బీజేపీ విజయం డీజీపీ, కమిషనర్లకు అంకితం: బండి సంజయ్‌

By Karthik P Dec. 04, 2020, 07:54 pm IST
బీజేపీ విజయం డీజీపీ, కమిషనర్లకు అంకితం: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ అహంకారపూరిత వైఖరిని, అవినీతిని అంతం చేసే పార్టీ బీజేపీయేనని గ్రేటర్‌ ప్రజలు గుర్తించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ నేతలతో కలసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. బీజేపీ విజయాన్ని డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు అంకితం చేస్తున్నామని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల ఆంక్షల మేరకు బీజేపీ పని చేస్తుందని చెప్పారు.

‘‘ టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు నిలువరించలేదు. డీజీపీ చూసి చూడనట్లుగా వ్యవహరించారు. పోలీసులు చేత మా పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేయించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఈ విజయం వారిద్దరికీ అంకితం చేస్తున్నాం. రక్తమోడి కార్యకర్తలు పోరాడారు. సీఎం కేసీఆర్‌ అహంకారపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలకు టీఆర్‌ఎస్‌లో ఎవరు బాధ్యత వహిస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నాం. అడ్డదారిలో గెలిచేందుకు, ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించిన విషయం ప్రజలు గుర్తించారు. సీఎం కేసీఆర్‌ అహంకారాన్ని, అవినీతిని అంతం చేసే పార్టీ బీజేపీ అని ప్రజలు ఆశీర్వదించారు.

జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలనో చర్చించి నిర్ణయిస్తాం. కేంద్రం ద్వారా నిధులు మంజూరు చేయిస్తాం. వాటిని సరైన దిశగా ఖర్చు పెట్టాలి. పేర్లు మారిస్తే ఒప్పుకోం. మాకు అహకారం లేదు. తెలంగాణ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల కోసం పని చేస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భవిష్యత్‌లో ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తామ’’ని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp