ప‌వ‌న్ విష‌యంలో బీజేపీ ఆ లెక్క‌లేసింది..!

By Raju VS Jan. 17, 2020, 01:10 pm IST
ప‌వ‌న్ విష‌యంలో బీజేపీ ఆ లెక్క‌లేసింది..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపులు ఖాయ‌మ‌ని జ‌న‌సేన ఆశిస్తోంది. త‌మ నాయ‌కుడు చెప్పిన‌ట్టు 2024 ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కుతుంద‌ని ఊహాల్లో సాగుతున్నారు. బీజేపీతో జ‌త‌గ‌ట్టిన త‌ర్వాత జ‌న‌సేన భ‌విత‌వ్యం స‌మూలంగా మారిపోతుంద‌ని చెప్పుకుంటోంది. కానీ తీరా చూస్తే బీజేపీ లెక్క‌లు వేరుగా ఉన్నాయి. ఆపార్టీ అధిష్టానం త‌న లెక్క‌లు తాను వేస్తోంది. త‌న ప్ర‌యోజనాల‌కు అనుగుణంగా పావులు క‌దుపుతోంది. బీజేపీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌వ‌న్ ని ఉప‌యోగించుకోవాల‌ని అంచ‌నా వేస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌కు మేలు చేస్తార‌ని ఆశిస్తోంది.

ప్ర‌స్తుతానికి బీజేపీ ఆశ‌ల‌న్నీ తెలంగాణా మీద ఉన్నాయి. ఆరాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు, సామాజిక స‌మీక‌ర‌ణాలు బాగా క‌లిసి వ‌స్తాయ‌ని భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే గ‌త ఎన్నిక‌ల్లో బ‌లంగా ప్ర‌య‌త్నించింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏకంగా 4 సీట్లు గెలిచింది. ప్ర‌స్తుతం తెలంగాణా నుంచి కిష‌న్ రెడ్డికి క్యాబినెట్ లో చోటు కూడా ద‌క్కింది. తెలంగాణా నేత‌కు క్యాబినెట్ లో మాత్ర‌మే కాకుండా త‌మ పార్టీకే చెందిన నేత‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీటు ద‌క్కాల‌ని బీజేపీ భావిస్తోంది. దానికి అనుగుణంగానే వివిధ ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ప‌వ‌న్ కూడా తోడు చేసుకుంటే త‌మ‌కు తెలంగాణాలో తోడ‌వుతార‌ని అంచ‌నాలేస్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ క‌మ‌లానికి క‌లిసి వ‌స్తుంద‌ని, అందుకు అనుగుణంగా ప‌వ‌న్ ని తెలంగాణా రాజ‌కీయాల్లో దింపాల‌ని యోచిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప‌యోగించుకోవ‌డ‌మే కాకుండా కీల‌కాంశాల్లో ప‌వ‌న్ ని ముందు పీఠిన నిలిపే య‌త్నం చేయ‌బోతోంద‌ని స‌మాచారం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌లు వేరుగా ఉన్నాయి. బీజేపీ త‌న ల‌క్ష్యాల సాధ‌న కోసం ప‌వ‌న్ ని ఉప‌యోగించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటే జ‌న‌సేన అధినేత మాత్రం ఏపీ వ్య‌వ‌హారాల్లో త‌న‌కు ఏదో మేలు జ‌ర‌గ‌బోతోంద‌నే ఊహాగానాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి బీజేపీకి ప్ర‌స్తుతం ఏపీ మీద పెద్ద ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ తో చేతులు క‌ల‌ప‌డం వెనుక అస‌లు ల‌క్ష్యం తెలంగాణా అనే విష‌యం ప‌లువురు అంగీక‌రిస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో సెటిల‌ర్ల‌తో పాటుగా ఇత‌రులను ఆక‌ట్టుకోవ‌డానికి ప‌వ‌న్ ని ఉప‌యోగ‌ప‌డితే మిష‌న్ తెలంగాణా పూర్తి చేయ‌డం వీలుప‌డుతుంద‌ని కాషాయ బృందాలు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఏపీలో ఎన్నిక‌లు లేక‌పోయినా తెలంగాణ స్థానిక ఎన్నిక‌లు, అనంత‌రం సాధార‌ణ ఎన్నిక‌ల క‌న్నా ముందే తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో ప‌వ‌నాస్త్రం మొద‌ట ఆరాష్ట్రంలో ప్ర‌యోగించేందుకు త‌గ్గ‌ట్టుగా బీజేపీ స‌న్నాహాలు చేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp