టార్గెట్ ముఖ్యమంత్రి పీఠం - వయా జీహెచ్ఎంసీ - ఇదే బీజేపీ లక్ష్యం

By Rishi K Nov. 25, 2020, 11:01 am IST
టార్గెట్ ముఖ్యమంత్రి పీఠం - వయా జీహెచ్ఎంసీ - ఇదే బీజేపీ లక్ష్యం

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తన్న వ్యూహం ఇదే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం, ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలను దింపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి చరిష్మా ఉన్న నాయకులను అస్త్రాలుగా సంధించనుంది. జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న నేతలను గ్రేటర్ వార్ లోకి దిండచం ద్వారా గెలుపు తీరాలకు చేరుకోవాలనుకుంటోంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడంలోనే ఆ పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మెరవనున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో వికసించిన కమలం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. అదే ఊపులో గ్రేటర్ లోనూ తమ సత్తా చాటాలనుకుంటోంది.  గ్రేటర్ బరిలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక ఫలితాలు వెలువడిన రోజునుంచే బీజేపీ నేతలు గ్రేటర్ లోనూ తమదే విజయమని ప్రకటిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి గోల్కొండ కోటపై జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఆ కల నిజం కావాలంటే... ఇప్పుడు గ్రేటర్ లో సత్తాచాటాల్సిన అనివార్యత బీజేపీ ముందుంది. అందుకే...  జీహెచ్ఎంసీ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది బీజేపీ. టీఆర్ఎస్ ను ఓడించడానికి రోజుకో కొత్త వ్యూహాంతో ముందుకు కదులుతోంది. ఓవైపు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలనూ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఎంఐఎంతో టీఆర్ఎస్ జట్టుకట్టిందని, టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎం వశమవుతుందని పదే పదే మాట్లాడుతోంది.

గ్రేటర్ లో యువ ఓటర్లను తమవైపు మలుపుకునేందుకు ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యను ప్రచారంలోకి దించారు రాష్ట్ర బీజేపీ నేతలు. పిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఈ యువ ఎంపీ గ్రేటర్ ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిస్తోందని, అభివృద్ధి నినాదం ఒట్టి ఢాంబికమంటూ కొట్టిపారేశారు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామంటున్న గులాబి పార్టీకి హిందువుల పట్ల ప్రేమ లేదని, తాము గ్రేటర్ లో గెలిస్తే హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారానికి ఇంక కొద్ది రోజుల గడువే మిగలడంతో ఢిల్లీ పెద్దలను భాగ్యనగరం బరిలో దించేందుకు సిద్ధమైంది బీజేపీ.  నవంబర్ 29తో ప్రచారానికి గడువు ముగియనుండడంతో ఈలోపే రోజుకో అగ్రనేత హైదరాబాద్ లో ప్రచారానికి హాజరయ్యే అవకాశముంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ల ప్రచారం తరువాతే అమిత్ షా హైదరాబాద్ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. చివరి రోజుల్లో అమిత్ షా ప్రచారం నిర్వహించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బీజేపీ యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏ లాంటి అంశాల పట్ల దూకుడుగా వ్యవహరించిన అమిత్ షా ప్రచారం ఓటర్ల మనసు దోచుకునేందుకు దోహదపడుతుందని బీజేపీ భావిస్తోంది.

గ్రేటర్ కి గురిపెట్టి తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ ఇప్పటికే దూకుడును పెంచింది.  ప్రధాన ప్రతిపక్షాన్ని పక్కకు నెట్టి మరీ తానే ప్రధాన పోటీదారుననిపించుకుంటోంది. కోటి జనాభా ఉన్న గ్రేటర్ మీద పట్టు సాధించడం ద్వారా తెలంగాణలో అధికార పక్షానికి ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ ఆరాటంలోంచే బీజేపీ తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలనూ సంధించడానికి సిద్ధమైంది. తెలంగాణ గడ్డపై అధికార పార్టీని ఎదుర్కొని నిలబడేందుకు ఢిల్లీ పెద్దల మద్దతు తప్పనిసరనుకుంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. దుబ్బాక జోష్, జనసేన సహకారంతో పాటు అగ్రనేతల చరిష్మా తమకు కలిసొస్తాయని బలంగా నమ్ముతున్నారు. అందుకే... జాతీయ నేతలను బరిలోకి దింపి దుబ్బాక ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటున్నారు.

అటు అధికార పార్టీ తరుపున ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ అగ్రనేతలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా రాష్ట్ర మంత్రులంతా గ్రేటర్ ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సై అంటే సై అంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికారాన్ని దక్కించుకోవడానికి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్న రాజకీయపార్టీల తీరు చూస్తుంటే గ్రేటర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp