అసోం సీఎం, కేంద్ర మంత్రి ఇళ్ల పై దాడులు

By Kotireddy Palukuri Dec. 12, 2019, 11:51 am IST
అసోం సీఎం, కేంద్ర మంత్రి ఇళ్ల పై దాడులు

పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర సీఎం, కేంద్ర మంత్రి, ప్రజా ప్రతినిధుల ఇళ్ల పై నిరసనకారులు దాడులు చేస్తున్నారు.

బుధవారం రాత్రి ఆందోళనకారులు డులియాజన్‌లోని కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి నివాసంపై దాడి చేశారు. నిరసనకారుల దాడి కారణంగా మంత్రి నివాసంలోని పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. దిబ్రుగఢ్ నుంచి లోక్‌సభకు రామేశ్వర్ తేలి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు.

అంతకుముందు నిరసన కారులు దిబ్రుగఢ్‌లోని సీఎం శర్వానంద సోనోవాల్ నివాసంపై రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఆ పార్టీ నేత సుభాష్ దత్తా నివాసాలపైనా నిరసనకారులు దాడికి పాల్పడినట్టు సమాచారం. అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న గువాహటి, టిన్సుకియా, దిబ్రగడ్, జోహ్రాత్ జిల్లాల్లో సైనిక బలగాలను మోహరించారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ప్రసాదించే ఈ బిల్లు నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఈ బిల్లుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp