అనంతలో భారీ పరిశ్రమకు అంకురార్పణ, బస్సుల తయారీ యూనిట్ పనులు ప్రారంభం

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. వెళ్లి పోయాయంటూ దుష్ప్రచారం చేసినప్పటికీ కియా యధావిధిగా కొనసాగుతోంది. అదానీ డేటా పార్క్ కి అంతా సిద్దమయ్యింది. అదే సమయంలో పలు భారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ఆవాసంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా విశాఖలో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ప్రతిపాదనలు వచ్చాయి. పెట్టుబడుల కోసం కొన్ని సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో అనంతపురంలో వీర బస్సుల తయారీ కంపెనీ పనులు ప్రారంభించింది.
వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే కడప స్టీల్ కోసం కార్యాచరణ సిద్ధమయ్యింది. దానికి తోడుగా అనంతపురంలో ఆటోమొబైల్ పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీర వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బస్సుల తయారీ యూనిట్ పనులు ప్రారంభించడంతో ఆశలకు రెక్కలొస్తున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగబోతున్నట్టు కనిపిస్తోంది. మొత్తం 4వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు వీర సంస్థ ప్రకటించింది.
అనంతపురం జిల్లా సోమందేవపల్లి మండలం పేటకుంట వద్ద పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నేలను చదును చేసే పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఎలక్ట్రిక్ బస్సుల యూనిట్ ని రెండున్నరేళ్ల లోపు పూర్తి స్థాయి ఉత్పత్తికి సన్నద్ధం చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఇక్కడి నుంచి మొదటి బస్సుని ఏడాదిన్నరలోగా రోడ్డు మీదకు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో కియాకి తోడుగా వీరా కంపెనీ కూడా అనంత పురం పారిశ్రామికరంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తోంది.


Click Here and join us to get our latest updates through WhatsApp