బైరెడ్డి కాషాయధారణ

By Sodum Ramana Nov. 29, 2019, 12:04 pm IST
బైరెడ్డి కాషాయధారణ

క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ రాజ‌కీయ నేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న కూతురు శ‌బ‌రితో స‌హా బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డితో క‌ల‌సి ఆయ‌న న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాల‌యంలో గురువారం రాత్రి బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రాంమాధ‌వ్‌, రాష్ర్ట అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు.

క‌ర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి తండ్రి శేష‌శ‌య‌న‌రెడ్డి నందికొట్కూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాడు. 1978లో కాంగ్రెస్ ఐ త‌ర‌పున, 1983లో ఎన్టీఆర్ హ‌వాలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొంది స‌త్తా చాటాడు. 1989లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందాడు. శేష‌శ‌య‌న‌రెడ్డి ఒక ద‌ఫా మంత్రిగా కూడా ప‌నిచేశాడు.శేష‌శ‌య‌న‌రెడ్డి త‌న‌యుడే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి.

బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి 1994, 1999లో టీడీపీ త‌ర‌పున నందికొట్కూరు నుంచి గెలుపొందాడు. 2006 నుంచి 2008 వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు. అనంత‌రం రాష్ట్రంలో  చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న రాజ‌కీయ జీవితం అనేక మ‌లుపులు తిరుగుతూ వ‌స్తోంది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాలంటూ ఆయ‌న డిమాండ్ చేశాడు. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న చంద్ర‌బాబుతో విభేదించి టీడీపీ నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు.

రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించాలంటూ ఉద్య‌మాలు చేశాడు. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా బ‌స్సుయాత్ర చేశాడు. 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం పొంద‌డంతో ఆయ‌న తీవ్ర నిరాశ‌నిస్పృకు లోన‌య్యాడు. రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఆ త ర్వాత కాం గ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశాడు. కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరాడు. ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డితో విభేదాల కార‌ణంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో చేరి కొత్త ప్ర‌స్థానాన్ని ప్రారంభించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp