బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

By Aditya Sep. 09, 2021, 03:30 pm IST
బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

ఓ పాత సినిమాలో తల్లి క్యారెక్టర్ వేసిన నిర్మలమ్మ తనకు కోపం వచ్చినప్పుడల్లా ఇక్కడ క్షణం కూడా ఉండనంటూ ట్రంకుపెట్టె తీసుకుని కొడుకు ఇంటి నుంచి కూతురు ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడా ఎవరితోనో లడాయి పెట్టుకుని అలిగి మళ్లీ అదే ట్రంకు పెట్టె పట్టుకుని కొడుకు ఇంటికి వచ్చేస్తుంది. ఆ సినిమాలో పదే పదే రిపీట్ అయ్యే ఈ సీన్ బాగా నవ్వు పుట్టిస్తుంది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహార శైలి చూస్తే ఆ సీనే గుర్తుకొస్తుంది.

తన వారసుడి రాజకీయ ఆరంగేట్రంకు సిధ్ధం చేసిన వ్యూహాలు ఎదురు తన్నినప్పుడల్లా ఆయన వీరలెవెల్లో అలుగు తుంటారు. ఆ అలకను మాన్పించడానికి పార్టీలోని కొందరు నేతలు రంగంలోకి దిగి శక్తివంచన లేకుండా పని చేస్తారు. ఓ ఫైన్ మార్నింగ్ ఆయన అలక అటకెక్కిపోతుంది. బుచ్చయ్య మీడియా ముందు ప్రత్యక్షం అవుతారు. అధిష్టానవర్గం కార్యకర్తల మనోభావాలను, తన ఆవేదనను అర్థం చేసుకుందని, పార్టీ భవిష్యత్తు కోసం అందరం ఇక ముందు మరింత శ్రమిస్తామని ధీర గంభీర స్వరంతో చెబుతారు. మరో మూడు నెలలకో ఆరు నెలలకో అటకెక్కిన అలక బుచ్చయ్యను మళ్లీ ఆవహిస్తుంది. పార్టీ నేతల రాక, మీడియా హడావిడి మళ్లీ మామూలే. ఆయన గారి స్టేట్మెంట్ కూడా యథాతథం. పరమ రొటీన్ అయిన ఈ సీన్ చూసి జనం నవ్వుకుంటున్నా బుచ్చయ్య పెర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గక పోవడమే ఇంట్రెస్టింగ్.

ఆదిరెడ్డిపైనే అసలు కోపం..

మాజీ ఎమ్మెల్సీ, ఒకప్పుడు తన అనుచరుడు అయిన ఆదిరెడ్డి అప్పారావు నగర రాజకీయాల్లో ఏకు మేకు అవడమే బుచ్చయ్య అలకకు అసలు కారణం. ఆయారాం గయారాంల వల్ల పార్టీ నష్టపోతోందని, రాజమహేంద్రవరంలో సెటిల్మెంట్ దందాలు, బ్లేడుబ్యాచ్ ల ఆగడాలు పెరిగిపోయాయని, తాను ఎన్నడూ పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కలేదని బుచ్చయ్య చేసే వ్యాఖ్యలు ఆదిరెడ్డి అప్పారావును, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించినవే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నగరంలో పెత్తనం చేస్తున్నారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సొంత నియోజకవర్గమైన రాజమహేంద్రవరంలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం లేదనేది ఆయన బాధ. 

Also Read : వైయస్సార్ గురించి విప్లవ రచయిత అవంత్స ఏమన్నారు?

బుచ్చయ్య లోకలేనా?

ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. ఆమె టీడీపీ సీనియర్ నేత దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె. భవానీ తరపున ఆమె చిన్నాన్న, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆమె సోదరుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ఇక్కడ రాజకీయంగా తనకు అడ్డుపడుతున్నారని బుచ్చయ్య ఆక్రోశం. స్థానికేతరులైన వీరు సీనియర్ అయిన తనను పక్క నియోజకవర్గానికి పంపించేయడమే కాక, తన సోదరుడు శాంతారామ్ కుమారుడు రవికిరణ్ రాజకీయ ఆరంగేట్రంకు అడ్డుపడడం బుచ్చయ్య అలకల ఆటకు కారణమనేది బహిరంగ రహస్యం. అయితే గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన బుచ్చయ్య రాజమహేంద్రవరానికి లోకల్ అవరని ఆదిరెడ్డి వర్గం ఎదురు దాడి చేస్తోంది. అప్పారావు భార్య వీర రాఘవమ్మ మేయర్ గా కూడా పని చేశారు. రాజకీయంగా బుచ్చయ్య కన్నా తమకే రాజమహేంద్రవరంలో పట్టు ఉందని, నగర రాజకీయాల్లో బుచ్చయ్యను వేలు పెట్టనిస్తే తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆదిరెడ్డి వర్గం అంటోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బుచ్చయ్య తెస్తున్న ఈ రాజకీయ ఒత్తిడిని ధీటుగా ఎదుర్కోవాలని ఆదిరెడ్డి కుటుంబం భావిస్టున్నట్టు సమాచారం.

చంద్రబాబు ఏమి చేస్తారో?

ఈ దఫా అలకసీనులో బుచ్చయ్య కొంత లాఘవం ప్రదర్శించారు. మీడియా లైవ్ లో మాట్లాడేటప్పుడు పార్టీ లైన్ అతిక్రమించకుండా పైకి టీడీపీని విమర్శిస్తూ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బాబు ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్త పడ్డారు. 76ఏళ్ల వయసులో తన రాజకీయ వారసుడిని తెరపైకి తేవడం లేదా తాను పీఏసీ ఛైర్మన్ గిరి సాధించడం లక్ష్యంగా ఆయన రచ్చచేసి బాబుతో పిలిపించుకుని మరీ తన డిమాండ్లు ఆయన ముందు ఉంచారు.అచ్చెన్నాయుడు. ఆదిరెడ్డి వంటి రెండు పెద్ద రాజకీయ కుటుంబాలను కాదని బాబు బుచ్చయ్యకు ప్రాధాన్యం ఇస్తారా? పీఏసీ ఛైర్మన్ ఇస్తారా? చూడాలి.

Also Read : బాపు, వేటూరిలు జీవించి ఉంటే రాధా కృష్ణ పోలికల రాతలకు ఏమయ్యేవారో..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp