బాక్సాఫీస్ తలైవా ...

By Kiran.G Dec. 12, 2019, 07:01 pm IST
బాక్సాఫీస్ తలైవా ...

1950 డిసెంబర్ 12 న రామోజీ రావు,రామాబాయి దంపతులకు, శివాజీరావు గైక్వాడ్ అనే సాధారణ వ్యక్తి జన్మించాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, బస్ కండక్టర్ గా మారాక సినిమా రంగంలోకి వెళ్లి నటుడిగా మారతాడని, ఆ సాధారణ బస్ కండక్టర్ మొత్తం ఇండియన్ సినిమాకి సూపర్ స్టార్ గా ఎదుగుతాడని ఎవ్వరు ఊహించలేదు. తనకే సాధ్యమయిన స్టైల్ తో సినిమా రంగాన్ని కుదిపేస్తాడని, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. కమల్ హాసన్ లా రకరకాల వేషాలు మార్చే, విభిన్న పాత్రలేవీ అతను చేయలేదు. కానీ మాస్ కా బాప్ గా ఎదిగాడు.తమిళ సినిమా తలైవాగా మారిపోయాడు. తమిళ బాక్సాఫీస్ రారాజుగా మాత్రమే కాకుండా యావత్తు ఇండియా బాక్సాఫీసు రారాజుగా మారిపోయాడు. అతనే కే బాలచందర్ పాఠశాల నుండి వచ్చిన మరొక రత్నం రజనికాంత్.

శివాజీ రావ్ లో ఉన్న సహజ సిద్దమైన ప్రతిభా పాటవాలను గుర్తించిన అతని స్నేహితుడు రాజ్ బహదూర్, శివాజీ రావ్ కి కొద్దిపాటి డబ్బు ఇచ్చి చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించామని సలహా ఇవ్వడంతో, స్నేహితుడు ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో చెన్నై చేరుకుని దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాంగల్ లో చిన్న పాత్రలో కనిపించారు. అప్పటికే శివాజీ పేరుతో తమిళ నటులు సినిమా పరిశ్రమలో ఉండటంతో శివాజీరావు పేరును రజనీకాంత్ గా మార్చారు బాల చందర్.. బాలచందర్ ఆధ్వర్యంలో నటనలో మెరుగులు దిద్దుకుని, మొదట్లో విలన్ పాత్రలు పోషిస్తూ, విలన్ పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించి,మొదటిసారిగా నాయకుడిగా "చిలకమ్మ చెప్పింది"(1977) సినిమాలో నటించారు.తెలుగులో రూపొందిన ఈ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా "నంది" అవార్డు కూడా వచ్చింది. 1978 లో తమిళంలో వచ్చిన "భైరవి" సినిమా రజనీకాంత్ ని తమిళ తెరకి తిరుగులేని సూపర్ స్టార్ ని చేసింది. అక్కడనుండి రజనీ వెనుతిరిగి చూసుకోలేదు.

భైరవి, బిల్లా, దళపతి ,బాషా,ముత్తు, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజీ, రోబో ఇలా సినిమా సినిమాకి ఆకాశాన్ని తాకే అంచనాలను పెంచుకుంటూ,నేటితో 70 వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా సరే నవ యువకుడిలా దర్బార్ సినిమాలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు రజనీకాంత్. ఏ వ్యక్తికైనా ఆయా భాషల వరకే అభిమాన గణం ఉంటారు. కానీ రజనీకాంత్ దానికి అతీతం. తమిళంలో మాత్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా రజనీ స్టైల్ కి అభిమాన గణం ఉన్నారు. అంతటితో ఆగలేదు. జపాన్ సింగపూర్ లాంటి దేశాల్లో అక్కడి హీరోలతో సమానంగా రజనికి అభిమానులుండటం ఆశ్చర్యపరిచే విషయం. రజని క్రేజ్ ఒకానొక దశలో ఆకాశాన్ని తాకేంతగా పెరిగింది. కబాలి సినిమా సమయంలో విమానాలను కూడా రజనీకాంత్ సినిమా ప్రకటనలకోసం వాడటం అతని క్రేజ్ ని తెలియపరుస్తుంది.

స్టైల్ అంటే రజనీ, రజనీ అంటే స్టైల్...

యువకులు కూడా అతని స్టైల్ కి ఫిదా అవ్వాల్సిందే. యువత మొత్తం ఆ స్టైల్ ని అనుకరించాల్సిందే. రజనీని హీరోలందరిలో ప్రత్యేకంగా నిలిపేది అతనికి ఒక్కడికే సాధ్యమైన విభిన్నమైన స్టైల్.. అవును రజనీ స్టైల్ ని ఎవరైనా అనుకరించగలరేమో కానీ తనలాగా మేజిక్ మాత్రం తెరపై చూపించలేరు. ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే అని రజనీ సిగార్ వెలిగిస్తుంటే ప్రేక్షకులందరూ ఆ స్టైల్ కి దాసోహం అన్నారు. ఎప్పటికీ స్టైల్ అంటే రజనీ, రజనీ అంటే స్టైల్... రజనీ సిగార్ కాల్చినా, బబుల్ గమ్ తిన్నా, కళ్ళజోడు తీసినా, ఆఖరికి నడిచినా సరే అది స్టైల్ గానే ఉంటుంది. బహుశా స్టైల్ అన్న పదం రజనీ కోసమే పుట్టిందేమో అన్నట్లుగా ఉంటుంది రజనీ నటన. స్టైల్ విషయంలో అతనొక ఎవరెస్టు శిఖరం. ఎవరైనా ఎంతటి స్టార్ అయినా స్టైల్ విషయంలో రజనీని అనుకరించాల్సిందే..

రజనీలో ఆధ్యాత్మికత కోణం

రజనీకాంత్ తెరపై ఎంత స్టైల్ గా ఉంటారో, తెర బయట అంత సాధారణంగా ఉంటారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య మానవునిగా జీవించడానికి అయన ఇష్టపడతారు. రజనీలో ఉన్న ఈ కోణమే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆధ్యాత్మిక జీవనానికి రజనీ ప్రాధాన్యత ఇస్తారు. ప్రశాంతంగా గడపడానికి హిమాలయాలకు అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటారు. అత్యంత నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారు. ఒకసారి బెంగుళూరులో ఒక గుడిలో రజనీకాంత్ ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఎవరో భిక్షగాడు అనుకుని ఒక మహిళ 10 రూపాయలు ధర్మం చేసి వెళ్లిపోయిందట. కొంతసేపటి తరువాత రజనీకాంత్ అని తెలిసి క్షమాపణ అడిగిందట. స్టార్ డం మేకప్ లేకపోతె నా నిజస్వరూపం అదే.. ఆ సంఘటన నేనెవరిననేది ఆ సంఘటన ఎల్లప్పుడూ నన్ను గుర్తు చేస్తూనే ఉంటుందని రజనీకాంత్ గుర్తుచేసుకుంటూ ఉంటారు. అందుకే పై మెరుగులు ఆహార్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతానని రజనీకాంత్ ఎప్పుడు చెప్తూఉంటారు.

రజనీ ఒక పడిలేచిన కెరటం

నరసింహా సినిమా తర్వాత కొంతకాలం రెండేళ్లపాటుగా సినిమాల్లో నటించలేదు రజనీ . .సుమారు రెండేళ్ల తర్వాత బాబా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రజనీ .. కానీ ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు విపరీతమైన నష్టాలనే మిగిల్చింది. దాంతోపాటు ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. బాబా సినిమా డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పరిగణలోకి తీసుకుని వారికి వచ్చిన నష్టాన్ని తిరిగి చెల్లించి వారి మనసులు చూరగొన్నారు రజనీ . బాబా సినిమా తర్వాత రజనీకాంత్ నటించడం మానేశారని ఆ సమయంలో ఎన్నో పుకార్లు వ్యాపించాయి. దాదాపు రెండేళ్ళ విరామం అనంతరం,చంద్రముఖి సినిమాతో తన అద్భుతమైన నటనతో తన పని అయిపోయిందన్న వారందరి నోళ్లు మూయించారు రజనీ.శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమాతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఎవరైతే తన పని అయిపోయిందన్నారో, వాళ్లే మెచ్చుకునేలా నటించి చూపించాడు రజనీకాంత్. అదే రజనిలో ఉన్న స్పెషల్.

అనంతరం శంకర్ దర్శకత్వంలో రజని నటించిన "రోబో"సినిమా రజనీకాంత్ స్టామినా ఏంటో అందరికీ చాటి చెప్పింది. 60 ఏళ్ల వయసులో రజనీ తెరపై చేసిన విన్యాసాలు చూసి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. పనిపై తనకు ఉండే అంకితభావం, నిబద్ధత, పాత్ర కోసం రజని పడే తపన సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా విస్మయానికి లోను చేసింది.ఇండియాలోనే మొట్టమొదటి మోషన్ కాప్చర్ మూవీ కొచ్చాడయాన్లో రజనీకాంత్ హీరోగా నటించారు. ప్రస్తుతం దర్బార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

రజనీకాంత్ పై జోకులు

రజనీకాంత్ కి ఉన్న స్టైల్, నటనలో అసాధారణ వేగాన్ని చూసిన ప్రేక్షకులు రజనీకాంత్ పై అనేక జోకులను రూపొందించారు. రజనీకాంత్ కి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదనే ఉద్దేశ్యంతో రూపొందించే జోకులు చదివిన ప్రతిఒక్కరి మోములో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయం. రజనీ ఏం చేసినా నమ్ముతారని అసాధ్యమైన విషయాలను రజనీకి ఆపాదించి హాస్యాన్ని పంచుతున్నారు కొందరు.

ఒక పరుగు పందెంలో రజనీకాంత్ పాల్గొనగ అందులో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు రజనీకాంత్ గెలుచుకున్నారు.
రజనీకాంత్ గ్రైనేడుని శత్రువులపై విసిరితే, ఆ గ్రైనేడు తగిలి 50 మంది చనిపోయాక పేలుతుంది.
ఒకవేళ రజనీకాంత్ ఇండియా క్రికెట్ టీమ్ కోచ్ అయితే ఏమవుతుందో ఊహించండి. ఇండియా క్రికెట్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ గెలుస్తుంది.
ఆడం & ఈవ్ రజనీకాంత్ పిల్లలే.
ఒకవేళ రజనీకాంత్ సర్జరీ చేయించుకుంటే డాక్టర్లు మత్తు మందు తీసుకోవాలి . ఇలా కొన్నివేల జోక్స్ రజినీపై ఉన్నాయి. ఏకంగా rajanikanthjokes.com అని వెబ్సైటు రన్ అవుతుందంటే రజనీ పేరులో ఉన్న గొప్పతనం అర్ధం అవుతుంది.

రజనీకాంత్ ఒక శిఖరం.రజనీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే తమిళనాడులో జరిగే హడావిడి అంతాఇంతా కాదు. రజనీకాంత్ కటౌట్లకు అభిమానుల పాలాభిషేకాలు,రక్తదానాలు చేస్తూ తమ అభిమాన నటుడిపై తమకున్న అభిమానాన్ని చూపుతూనే ఉంటారు. థియేటర్ల దగ్గర దాదాపు పండగ వాతావరణం నెలకొంటుంది. ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండటం రజనీకాంత్ ని చూసి నేర్చుకోవచ్చు. కానీ చంద్రముఖి విజయోత్సవ సభలో మాత్రం తాను కూలబడటానికి ఏనుగును కాదని, కూలబడినా లేచి మరింత వేగంగా పరిగెత్తే గుర్రాన్నని వ్యాఖ్యానించారు. కారణం అంతకు ముందు బాబా సినిమా తర్వాత రజనీకాంత్ నటనకు స్వస్తి చెప్తారని, ఇకపై సినిమాలు చేసే సత్తా రజనిలో లేదని విమర్శకులు రజనీకాంత్ పై పలు విమర్శలు చేసారు. దానికి సమాధానంగా పడినా లేచి మరింత వేగంగా పరిగెత్తే గుర్రాన్నని చెప్తూ రజనీ విమర్శకుల నోళ్లు మూయించారు.

నిజానికి రజనీ పెద్ద అందగాడేమీ కాదు. తన సహచర నటుడు కమల్ హాసన్ తో పోల్చి చూస్తే గొప్ప నటుడు కూడా కాదు. కానీ వృత్తిపట్ల తనకున్న నిబద్ధత, విజయం సాధించాలన్న తపన, కృషి,ఓటమిని సులభంగా అంగీకరించని మనస్తత్వం,ఆకాశానికి ఎదిగినా ఒదిగి ఉండే తన ఆలోచనలు రజనీని సూపర్ స్టార్ ని చేసాయి. ఎంత పెద్ద స్టార్ అయినా నిరాడంబరంగా ఉండే రజనీ జీవన శైలి ప్రతి ఒక్కరికీ ఎన్నో జీవన పాఠాలను నేర్పిస్తుంది. ఇప్పటికే ఎన్నో రాష్ట్ర జాతీయ,ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు రజనీ.. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను దేశంలో రెండవ మూడవ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ విభూషణ్,పద్మ భూషణ్ లను రజనీకాంత్ ని వరించాయి. 2021 లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారాయన. ప్రజలు నాకు అన్నీ ఇచ్చారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని రజనీ వ్యాఖ్యానించడం చూస్తుంటే తమిళనాట రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నట్లు అర్ధం అవుతుంది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించి ప్రజలకు అండగా రజనీకాంత్ నిలవాలని,ఈరోజు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రజనీకాంత్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp