Bjp.modi - గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

By Prasad Nov. 25, 2021, 08:30 pm IST
Bjp.modi - గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

ఒకవైపు పెట్రోల్‌.. డీజిల్‌.. గ్యాస్‌ ధరలు తగ్గిస్తున్నారు... రైతులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నా ససేమిరా అంటూ ఏడాది పాటు భీష్మించి కూర్చున్న కేంద్రం ఆఘమేఘాల మీద కొత్త వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేసిపడేసింది. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు... ప్రారంభోత్సవాలు. ‘మమ్మల్ని గెలిపిస్తే అద్భుతమైన ప్రగతి .. విపక్షాలు గెలిస్తే యూపీ అదోగతి’ అనే ముమ్మరంగా సాగుతున్న ప్రచారం. యూపీ గెలుపే లక్ష్యంగా అటు కేంద్రం.. ఇటు ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలు సంయుక్తంగా పోటీపడుతున్నాయి. హామీల మీద హామీలు ఇస్తున్నాయి. ఇటు మోడీ... అటు యోగి లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. ఇలా యూపీలో గెలుపు కోసం బీజేపీ అధికంగానే ప్రయాసపడుతున్నట్టు అర్ధమవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాదిలో జరిగి ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజార్టీతో గట్టెక్కుతుందని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా 90 స్థానాలకు పైబడి తగ్గుతాయని సర్వేల్లో తేలింది. ఇదే సమయంలో సమాజ్‌వాది పార్టీ గణనీయంగా పుంజుకుంది. రానురాను ఆ పార్టీకి ఆదరణ పెరగడం, బీజేపీ తగ్గుతుండడం రాష్ట్ర నాయకత్వాన్నే కాదు.. కేంద్ర నాయకత్వాన్ని కూడా కలవరపెడుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో యూపీ, పంజాబ్‌ పెద్ద రాష్ట్రాలు. రైతు ఉద్యమం వల్ల పంజాబ్‌లో బీజేపీ కనీసం సోయలో లేకుండా పోయింది. ఎన్డీయేలో ఉంటూ వచ్చిన సమాజ్‌వాది అకాలీదల్‌ పార్టీ కొత్త వ్యవసాయ చట్టాలతో బీజేపీకి గుడ్‌బై చెప్పింది. ఈ రాష్ట్రంలో బీజేపీ కనీసం పది స్థానాలు కూడా పొందే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్‌, గోవాలలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్నా సీట్లు, ఓట్లు సంఖ్య తగ్గిపోనుంది. మణిపూర్‌లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్నా కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు నెలకొంది. విచిత్రంగా యూపీ, ఉత్తరాఖండ్‌, గోవాలతోపాటు మణిపూర్‌లో కూడా గడిచిన నాలుగు నెలల నుంచి బీజేపీ ఓటింగ్‌ శాతం, సీట్లు వచ్చే సంఖ్య సర్వేల ప్రకారం తగ్గుతూ వస్తుంది. ఇదే బీజేపీ అధిష్టానాన్ని ఆందోళన రేకెత్తిస్తోంది. మిగిలిన రాష్ట్రాలలో ఎలా ఉన్నా యూపీ చేజారితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ప్రమాదం తప్పదని మోడీ, అమిత్‌షాలు ఆందోళనలో ఉన్నారు. యూపీ చేజారితే దేశవ్యాప్తంగా మూడవ ప్రత్యామ్నాయం తెరమీదకు రావడంతోపాటు తమ వ్యతిరేకుల గళం పెరుగుతుందని ఈ ద్వయం ఆందోళన చెందుతోంది.

Also Read : Up Congress - పోరాడుతున్నా ప్రయోజనం లేదు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రమేనా?

ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి నల్లేరు మీద నడకలా లేదని బీజేపీ పెద్దలు గుర్తించారు. ముఖ్యంగా మోడీ, యోగీలకు ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కారణంగానే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇరత పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సమాజ్‌వాది పార్టీలో కీలక నేతలకు గేలం వేస్తున్నారు. ఈ ప్రయోగం పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో విఫలమైందని తెలిసి కూడా బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆయుధాన్ని వాడుతోంది.

రైతు చట్టాలను రద్దు చేసి రైతుల మెప్పు పొందాలనుకున్నా ఫలితం దక్కలేదు. రైతులు ఉద్యమాన్ని వీడడం లేదు. మరోవైపు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల మీద సామాన్యులు, మధ్యతరగతిలో వస్తున్న వ్యతిరేకతను చూసి వాటి ధరలు తగ్గించారు. ఇటీవల యూపీలో కీలకమైన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ను ప్రారంభించిన మోడీ, యోగీలు గురువారం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. గతం నుంచి ఈ ప్రతిపాదన ఉన్నా ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. గత నెల 16న ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభానికి వచ్చిన మోడీ, తాజాగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రావడం ద్వారా కేవలం పది రోజుల వ్యవధిలో యూపీలో రెండవసారి పర్యటించారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన సభను కాస్తా మోడీ ఎన్నికల ప్రచార సభగా మార్చారు. 2024 గడువు నాటికి దీని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు దీని నిర్మాణం వల్ల గౌతమ్‌బుద్ద నగర్‌, బులంద్‌ షహర్‌, అలీఘర్‌, హాపూర్‌ అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీ చెప్పారు. పనిలో పనిగా తన ప్రసంగంలో విపక్షాలపై మండిపడ్డారు.

సమాజ్‌వాది పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ లక్ష్యంగా ‘ఈ ప్రాజెక్టును మూసివేయాలని కోరుతూ గత ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాని ఈ రోజు డబుల్‌ ఇంజన్‌ శక్తితో మా ప్రభుత్వాలు విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది. మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఈ వ్యక్తుల ఆలోచనలు సొంత కుటుంబాల అభివృద్ధికి మాత్రమే పాటుపడతాయి’ అని విమర్శలు గుప్పించారు. ఇలా సాగిన మోడీ ప్రసంగం శంకుస్థాపన సభను కాస్తా ఇలా ఫక్తు ఎన్నికల సభలా మార్చివేశారు.

Also Read : UP Elections - యూపీలో ఎస్పీ-ఆప్ జోడీ -అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సరికొత్త సవాల్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp