అత్యాచారాల భారతం...

By Kiran.G Dec. 09, 2019, 05:29 pm IST
అత్యాచారాల భారతం...

భారతదేశంలో ప్రజలకు అత్యాచారాలు కొత్త కాదు. కానీ ఒక్కో అత్యాచారం మోసుకొచ్చే భావోద్వేగం మాత్రమే భారతీయులకు కొత్త. అవును అది నిజమే. అందుకే అన్ని అత్యాచారాలకు ఒకే విధంగా స్పందించరు. అత్యచారం జరిగిన ప్రాంతం, జరిగిన సమయం, చివరి సమయంలో బాధితులు మాట్లాడిన మాటలు ప్రజల మనస్సులో తీవ్రమైన ముద్ర వేస్తాయి. అందుకే కొన్ని అత్యాచార ఘటనలకు మాత్రమే మీడియా కవరేజ్ ఉంటుంది. దేశ వ్యాప్త గుర్తింపు ఉంటుంది. మిగిలిన వాటిని మీడియా కూడా అంతగా పరిగణలోకి తీసుకోదు. ప్రజలు కూడా అంతగా పట్టించుకోరు. అందుకే ఆయా సంఘటనల్లో నిందితులకు శిక్షలు పడటం లేదన్న విషయం సుస్పష్టం.

నిర్భయ ఘటనకు ముందు అనేక అత్యాచారాలు జరిగినా, నిర్భయ ఉదంతమే చరిత్రలో నిలిచిపోయింది. దీనికి కారణం అత్యాచారం జరిగిన ప్రదేశం, సమయం ప్రముఖ పాత్ర వహించింది. అత్యంత పాశవివికంగా, కదులుతున్న బస్సులో దేశ రాజధానిలో నిర్భయ ఘటన జరగడం అత్యంత సంచలనం కలిగించింది. దేశ రాజధానిలో స్త్రీలకు రక్షణ లేదన్న విషయాన్ని ప్రపంచానికి ఆ ఘటన చాటి చెప్పింది. అదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో నిర్భయ ఘటన పార్లమెంటును కుదిపేసింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దానికి తోడు నిర్భయను నిందితులు హింసించిన తీరు కొందరిలో దాగి ఉన్న క్రూరత్వానికి ప్రతీకగా ఉండటం, మన దేశంలో నిర్భయకు చికిత్స చేసేంత అత్యాధునిక హాస్పిటల్ లేకపోవడంతో సింగపూర్ తరలించడం, ఇలా నిర్భయ కేసులో ప్రతీ విషయం కూడా ప్రజలను తీవ్ర భావోద్వేగ స్థితికి తీసుకెళ్లింది. నిర్భయ పేరుతోనే నిర్భయ చట్టం కూడా ప్రవేశపెట్టారంటే ఆ ఘటన భారతదేశంపై ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు..ఆ కేసులో ఒక మైనర్ మినహా మిగిలిన నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కానీ ఇంతవరకూ వారికి శిక్షలు అమలు చేయలేదు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఇంకా ఎక్కువగా జరగడం విచారింపదగిన విషయం.

Read Also: ఎన్కౌంటర్ ఎఫెక్ట్ - హంతకుడి ఆత్మహత్య

నిర్భయ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత, జమ్మూ కాశ్మీర్ లోని కథువా ప్రాంతంలో జరిగిన చిన్నారి అసిఫాపై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి తీవ్ర నిరసనలకు దారి తీసింది. ఒక తెగపై ఉన్న కోపంతో వారిని తమ ప్రాంతం నుండి తరిమేసేందుకు 8 సంవత్సరాల చిన్నారిని కర్కశంగా పాశవికంగా హత్యాచారం చేయడం అత్యంత నిరసనలకు దారి తీసింది. ఈ భయోత్పాత చర్యలో ప్రధాన భూమికగా ఒక పవిత్రమైన దేవాలయం మౌనసాక్షిగా నిలిచింది. పవిత్రమైన గుడిలో కొన్నిరోజులపాటు పాపను హింసించి అత్యాచారం చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది. చిన్నారిని సుమారు వారం పాటు తీవ్ర హింసకు గురి చేయడం,చిన్నారి పట్ల నిందితులు అమానవీయంగా వ్యవహరించడం లాంటి విషయాలు వెలుగులోకి రావడం వల్ల ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతీ భారతీయుడి గుండె బరువెక్కింది. ఈ సంఘటనలో ప్రధాన దోషులుగా ఉన్నవారికి జీవిత ఖైదు(25 సంవత్సరాలు) విధించారు. సహకరించిన వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కానీ నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు కలిగించిన రెండో ఘటనగా అసిఫా ఉదంతాన్ని చెప్పుకోవచ్చు.

నిర్భయ అసిఫా ల తరువాత ఆ స్థాయిలో దేశవ్యాప్త ఆందోళనలు జరిగింది దిశ ఘటనలోనే. గత నెల 27 న నలుగురు నిందితులు దిశను పాశవికంగా హత్యాచారం చేసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటనపై దేశమంతా భగ్గుమంది. పలువురు రాజకీయనాయకులు ప్రముఖులు ఈ సంఘటనను ఖండించారు. నిరసనలు తెలిపారు. ప్రభుత్వం మరియు పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు సాంకేతిక ఆధారాల ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు.నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని ప్రజలంతా ఆందోళన చేశారు. కానీ నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకున్న రెండు రోజుల్లోనే దిశ వస్తువులను చూపిస్తామని నిందితులు చెప్పడంతో, నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లినప్పుడు,పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ దిశ ఘటనకు ప్రాధాన్యత రావడానికి, దిశ మాట్లాడిన చివరి మాటలు బయటకు రావడం వల్ల కరుడుగట్టిన కఠిన హృదయాలు కూడా కరిగిపోయాయి. మీడియాలో తన చివరి మాటలు బయటకు రావడంతో, దిశ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలందరి అభిప్రాయంగా మారింది.

Read Also: మహిళలపై వేధింపుల నిరోధానికి కొత్త చట్టం

నిశితంగా గమనిస్తే ఈ మూడు ఘటనలు ఒకటి పవిత్రమైన గుడిలో, మిగిలినవి రెండూ మెట్రోపాలిటన్ నగరాల్లో జరిగాయి. ఈ రెండింటిలో ఒకటి కదులుతున్న బస్సులో మరొకటి టోల్ ప్లాజా సమీపంలో జరిగాయి. ఈ సంఘటనల్లో ప్రజల మనస్సులో భావోద్వేగం కలిగించే అంశాలుగా బస్సు,గుడి,టోల్ ప్లాజా,చివరిమాటలు నిలుస్తాయి. ఈ మూడు ఘటనలు మినహా దేశ వ్యాప్తంగా ఇంక అత్యాచారాలు ,హత్యాచారాలు జరగలేదా? ఎన్నో జరిగాయి. మరి కొన్నింటికి మాత్రమే అరిచి గోలపెట్టి ఆందోళనలు చేయడం దేనికి ? మిగిలిన వారివి అత్యాచారాలుగా కనపడటం లేదా ఈ మీడియాకి దేశ ప్రజలకి.?టేకు లక్ష్మి, మానస, శ్రావణి,కల్పన,సుగాలి ప్రీతి ఇంకా కొన్ని వందల,వేల అత్యాచారాలు మీడియాకి గాని ప్రజలకు కానీ ఎందుకు కనబడటం లేదు. ఏదైనా భావోద్వేగ ఘటన తెలిసినప్పుడు మాత్రమే ప్రజలు మీడియా స్పందిస్తారా? హాజీపూర్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కి ఇంకా శిక్ష ఎందుకు ఖరారు చేయలేదు. ఆ ఘటనపై నిరంతరాయంగా ఆందోళనలు ఎందుకు తెలపలేదు ప్రజలు?

అయేషా మీరా హత్యాచారం లో అసలు నిందితులు ఎవరు? ఆ కేస్ ఎందుకు నీరుగారిపోయింది.? ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ నాయకుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు.? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే కొన్ని వేల ఘటనలు నిర్భయ చట్టమున్న మన భారతంలో బిక్కు బిక్కుమంటూ భయంతో వెనక్కు పోతున్నాయి. కొన్ని సంఘటనలకు మాత్రమే స్పందించే మన ప్రజలు, నాయకులు కూడా ఆ కొన్ని సంఘటనల్లోనే న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సమస్యను కూకటివేళ్లతో సహా తీసేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. పైన చెప్పుకున్నట్లే ప్రజలు భావోద్వేగ బాధితులు. ఈ ప్రజలకు అత్యాచారాలు కొత్త కాదు.ఆయా ఘటనలు మోసుకొచ్చే భావోద్వేగాలు మాత్రమే కొత్త. మళ్ళీ దేశాన్ని కుదిపేసే అత్యాచారం జరిగితే తప్ప, తమ ఇంటిపక్కన అత్యాచారం జరిగినా పట్టించుకోరు ఈ ప్రజలు. వీరికి కావాల్సింది నాలుగు రోజులు భావోద్వేగంగా మాట్లాడుకునే ఘటన.. వాటికి మాత్రమే ప్రజలు స్పందిస్తారు. అందుకే దేశంలో కొన్ని వేల అత్యాచారాలు జరిగినా ప్రజల మనసుల్లో నిలిచేవి కొన్ని మాత్రమే.

Read Also: మసిపూసి మారేడుకాయ చేయడం

చట్టాలను మార్చినా, సమస్య మొదలును గుర్తించనంత వరకూ ఈ దేశంలో అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. మనకు కావాల్సింది భావోద్వేగాలతో నెలకొన్న సత్వర న్యాయం కాదు.అసలు అత్యాచారాలే కానరాని భారతం. శరీరంలోపల దాక్కుని ఉన్న వైరస్ ని గుర్తించకుండా,దానికి మందు వేయకుండా , శరీరం వెలుపల ఆ వైరస్ కలుగ చేసే రోగానికి మందు వేయడం వల్ల రోగం పోదు. ఆ క్షణం శరీరానికి సాంత్వన దొరుకుతుందేమో కానీ ఆ రోగం మాత్రం పూర్తిగా పోదు. మూలాల శోధన జరగకుండా అప్పటికప్పుడు సాంత్వన చేకూరడానికి చేసే ఎన్కౌటర్లు అమలుచేసే శిక్షల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే, అసలు విషయం అర్ధం అవుతుంది. మూలాలు గుర్తించకుండా కఠిన శిక్షలు అమలు చేయడం వల్లనో, చట్టాలు మార్చడం వల్లనో ప్రజల్లో మార్పులు రావన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. ప్రజల్లో స్త్రీల పట్ల నెలకొని ఉన్న చిన్న చూపు, స్త్రీ అంటే కోరిక తీర్చుకునే వస్తువనే భావన పోకుండా కఠిన శిక్షలు అమలు చేసినంత మాత్రాన నేరాలు తగ్గుతాయనే భావన ఉన్నంతవరకూ ప్రజల్లో పాలకుల్లో మార్పు రాదనే విషయాన్ని గమనించాలి.

చిన్ననాటి నుండి పిల్లల్లో నైతిక విలువలు బోధించకుండా, ఆడవారి పట్ల గౌరవాన్ని పెంపొందించే తరగతులు పెట్టకుండా మార్పు ఎక్కడ నుండి వస్తుంది. మార్పంటే కఠిన శిక్షలు అమలు చేయడమా? లేదా తప్పు చేశారనే నెపంతో ఎన్కౌంటర్ చేయడమా? లేదా ఆ తప్పు యొక్క మూలలలను గుర్తించి ఆ మూలాలను కూకటివేళ్లతో సహా పెకలించే ప్రయత్నం చేయడమా.. ? ఏది అసలైన మార్పు.. స్త్రీని ఆటబొమ్మలా చూపిస్తూ, దేవదాసి, జోగిని వ్యవస్థలను పెంచి పోషిస్తూ, సగం సగం బట్టలు వేయించి వ్యాపార వస్తువుగా మారుస్తూ వస్తున్న మన సంస్కృతిలో మార్పు ఎక్కడ నుండి వస్తుంది. ముందుగా స్త్రీని వ్యాపారవస్తువుగా, చూపించడం ఆపాల్సిన అవసరం ప్రభుత్వాలపై లేదా ?. స్త్రీల పట్ల ఉన్న చులకన భావాన్ని చిన్ననాటి నుండే తీసివేసేలా పిల్లల మనస్సులో ముద్ర వేసేలా తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు, తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం లేదా. అత్యాచారాలు పెరగడానికి దారి తీస్తున్న పరిస్థితులను గుర్తించి ఆ పరిస్థితులను మార్చడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషిలో విచక్షణను కోల్పోయేలా చేస్తున్న మద్యం అమ్మకాలను నిరోధించి, పిల్లలతో పాటు పెద్దలనూ ప్రభావితం చేసే పోర్న్ సైట్లను, నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Read Also: తెలుగు రాష్ట్రాల్లో ఆగని అత్యాచారాలు.. దిశ తర్వాత మరో రెండు గ్యాంగ్ రేప్ లు.. ఎందుకిలా జరుగుతోంది.?

రోగ కారకాన్ని గుర్తించకుండా రోగానికి చేసే చికిత్స వల్ల ఉపయోగం ఎంతుందో, మూలలను గుర్తించకుండా విధించే శిక్షల వల్ల వచ్చే ఉపయోగం కూడా అంతే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అత్యాచారాలకు కారణమవుతున్న అసలు మూలకారణాలు కనుగొని,వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. అత్యాచారాలను భావోద్వేగాల ఆధారంగా చూసినన్ని రోజులు, అత్యాచారాలను అదుపుచేసే అవకాశాలు ఉండవు. ఎప్పుడైతే అత్యాచారాలను ప్రజల భావోద్వేగాలతో ముడిపెట్టకుండా వ్యవస్థ చూస్తుందో, ఆ రోజే అత్యాచారాలపై వ్యవస్థ స్పందించే తీరులో మార్పు వస్తుంది. అత్యాచారానికి గురైన ప్రతీ మహిళకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వాలు స్పందించాలి.ఆ "దిశ"గా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల భావోద్వేగాలకు లొంగి న్యాయ విచారణలు చేసినన్ని రోజులు దేశంలో అత్యాచార బాధితులలో కొందరికి మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రతీ మహిళకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించలేని ప్రభుత్వాల వల్ల నేరాలు ఆగుతాయా? ప్రజలు కూడా కొన్ని సంఘటనలకు మాత్రమే స్పందించి వాటికి మాత్రమే న్యాయం చేయాలని రోడ్డెక్కడం ఎంతవరకు సబబు.? ప్రతి మహిళ ప్రజల దృష్టిలో సమానం కాదా? ప్రభుత్వాలు కూడా చట్టాలలో ఉన్న లోపాలను సవరించి,ప్రతీ మహిళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తరం పిల్లలలో ఆడవారిపట్ల ఉన్న చులకనభావాన్ని చిన్నతనం నుండే తీసివేయడానికి, కొన్ని తరగతులను ప్రతీ పాఠశాల కళాశాలల్లో తప్పనిసరిగా బోధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.అలా చేస్తే తర్వాతి తరంలోనైనా అత్యాచారాలు లేని భారతాన్ని చూసే అవకాశం ఉంది..అత్యాచార మూలాలను అంతం చేయనంత వరకూ దేశంలో అత్యాచారాలు ఆగవు,ఎన్ని కఠిన శిక్షలు విధించినా, చట్టాలను చేసినా,చివరికి ఎన్కౌంటర్ల పేరుతొ నిందితులను అంతం చేసినా అత్యాచారం అనే జాడ్యం ఆగే అవకాశం ఎంతమాత్రం లేదని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp