దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం..కరోనా నేపథ్యంలో ఓటింగ్ శాతంపై నెలకొన్న సందేహాలు

By Srinivas Racharla Nov. 03, 2020, 09:50 am IST
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం..కరోనా నేపథ్యంలో ఓటింగ్ శాతంపై నెలకొన్న సందేహాలు

తెలంగాణలో డబ్బు పంపిణీ ఆరోపణలు,ఉద్రిక్తతల నడుమ అత్యంత ఉత్కంఠకు దారితీసిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.దుబ్బాక ఉప ఎన్నిక కోసం నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 మండలాలలోని 148 గ్రామాలలో 315 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే వీటిలో 89 సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. నియోజకవర్గం మొత్తాన్ని 32 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌కు ఒక్కో పోలింగ్ అధికారిని నియమించారు.ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది.

ఉప ఎన్నికల బరిలో మొత్తం 23మంది అభ్యర్థులు పోటీ దిగారు. వీరిలో ప్రధానంగా పాలక టిఆర్ఎస్,బిజెపి, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.పాలక టిఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు.దుబ్బాక ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కుతో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇందులో 98028 మంది పురుష ఓటర్లు కాగా, 100719 మహిళలు ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం తమకు తమ అభ్యర్థికి అనుకూలిస్తుందని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.

ప్రస్తుతం నియోజకవర్గ ఓటర్లలో సుమారు 30 వేల వరకు యువ ఓటర్లు నమోదయ్యారు. ఈసారి యువత ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.వీరు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావం చేసే అవకాశం లేకపోలేదు.ఇక కరోనా మహమ్మారి కారణంగా దుబ్బాకలో 80 ఏళ్లు పైబడ్డ వృద్దులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఇచ్చారు.1550 పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న సీనియర్ సిటిజన్లు ఇప్పటికే 1340 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 85.92 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం ఎంత మేర ఉంటుందనే సందేహాలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. కాగా ఉప ఎన్నిక పోలింగ్ కోవిడ్ నిబంధనలతో మధ్య జరగాల్సి ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేసారు.కరోనా కారణంగా ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచారు.ఓటర్లు కరోనా నియమ నిబంధనలు పాటించేలా ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారికి స్లిప్పులు ఇచ్చి చివరి గంటలో ఓటింగ్ కు అనుమతించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా దుబ్బాకలో అధికార టీఆర్ఎస్,బిజెపిల మధ్య ఘర్షణలతో ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ హోరాహోరీగా సాగిన ప్రచారంతో తెలుగు రాష్ట్రాలలో ఉప ఎన్నికపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.ఈనెల 10న జరిగే ఓట్ల లెక్కింపుతో ఉప ఎన్నిక విజేత ఎవరనేది తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp