పౌరసత్వ బిల్లుకు ఆమోదం - ఈశాన్యంలో పెరిగిన ఉద్రిక్తలు

By Kotireddy Palukuri Dec. 12, 2019, 08:21 am IST
పౌరసత్వ బిల్లుకు ఆమోదం - ఈశాన్యంలో పెరిగిన ఉద్రిక్తలు

అనుమానాలు, సందేహాలు, విమర్శలు, ఆందోళన నడుమ పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ప్రతిపక్షాల వ్యతిరేకత, ఈశాన్య రాష్ట్రాలలో ప్రజల ఉద్రిక్త ఆందోళన మధ్య సోమ వారం లోక సభ బిల్లును ఆమోదించగా, బుధవారం రాజ్య సభ ఆమోద ముద్ర వేసింది. సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం, ఆ స్థాయిలో పౌరసత్వ (సవరణ) బిల్లు విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్నది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిఖ్‌ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై రాజ్యసభలో దాదాపు ఆరున్నర గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని విపక్షాలు దుయ్యబట్టాయి. హోంమంత్రి అమిత్‌ షా బిల్లుపై నెలకొన్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారు భారతీయ పౌరులుగా కొనసాగుతారని, ఈ బిల్లుతో వారికి ఏ సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు.

సునాయాసంగానే: రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కొంత ఉత్కంఠ నెలకొంది. మిత్రపక్షాలు జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌తో పాటు అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ బిల్లుకు మద్దతివ్వడంతో మెజారిటీ ఓట్లు సాధించింది. అంతకుముందు, బిల్లును సమగ్ర అధ్యయనం కోసం సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై ఓటింగ్‌ జరగ్గా, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 124 ఓట్లు, అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి.

విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు ఇతర సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు, శివసేనకు చెందిన ముగ్గురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ, ఎన్సీపీలకు చెందిన ఇద్దరు చొప్పున ఎంపీలు, ఒక టీఎంసీ సభ్యుడు గైర్హాజరయ్యారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన తరువాత చట్టరూపం దాలుస్తుంది.

ఈ బిల్లుజి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనలు బుధవారం మరింతగా పెరిగాయి. ధర్నాలు, రాస్తారోకోల తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ శాన్యంలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు మరి కొంత సమయం పట్టనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp