పోలవరం నిధులు కేంద్రం మాట నిలబెట్టుకుంటుందా

By Raju VS Jul. 29, 2021, 08:15 am IST
పోలవరం నిధులు కేంద్రం మాట నిలబెట్టుకుంటుందా

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం మూలంగానే పునరావాస వ్యయం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైన్లు మార్చడం వల్లనే మెయిన్ డ్యామ్ నిర్మాణం భారంగా మారింది. కేంద్రం నుంచి నిధులు జాప్యం కావడం వల్లనే ప్రాజెక్టు పనులు ఆలశ్యమయ్యి ఖర్చు అదనంగా అవుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరుతో జాతీయ హోదా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగనప్పటికీ అంచనాలు మాత్రం సవరించేందుకు ఇప్పటికీ సిద్ధం కాలేదు. అయినా పట్టువీడకుండా జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో మరోసారి అంచనాల పెంపునకు అంగీకరించింది. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం, క్యాబినెట్ తీర్మానం జరుగుతాయని ప్రకటించింది.

గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ హామీ ఇచ్చింది. 2013-14 నాటి అంచనాలను సవరించి రూ. 47,725 కోట్లకు ఆమోదం తెలపబోతున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి డీపీఆర్ 2 ప్రకారం రూ. 55వేల కోట్లకు పెంచాల్సి ఉంది. టెక్నికల్ కమిటీ, సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాత కూడా వాటిని సవరించి రూ. 47వేల కోట్లతో సరిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం కాలయాపన చేస్తూ ప్రాజెక్టు నిర్మాణ మరింత ఆలశ్యమయ్యేందుకు కారణమవుతోంది.

వాస్తవానికి పునరావాసం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమనేనని చట్టాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పునరావాస వ్యయం తమకు సంబంధం లేదన్నట్టుగా కేంద్రం కొర్రీలు వేస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అంగీకరించిన దాని మూలంగా కేంద్రానికి ఇలాంటి అవకాశం వచ్చింది. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదం ఇప్పుడు పెను భారం అయ్యింది. దానిని సవరించేందుకు జగన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కేంద్రం పెద్దలతో రాయబారాలు నెరిపారు. అనేక మార్లు హామీలు కూడా వచ్చాయి. అయినా ఆచరణలో పెట్టలేదు. 2017-18 నాటి అంచనాల ఆమోదానికి కూడా కేంద్రం సిద్ధం కాకపోవడంతో పోలవరం భవితవ్యం మీద కూడా పలు సందేహాలు వచ్చాయి.

కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చెల్లిస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి తీరని నష్టానికి కారణమవుతోంది. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు జల్లుతోంది. అలాంటి సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టువిడకుండా ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్ లో ప్రస్తావించడం, బయట వినతిపత్రాలతో రాయబారాలు నడపడం ఏకకాలంలో జరిగాయి. ఎట్టకేలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది. వచ్చే వారం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించి ఆర్థిక శాఖ ద్వారా నిధులు బదలాయించేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈసారయినా మోడీ ప్రభుత్వం మాట నిలుపుకుంటే పోలవరం పనులు పూర్తయ్యే అవకాశాలు వస్తాయి. లేదంటే రాష్ట్రానికి పెను భారంగా మారి, నిర్మాణం సందిగ్ధంగానే సాగుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp