లోక్‌సభ ఎన్నికలలో అత్త-అల్లుడు...రాజ్యసభ ఎన్నికలలో శత్రువులు

By Srinivas Racharla Oct. 29, 2020, 09:13 pm IST
లోక్‌సభ ఎన్నికలలో అత్త-అల్లుడు...రాజ్యసభ ఎన్నికలలో శత్రువులు

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే విధంగా బిఎస్‌పి అధినేత్రి మాయావతి వ్యవహరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాత వైరాన్ని మరచి స్నేహహస్తం అందించడమే తప్పు అయిందని అఖిలేష్‌ యాదవ్‌పై ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత బిఎస్‌పి అధికార అభ్యర్థి అయిన రాంజీ గౌతమ్‌పై ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మొత్తం పదిమంది బిఎస్‌పి ఎమ్మెల్యేలలో ఏడుగురు ఆయనకి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు.పైగా రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వానికి మద్దతుగా తమ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. కాగా తమ అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలంతా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ని కలవడం మాయావతికి ఆగ్రహం తెప్పించింది.

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వేళ తమ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బిఎస్‌పి అధినేత్రి మాయావతి మీడియా ముందుకు వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాబోయే శాసనమండలి ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీని ఓడించేందుకు మేము సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని ప్రకటించారు. అఖిలేష్ అభ్యర్థులకి గట్టి పోటీ నిచ్చే ఏ పార్టీకైనా బీఎస్పీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. అలాగే ఎస్‌పి అభ్యర్థులని ఓడించడానికి అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేయడానికి వెనకాడబోమని ప్రకటించి ఆమె రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.

ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికలలో 'అత్త-అల్లుడు 'గా పేర్కొంటూ అఖిలేశ్ - మాయావతి కొత్తగా చుట్టరికం కలుపుకున్నారు. కానీ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలను సమాజ్‌వాది పార్టీ లాగేసుకోవడంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం నెలకొంది. దీంతో మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్‌ 2 కేసును ఉపసంహరించుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా ఆమె పేర్కొంది. నాటి తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ 1995లో సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు నన్ను చంపేందుకు మాయావతి ఆరోపించింది. కానీ బలహీనవర్గాల ఆశీస్సులతో నేను రక్షించబడ్డాను. ఆనాడు సమాజ్‌వాది పార్టీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరకు బీఎస్పీ ఎమ్మెల్యేలను కూడా కిడ్నాప్ చేసిందని ఆమె విమర్శలు గుప్పించింది.

అయినా అవన్నీ మరిచిపోయి కేవలం మతతత్వ శక్తులను ఓడించాలన్న ఉద్దేశంతోనే 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని మాయావతి పేర్కొన్నారు. లోక్‌సభ సాధారణ ఎన్నికలలో పొత్తు ఖరారైన అయినప్పటి నుంచి విజయం కోసం బీఎస్పీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఎస్పీ కార్యకర్తలు తమకు సహకరించలేదని ఆరోపించారు. పొత్తు ఖరారైన మొదటి రోజు నుంచే 1995లో తాను సమాజ్‌వాదీ పార్టీపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా తనపై అఖిలేశ్ ఒత్తిడి చేసినట్లు ఆమె ప్రకటించారు. వాస్తవానికి ఆ కేసులను ఉపసంహరించుకొని తాము పెద్ద తప్పు చేశామని మాయావతి విచారం వ్యక్తం చేశారు. 

కాగా రాజ్యసభ ఎన్నికల వేళ తిరుగుబాటు జెండా ఎత్తిన ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp