెలిస్తే దొంగ ఓట్లు వేసి అరాచకం చేసినట్టు ఆరోపించడం ఏం సంప్రదాయం? దొంగ ఓట్లు వేస్తే రుజువులు, ఆధారాలతో ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి ఓటింగ్‌ను అడ్డుకోవచ్చు. లేదా కోర్టుకే వెళ్లవచ్చు. ఆ ఆధారాలను మీ మీడియా ద్వారా జనానికి చూపవచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా అవేవీ ఉపయోగించకుండా ఇలా ప్రకటనలు చేయడం ఎందుకో అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దొంగ ఓట్లు వేస్తుంటే అసలు మీ పార్టీ ఏజెంట్లు ఏం చేశారు? ఎందుకు అడ్డుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? తప్పుడు పనులు చేసేవారిని వదిలిపెట్టనని, టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరుపుతామని, శిక్షిస్తామని చంద్రబాబు ఎప్పటిలా హెచ్చరించారు. అయితే అందుకు ఆయన అధికారంలోకి రావాలి కదా.. ప్రతి ఎన్నికలో ఓడిపోతూ పార్టీ ప్రజలకు రోజురోజుకి దూరం అవుతుంటే ఇంకా ఈ ప్రగల్భాలు ఏమిటని అధికార పార్టీ నాయకులు ఎగతాళి చేస్తున్నారు.

Also Read : Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp