చిరాగ్ పాశ్వాన్ పిలుపుతో తీవ్ర గందరగోళంలో కమలం ఓటర్లు

By Srinivas Racharla Oct. 25, 2020, 08:51 pm IST
చిరాగ్ పాశ్వాన్ పిలుపుతో తీవ్ర గందరగోళంలో కమలం ఓటర్లు

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో జేడీయూ ఓటమికి కంకణం కట్టుకున్న చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీష్ కుమార్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాడు.ఎన్టీయే కూటమి నుంచి వైదొలిగి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన ఎల్‌జెపి వ్యవహారం తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా ఉంది.ఇక ఎన్నికల ప్రచారంలో చిరాగ్ చేస్తున్న ప్రకటనలు బీజేపీ ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి.

తాజాగా రాబోయే ప్రభుత్వం నితీశ్ రహిత ప్రభుత్వం కావాలని లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జెపి) నేత చిరాగ్ పాశ్వాన్ పిలుపునిచ్చి ఎన్డీయే కూటమిని ఇరకాటంలోకి నెట్టాడు.తొలివిడత ఎన్నికలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎల్‌జెపి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశాడు. సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ఎల్‌జెపి ప్రకటించిన సంగతి తెలిసిందే.మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 138 సీట్లలో ఎల్‌జెపి తమ అభ్యర్థులను బరిలో దింపనుంది. ఇప్పటికే జేడీయూ,దాని మిత్రపక్షమైన జితిన్‌ రామ్‌ మాంఝీ యొక్క హెచ్‌ఎమ్‌(ఎస్)పై 122 మంది ఎల్‌జెపి అభ్యర్థులను చిరాగ్ ఎంపిక చేశాడు.

ఇవాళ ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ వేదికగా జేడీయూ అధ్యక్షుడు,సీఎం నితీశ్ కుమార్‌కు మద్దతివ్వని బీజేపీ ఓటర్లంతా ఎల్‌జెపికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. ఆదివారం చిరాగ్ చేసిన ఓ ట్వీట్‌లో ''బీహార్ ఫస్ట్.. బీహార్ ఫస్ట్.. అమలు కావాలంటే ఎల్‌జెపికి ఓటు వేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.బిజెపి అభ్యర్థి పోటీలో లేనిచోట ఎల్‌జెపికి ఓటేయండి. రాబోయే ప్రభుత్వం నితీశ్ రహిత ప్రభుత్వమే కావాలి'' అని ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు.

కాగా ఎన్డీయే కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు లభించిన తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్‌యే అని బిజెపి అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.అలాగే బీహార్‌లో ముఖ్యమంత్ పదవికి నితీశ్ కుమార్‌కు బిజెపి మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టంగా ప్రకటించాడు.కానీ చిరాగ్ పాశ్వాన్‌పై బిజెపి చర్య తీసుకోకపోవడం వలన బిజెపి యొక్క "బి టీం" ఎల్‌జెపి అని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.తమ మిత్రుడైన జేడీయూ నేత నితీశ్ కుమార్‌ని అదుపు చెయ్యడానికి బిజెపి రచించిన ఎన్నికల వ్యూహంగా ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ నితీశ్ కుమార్‌కు మద్దతు ఇవ్వని బీజేపీ ఓటర్లను ఎల్‌జెపికి ఓటు వేయమని చిరాగ్ అభ్యర్థించడం వల్ల కమలం పార్టీ ఓటర్లు మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది.పైగా చిరాగ్ పాశ్వాన్ పిలుపు ఎన్డీయే కూటమిలో ఎలాంటి అలజడికి దారి తీస్తుందోనని ప్రతిపక్ష మహాకూటమి ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp