బెంగాల్‌లో దుబ్బాక తరహా ప్రయోగం చేస్తున్న బీజేపీ!

By Sravan Babu Mar. 07, 2021, 12:30 pm IST
బెంగాల్‌లో దుబ్బాక తరహా ప్రయోగం చేస్తున్న బీజేపీ!

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సాధించిన ఘనవిజయం వెనక పైకి కనిపించని అంశం ఒకటి ఉంది. బీజేపీకి చెందిన కొందరు కరుడుగట్టిన కార్యకర్తలు, మంచి మంచి ఉద్యోగాలలో ఉన్న మోదీ వీరాభిమానులు ఎక్కడెక్కడినుంచో వచ్చి రఘునందన్ రావు విజయంకోసం విపరీతంగా కష్టపడ్డారు.

పోలింగ్‌కు వారం-పది రోజులముందునుంచి దుబ్బాకలోనే ఫంక్షన్ హాల్స్‌లో మకాం వేసి నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్ళి రాత్రింబవళ్ళూ కష్టపడి ప్రచారం చేశారు. స్థానికంగా, బీజేపీ నేత జితేందర్ రెడ్డి వారిని సమన్వయం చేసుకుంటూ వారికి కావలసిన వసతి సౌకర్యాలను సమకూర్చారు. అలా రఘునందన్ రావు విజయం - వెనక వివిధ ప్రాంతాలనుంచి వచ్చి సైలెంట్‌గా పనిచేసుకెళ్ళిన ఈ కరుడుగట్టిన కార్యకర్తల పాత్రకూడా ఉంది. వీళ్ళను పోల్ మేనేజిమెంట్ పరిభాషలో చెప్పాలంటే ఫుట్ సోల్జర్స్ అంటారు.

Also Read:మున్సిపల్ ఫలితాల తర్వాత మారబోతున్న రాజకీయ సమీకరణాలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలను కనీ వినీ ఎరగని విధంగా ఎనిమిది దశలలో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం వెనక కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రభావం ఉందనే ఆరోపణ ప్రచారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మమత ఇప్పటికే ఈసీ నిర్ణయం వెనక బీజేపీ కుట్ర ఉందని మొత్తుకుంటోంది. ఒకటిమాత్రం నిజం - గతంలో గరిష్టంగా ఐదో, ఆరో విడతలలో జరిగే పోలింగ్‌ను ఎనిమిది దశల్లో జరపాలని నిర్ణయించడం కొద్దిగా దురుద్ధేశపూరితమేనని అనిపిస్తోంది. ఇలా ఎనిమిది దశలలో పోలింగ్ నిర్వహించటం ద్వారా బీజేపీకి రెండు మూడు రకాలుగా లబ్ది కలుగుతుంది.

1. దుబ్బాకలో అమలు చేసిన ప్రయోగంలాగా, బెంగాల్ చుట్టుపక్కల ఉన్న జార్ఖండ్, బీహార్, అసోమ్ రాష్ట్రాలనుంచి తమ పార్టీకి చెందిన కరుడుగట్టిన కార్యకర్తలు/ఫుట్ సోల్జర్స్‌ను ఎన్నికలు జరిగే ప్రతిచోటకూ తరలించటానికి బీజేపీకి అవకాశం లభిస్తుంది.
2. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి సంస్థాగత నిర్మాణం పటిష్ఠంగా లేదు. చాలా నియోజకవర్గాలలో అసలు బీజేపీ ఉనికే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో దూకుడుగా ఉండే తృణమూల్ కార్యకర్తలను తట్టుకోవటానికి బీజేపీకి సావకాశంగా ఉంటుంది.
3. మోదీ, అమిత్ షా ద్వయం బెంగాల్‌‍లో విస్తృతంగా ఎన్నికల ప్రచార సభలలో పర్యటించటానికి అవకాశం దొరకటం కీలకమైన కారణం. అవును మరి, బీజేపీకి బెంగాల్‌లో మంచి కరిష్మా ఉన్న నేతలు ఎవరూలేరు. మోదీ, అమిత్ షా లే వారి స్టార్ క్యాంపెయినర్‌‍లు. ఇలా పెద్ద గ్యాప్‌తో ఎన్నికలు జరగటం వలన మోదీ, అమిత్ షాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనటానికి, ఒక ఫేజ్‌లో ఎక్కడైనా తమ పార్టీ బలహీనంగా కనబడితే దానిని కవర్ చేయటంకోసం తదుపరి ఫేజ్‌లో ఫోకస్ ఎక్కువ పెట్టటానికి బీజేపీకి అవకాశం కలుగుతుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే మోదీ, అమిత్ షా జంట దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా రెండు అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఒకటి ముస్లిమ్ ఓట్ బ్యాంక్, రెండోది స్థానికత.

1. ముస్లిమ్ ఓట్ బ్యాంక్
పశ్చిమ బెంగాల్‌లో ముస్లిమ్‌లు అత్యధికంగా 27 నుంచి 30 శాతందాకా ఉంటారు. వీరు 2011లోనూ, 2016లోనూ తృణమూల్‌కే సాలిడ్‌గా ఓటు వేసేవారు. అయితే ప్రస్తుతం రెండు ముస్లిమ్ పార్టీలు ఈ ఎన్నికలతో బెంగాల్ బరిలోకి దిగుతుండటంతో మమతకు పడే ఓట్ బ్యాంకుకు చిల్లుపడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

హుగ్లీ జిల్లాకు చెందిన అబ్బాస్ సిద్దిఖీ అనే మతగురువు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే పార్టీ పెట్టి కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిలో చేరాడు. హుగ్లీ జిల్లాలో ఉండే ఫుర్ఫురా అనే ఇతని మతశాఖకు గణనీయమైన మద్దతే ఉంది. మరోవైపు మన హైదరాబాద్‌కు చెందిన ఎమ్ఐఎమ్ ఒంటరిగా బరిలోకి దిగబోతోంది. మహారాష్ట్రలో, బీహార్‌లో ఎన్నికల ఫలితాలను మజ్లిస్ ఎలా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. అసలు ఈ ఓవైసీ బీజేపీతో మిలాఖత్ అయ్యి, దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో కమలనాథులకు పరోక్షంగా సాయపడుతున్నాడనే ఆరోపణ బలంగా ప్రచారంలో ఉంది.

Also Read:టీడీపీకీ బెజవాడ తర్వాత విశాఖ తలనొప్పి!

ముస్లిమ్‌లు ఈ రెండు పార్టీల ప్రభావంలో పడకుండా గంపగుత్తగా తృణమూల్‌కు వేస్తే మమత విజయావకాశాలు మెరుగవుతాయి. అలా కాకుండా ముస్లిమ్ ఓట్లు చీలితేమాత్రం అది బీజేపీకి కలిసొస్తుంది. మరోవైపు 17శాతం ఉన్న మతువా ఓట్లుకూడా కీలక పాత్ర పోషించనున్నాయి. బంగ్లాదేశ్ దేశం ఏర్పడినప్పుడు అక్కడనుంచి భారత్‌లోకి వచ్చిన హిందూ శరణార్థులే ఈ మతువాలు. వీరి ఓట్లకోసం అటు బీజేపీ, ఇటు మమత తీవ్రంగా పోటీ పడుతున్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా 27-30 శాతం ఉన్న ముస్లిమ్‌ల పట్ల మమత ప్రదర్శిస్తున్న సానుకూల వైఖరిని సాకుగా చూపడంద్వారా 70శాతం ఉన్న హిందువులఓట్లనుంచి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

2. స్థానికత
ఈ ఎన్నికలను యావత్ దేశం దీదీ వర్సెస్ మోదీగా చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ బీజేపీకి ఓటు వేయటమంటే మోదీకి ఓటు వేసినట్లే. మరి ఇలాంటి పరిస్థితిలో బెంగాలీలు తమ సొంత ఆడకూతురు మమతక్కను గెలిపిస్తారా, లేక 'బయటి మనిషి' మోదీవైపు మొగ్గు చూపుతారా అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న.

ఇదే మమతకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతోందికూడా. అందుకే మమత బీజేపీపైన సాధ్యమైనంత బలంగా, బీజేపీపైన 'బయటి మనిషి' ముద్ర వేయటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఆమె రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ - బెంగాల్ ఎన్నికలను 'మన ఆడకూతురుకు, బయటిమనిషికి మధ్య పోరు'గా అభివర్ణిస్తున్నాడు.

అసలే బెంగాలీలకు ఆత్మగౌరవం ఎక్కువ. తమను తాము ఒక అత్యున్నతమైన జాతిగా భావిస్తారు. వారిలో రాజకీయ చైతన్యంకూడా ఎక్కువే. మరి ఇలాంటి సందర్భంలో వారు ఏవిధంగా టర్న్ తీసుకుంటారనది ఆసక్తికరంగా ఉంది. మరోవైపు ఇది మోది - అమిత్ షా వంటి దిగ్గజాలకు, మమతకు మధ్య పోరు కాబట్టి మహిళాలోకంలో దీదీకి సానుభూతి పెరిగే అవకాశం ఉంది.

అటు మమతకు ప్రత్యామ్నాయంగా దీటైన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేకపోవటంకూడా బీజేపీకి మైనస్ పాయింటేనని చెప్పాలి. ఇలా ప్రకటించలేకపోవటానికి కారణం బీజేపీలో గతంలో ఉన్న నేతలకు, పొలోమంటూ పెద్దఎత్తున వచ్చి కొత్తగా చేరుతున్న తృణమూల్ నేతలకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటం.

పై రెండు అంశాలతోపాటుగా, ఇటీవలికాలంలో తీవ్రంగా పెరిగిపోయిన పెట్రోధరలు, వంట గ్యాస్ ధరలు, రైతుల ఆందోళన వంటివి బీజేపీపై బాగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎన్నికల్లో ఆసక్తికర పోరు

అయితే పది సంవత్సరాలుగా అధికారంలో ఉండటంతో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీ ఇన్‌కంబెన్సీ), తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర స్థాయిలో ఉన్న అసమ్మతి, ప్రభుత్వంలో కిందస్థాయిలో బాగా పెరిగిపోయిన అవినీతి వంటివి మమతాబెనర్జీకి ప్రతికూల అంశాలు. మమతకు ముఖ్యఅనుచరుడిగా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి, అసమ్మతి కారణంగా ఈమధ్య బీజేపీలో చేరిన సువేందు అధికారి అంశం కూడా తృణమూల్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. సువేందు కుటుంబానికి దక్షిణ బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మిద్నాపూర్, పురూలియా, బంకారా మొదలైన నాలుగు జిల్లాలలో మంచి పట్టు ఉంది. ఇక్కడ ఉన్న 63 అసెంబ్లీ స్థానాలలో సువేందు ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.

అసలు ఈ ఎన్నికలను తృణమూల్-బీజేపీ మధ్య పోటీగానే దేశమంతా చూస్తున్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయేది ముక్కోణపు పోటీ. కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్‌లతో ఏర్పడిన కూటమి ప్రభావం పూర్తిగా తీసేయదగ్గదేమీకాదు. కాకపోతే, ఈ మూడు పక్షాలలో ప్రస్తుతం సంస్థాగతంగా బలంగా ఉన్నది తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే. బీజేపీకి చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లే లేని పరిస్థితికూడా ఉంది. ఈమధ్యే తృణమూల్ నుంచి సువేందు అధికారి, రజీబ్ బెనర్జీ వంటి కొందరు బడానేతలు వచ్చి చేరారు. ఇక తృతీయ కూటమిని చూస్తే ఒకప్పుడు అధికారాన్ని అనుభవించిన లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీల ఓట్ బ్యాంక్ ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు 26 సీట్లు, కాంగ్రెస్ కు 44 సీట్లు వచ్చాయి. ఐఎస్ఎఫ్ పార్టీకి ముస్లిమ్‌లలో మంచి బలమే ఉంది.

తృణమూల్, బీజేపీలలో ఏదో ఒకదానికి పూర్తి మెజారిటీ వస్తే సరేసరి, హంగ్ వస్తే మాత్రం తృణమూల్‌కు కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలా ఏర్పడిన ప్రభుత్వాలను పడగొట్టి ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవటం అనే నికృష్టపు పనిలో బీజేపీ ఇటీవల ప్రావీణ్యం సాధించింది కాబట్టి ఆ హంగ్ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో చెప్పటం కష్టం. మరోవైపు దీదీ ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే, ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమే ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి కావటం ఖాయం! అదే జరిగితే ఆమె బెంగాల్‌లో తన వారసుడు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పగ్గాలు అప్పచెబుతారని అంటున్నారు.

 సవాళ్ళు - ప్రతి సవాళ్ళు
ఈ ఎన్నికలలో వివిధ నేతలు చేసిన సవాళ్ళు-ప్రతిసవాళ్ళు ఆసక్తికరంగా మారాయి. బెంగాల్‌లో 200 స్థానాలను గెలిచి తీరుతామంటూ మొదట అమిత్ షా సవాల్ విసిరారు. దానిపై మమత రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ బీజేపీ గెలిచే స్థానాలు రెండంకెలు దాటితే తన రాజకీయ వ్యూహరచన వ్యాపారాన్ని మూసేసుకుంటానని ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఇక, మమతకు ధైర్యం ఉంటే ఆమె ఎప్పుడూ పోటీచేసే భవానీపూర్ నియోజకవర్గంనుంచి కాకుండా నందిగ్రామ్ నియోజకవర్గంనుంచి పోటీచేయాలని పలువురు బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా చేస్తున్న సవాల్‌ను స్వీకరిస్తూ, అక్కడనుంచే పోటీ చేస్తానని ఆమె జనవరిలో ప్రకటించారు. దానికి కట్టుబడుతూ నిన్న అభ్యర్థుల జాబితాను విడుదలచేస్తూ నందిగ్రామ్ నుంచి పోటీచేయనున్నట్లు మమత వెల్లడించారు. మరోవైపు నందిగ్రామ్‌లో మమతను 50,000 మెజారిటీతో ఓడించలేకపోతే తాను రాజకీయాలనుంచి నిష్క్రమిస్తానని సువేందు అధికారి ప్రకటించారు.

Also Read:సీట్ మారి సవాల్ నిలబెట్టుకున్న మమత

మమత నందిగ్రామ్‌కు బయటి మనిషి అని సువేందు వ్యాఖ్యానించారు. ఈయన 2016 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నందిగ్రామ్ సువేందు సొంతగడ్డ. ఆయన అదే ప్రాంతానికి చెందినవాడు. నందిగ్రామ్‌లో గతంలో మమత ఉద్యమం నడిపిన సమయంలో సువేందు కీలకపాత్ర పోషించారు. అలాంటి చోట పోటీకి దిగి మమత అందరినీ షాక్‌కు గురిచేశారనే చెప్పాలి. ఇక్కడ మమత వర్సెస్ సువేందు కావటంతో ఈ నియోజకవర్గం బెంగాల్ ఎన్నికల్లో అత్యంత హాట్ సీట్‌గా మారింది. ఇక్కడ 28 శాతం ముస్లిమ్‌లు ఉండటం మమతకు కలిసొచ్చే అంశం.

మొత్తంగా బెంగాల్ ఎన్నికలకు అన్ని పార్టీలు యుద్దానికి సిద్దమయినట్లే సిద్ధపడుతున్నాయి.. ఎన్నికలు కూడా యుద్ధం స్థాయిలోనే జరగటం ఖాయం..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp