పంజాబ్ ఎలక్షన్స్ - ఆ రెండు వర్గాల మీద బీజేపీ దృష్టి

By Srinivas Racharla Sep. 16, 2021, 01:00 pm IST
పంజాబ్ ఎలక్షన్స్ -  ఆ రెండు వర్గాల మీద బీజేపీ దృష్టి

అక్కడ పాలకుడిని నిర్ణయించేది రైతులే.కానీ రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలోని మోడీ సర్కార్ నూతన సాగు చట్టాలు చెయ్యడం ఓవైపు.ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు దశాబ్దాల మిత్రపక్షం తెగతెంపులు చేసుకోవడం మరోవైపు.

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో పెద్దఎత్తున ఉద్యమిస్తున్న రైతులలో సింహభాగం పంజాబీ రైతులే.నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి గతేడాది బయటికి వచ్చింది.ఈ నేపథ్యంలో 1997 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఏకాకిగా బరిలో దిగనుంది.దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీకి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు కత్తి మీద సాములా తయారయ్యాయి.

గతంలో తమకి అకాలీదళ్ మిత్రపక్షంగా ఉండడంతో ఆ పార్టీ ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన సిక్కులను ఆకర్షించడానికి బీజేపీ పెద్దగా ప్రయత్నించలేదు. దళితులలో తన ఓటు షేర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ పట్టణ ప్రాంతాలలోని సాంప్రదాయ హిందుత్వ ఓటర్లపైనే బీజేపీ ఇప్పటివరకు ఆధారపడింది.

సిక్కుల చేరికపై దృష్టి

ప్రస్తుతం బీజేపీ పార్టీలో సీఎం అమరీందర్‌ సింగ్‌,శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ స్థాయి సిక్కు నేతలు భూతద్దం పెట్టి వెతికిన కానరారు. కానీ 23 ఏళ్ల అకాలీదళ్, బీజేపీ మిత్రత్వం కొండెక్కడంతో తొలిసారి సిక్కు నాయకుల లోటును భర్తీ చేయడంపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గత జూన్ నెలలో అనేక మంది సిక్కు మేధావులు పార్టీ తీర్థం తీసుకున్నారు. వారిలో గురు కాశీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జస్వీందర్ సింగ్ ధిల్లాన్,న్యాయవాదులు హరీందర్ సింగ్ కహ్లోన్, జగ్మోహన్ సింగ్ సైనీ,నిర్మల్ సింగ్ మొహాలీ వంటి ప్రముఖులు ఉన్నారు.తాజాగా దివంగత కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్ సింగ్ కూడా కమలం గూటికి చేరారు.ఇలా సిక్కు మేధావులను పార్టీలో చేర్చుకొని గురునానక్ వారసుల పార్టీ ముద్ర కోసం బీజేపీ ఆరాటపడుతుంది.

దళిత ఓటర్ల దరిచేరుటకు

రాష్ట్ర ఓటర్లలో జాట్ సిక్కులు 25 శాతం కాగా సుమారు 32 శాతం దళిత ఓటర్లు ఉన్నారు. సాధారణంగా జాట్ సిక్కులు అకాలీదళ్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండగా మెజార్టీ దళిత సిక్కు ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. దళితులలో వాల్మీకులు,మజాబీ సిక్కులు, రామదాసీలు, రవిదాసీలు అనే వర్గాలు కలవు.వీరిలో మజాబీ సిక్కులు, రామదాసీ వర్గాలలో బీజేపీ ఉనికి నామమాత్రమే.కాగా రవిదాస్ కమ్యూనిటీకి చెందిన సోమ్ ప్రకాష్ ని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గా,జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గా విజయ్ సంప్లా ని కేంద్రం ఇటీవల నియమించింది. ఆ వర్గ దళిత ఓట్లను కొల్లగొట్టే లక్ష్యంతోనే ఈ ఇరువురి నియామకం బీజేపీ చేపట్టింది.ఇక రాజకీయ నాయకుడిగా మారిన సుఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ ద్వారా దళిత వాల్మీకులలోకి చొచ్చుకు పోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

టార్గెట్ 45

2022 అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి తమ అమ్ములపొదిలోని హిందుత్వ కార్డునే ప్రయోగించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పంజాబ్‌లో 60 శాతానికి పైగా హిందువులు ఉన్న నియోజకవర్గాలను బీజేపీ గుర్తించింది.ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో హిందువులు మెజార్టీగా ఉన్న మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆయా జిల్లాల పార్టీ నేతలకు గెలుపే లక్ష్యంగా అమిత్ షా నాయకత్వంలోని బృందం మార్గ నిర్దేశకం చేసింది.బీజేపీకి మంచి పట్టున్న రోపర్, జలాలాబాద్, పాటియాలా (అర్బన్), దేరబస్సీ, ఖరార్, మొహాలీ, బుద్ధలాడా, బఠిండా(అర్బన్) వంటి నియోజకవర్గాలపైనా దృష్టి కేంద్రీకరించింది. వీటితో పాటు ఇతర స్థానాలలోను గెలిచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం భారీ కసరత్తులు చేపట్టింది.

రైతుల నిరసనల నుండి గట్టెక్కేందుకు యత్నం

రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే భావనను తిప్పికొట్టడానికి విస్తృత ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసింది.ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 150 ప్రముఖ సిక్కు కుటుంబాలను కలిసి రైతుల నిరసనలపై బీజేపీ అనుకూల బుక్లెట్‌ల పంపిణీ చేపట్టారు.సిక్కులతో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు ఈ బుక్లెట్‌లలో విశదీకరించారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర, మోడీ హయాంలో అభివృద్ధి చేసిన కర్తార్‌పూర్ కారిడార్ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.2019 లో గురు నానక్ 550 వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని వివరిస్తూ సిక్కులకు బీజేపీ అనుకూలం అనే భావన సాధించేందుకు బీజేపీ తంటాలు పడుతుంది.

రెండు దశాబ్దాల తర్వాత పంజాబ్‌లో ఒంటరి పోరు బీజేపీకి ఓ విచిత్రమైన అనుభవం.కాగా రైతాంగ రాష్ట్రంలో కమల వికాసం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి నూతన సాగు చట్టాలే ప్రతిబంధకంగా మారాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp