వీర్రాజు.. ఇలా అయితే కష్టం..!

By Karthik P Jun. 22, 2021, 07:15 pm IST
వీర్రాజు.. ఇలా అయితే కష్టం..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయ సమర్థతపై సందేహాలు వస్తున్నాయి. టీడీపీ – బీజేపీ కలసి అధికారాన్ని పంచుకున్న సమయంలో సోము వీర్రాజు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై సహేతుకమైన విమర్శలు, ఆరోపణలు చేసేవారు. తద్వారానే ఆయన పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. రాష్ట్ర ప్రజలను ఆకర్షించారు. నాటి పనితీరుతోనే సోముకు ఏపీ బీజేపీ పగ్గాలు దక్కాయనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం సోము వీర్రాజు పనితీరు రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. పసలేని విమర్శలు, అర్థరహిత వ్యాఖ్యలతో సోము వీర్రాజు తన సమర్థతపై ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారు.

ఇదీ కూడా తెలియదా..?

విశాఖలో భూములు తాకట్టు పెట్టి అప్పులు తెస్తారా..? ఏం జగన్‌ సొంత ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టరు..? అంటూ సోము వీర్రాజు వింతైన ప్రశ్న సంధించారు. ఈ పరిణామంతోనే సోము రాజకీయ సమర్థత, అవగాహనపై అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన పాలన ఎలా చేస్తాయి..? ప్రధాని, ముఖ్యమంత్రులు వారి సొంత డబ్బు ఖర్చు పెట్టి పాలన చేస్తారా..? వారి సొంత ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తారా..? కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అక్కడ ప్రధానిగా ఉన్న మోదీ ఏం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ అధ్యక్షుడునైన తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందనే చిన్నపాటి లాజిక్‌ను సోము ఇక్కడ మిస్‌ అయ్యారు.

సోముకు చురుక్కుమంది..

గడిచిన రెండేళ్ల పాలనతో తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో వైసీపీ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే సమయంలో ప్రకటనల రూపంలో సవివరంగా తెలియజేసింది. అందులో శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్, గౌరవవేతనం.. ఇలా ఏ కేటగిరి ఉద్యోగాలు ఎన్ని అనే సమాచారాన్ని పక్కగా పొందుపరిచింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన వైఎస్‌ జగన్‌.. ఆ సమయంలో ప్రైవేటు ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడైన సోముకు ఈ విషయం రుచించకపోవడం సహజమే. ప్రత్యేక హోదా రాలేదంటే.. అందరూ బీజేపీవైపే చూస్తారు. అందుకే సోము కవర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి వస్తుందంటే అందుకు వైసీపీ ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. ఇంతకూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తానన్న ప్రాజెక్టులు ఏవో సోము వీర్రాజే చెప్పాలి.

ప్రజా జీవితంలో విమర్శలు ఉండవా..?

వ్యక్తిగత జీవితం వేరు. ప్రజా జీవితం వేరు. ప్రజా జీవితంలో రాళ్లు పడతాయి.. పూలు పడతాయి. విమర్శలు సర్వసాధారణం. ఈ విషయం సోముకు తెలియదనుకోలేం. కానీ టీడీపీ నేత అశోక్‌ గజపతి రాజు విషయంలో సోము వైసీపీ నేతలకు సుద్దులు చెబుతున్నారు. అశోక్‌ కుటుంబం ఎన్నో దానధర్మాలు చేసిందన్న సోము వీర్రాజు.. వైసీపీ నేతలకు అశోక్‌ను విమర్శించే స్థాయిలేదంటున్నారు. సోము చెప్పిన స్థాయి పద్ధతినే అవలంభిస్తే.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని విమర్శించాలంటే.. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాన మంత్రి లేదా.. ఆ పదవులకు పోటీ పడే వారే విమర్శించాలి. తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు విమర్శలు వస్తాయి. వేలాది ఎకరాలు ఉన్న మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌ ఉన్న సమయంలో.. ఆ ట్రస్ట్‌తో, గజపతుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్, టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పని చేసి.. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తన పూర్వపని చేస్తున్న చెరుకూరి కుటుంబరావును మాన్సస్‌ ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా ఏ లక్ష్యంతో తీసుకున్నారు..? దానధర్మాలు చేసే వారిని విమర్శించకూడదనేలా మాట్లాడుతున్న సోముకు ఈ విషయాల వెనుక మర్మం తెలుసనుకోలేం.

Also Read : కాగ్‌ బయటపెట్టిన బాబు మద్యం అక్రమాల చిట్టా..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp