నిన్న పటేల్, నేడు కామరాజ్... కాంగ్రెస్ నేతలను సొంత చేసుకుంటున్న బీజేపీ

By Gopal.T Feb. 28, 2021, 01:30 pm IST
నిన్న పటేల్, నేడు కామరాజ్... కాంగ్రెస్ నేతలను సొంత చేసుకుంటున్న బీజేపీ

దేశ రాజకీయాల్లోకి, ప్రత్యేకించి బీజేపీ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ ఇద్దరికీ ముందు బీజేపీ అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ.. దీనదయాళ్ ఉపాధ్యాయ... ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పాయ్, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి.

అప్పట్లో జనసంఘ్ కానీ, ఆ తర్వాత బీజేపీ కానీ, వాటి అనుబంధ సంస్థలైన ఆర్ఎస్సెస్, విశ్వహిందూ పరిషత్ వంటివి, విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ సంస్థలన్నీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి, వర్ధంతి చేస్తూ ఉండేవారు. తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి, వర్ధంతి కూడా జరుగుతూ ఉండేవి. అదో హిందూ మత విశ్వాసాల ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ. దీని వెనుక ఆరెస్సెస్, విహెచ్పి సంస్థలు క్రింది స్థాయిలో పనిచేస్తుంటే బీజేపీ రాజకీయాలు చేస్తూ ఉండేది.

బీజేపీలో వాజ్ పాయ్, అద్వానీ ఎంత ప్రముఖంగా కనిపించేవారో, వినిపించే వారో, ఆరెస్సెస్ లో కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, వినాయక్ దామోదర్ సావర్కర్, వంటి వారి జయంతి, వర్ధంతి, జరిగేవి. అలాగే విహెచ్పి లో మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ వంటి వారి జయంతులు, వర్ధంతులు జరుగుతూ ఉండేవి. ఇవి కాక భజరంగ్ దళ్ అంటూ మరో సంస్థ పుట్టుకొచ్చి హిందూ మత ప్రేరేపిత కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. డాక్టర్ జీ క్యా సందేశ్ హై అంటూ గోడల మీద నినాదాలు రాస్తూండేవారు.

మోడీ-షా రంగ ప్రవేశం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకూ ఉన్న నేతలు, వ్యవస్థాపకులు, నిర్మాతలు, ప్రచారక్ లు, ఇత్యాది నేతలంతా వెనక్కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు కానీ, దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు కానీ, గోల్వాల్కర్ పేరు కానీ ప్రజల్లో వినిపించడం లేదు. అవన్నీ ఆయా సంస్థల కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యాయి. 

ఇప్పుడు మోడీ-షా ద్వయం ఇతర నేతలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే సర్దార్ పటేల్ ను మోడీ-షా నేతృత్వంలోని బీజేపీ సొంతం చేసుకుంది. ఆది నుండి కాంగ్రెస్ నాయకుడిగా నిలిచిన సర్దార్ పటేల్ ఇప్పుడు బీజేపీ ఆదర్శ పురుషుడు అయ్యాడు. పటేల్ కోసం గుజరాత్ లో ఐక్యతా చిహ్నం పేరుతో నరేంద్ర మోడీ ఓ భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఆ తర్వాత నేతాజీని కూడా సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు.  మోడీ-షా ద్వయం. వీరికంటే ముందే ఛత్రపతి శివాజీని సొంతం చేసుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన పటేల్, బోస్ తర్వాత మోడీ-షా ద్వయం దీక్షిణాదిలో ఇప్పుడు మరో ద్రవిడ నేత జాతీయ కాంగ్రెస్ నేత కామరాజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. 

తమిళనాట రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ - షా ద్వయం ఇప్పుడు ఈ ద్రవిడ రాష్ట్రంపై దృష్టిపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ నేతగా ప్రసిద్ధి చెందిన కామరాజ్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం మొదలు పెట్టి తద్వారా తమిళ ఓటర్ల మద్దతు పొందాలని చూస్తున్నారు. 

మహాత్మా గాంధీని కాల్చి చంపిన గాడ్సే  గురించి పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ను, హిందుత్వ పార్టీని పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఇప్పుడు మోడీ-షా ద్వయానికి ఉత్తరాది రాష్ట్రాలకు పటేల్ అవసరం వచ్చింది. అలాగే 1966 ప్రాంతంలో హిందుత్వ శక్తులు నడిపిన గోవధ నిషేధ ఉద్యమంలో ఢిల్లీలోని కామరాజ్ ఇంటికి నిప్పు పెట్టి కామరాజ్ పై భౌతిక దాడికి కూడా దిగారు. అయితే ఆయన తప్పించుకుని హిందుత్వ పార్టీపై నిప్పులు చెరిగారు. 

ఇప్పుడు మోడీ-షా ద్వయం ఈ చరిత్రను మరుగున పెట్టి కామరాజ్ ను తమ సొంతం చేసుకుని తమిళుల ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో కామరాజ్ ను ప్రజలు ఇప్పటికి కొలుస్తారు. కామరాజ్ పేరు చెపితేనే ఓట్లు గలగలా రాలుతాయి. అక్కడి డీఎంకే కానీ అన్నా డీఎంకే కానీ కామరాజ్ పేరు చెప్పకుండా ఓట్లు అడగవు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఇలా ప్రతి నేత కామరాజ్ పేరు వాడుకున్నవారే. అందుకే ఇప్పుడు మోడీ-షా ద్వయం కామరాజ్ పై కన్నేశారు. 

మోడీ మద్రాస్ పర్యటన సందర్భంగా కామరాజ్ ఫ్లెక్సీలు విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఉత్తరాదిన పటేల్, బోస్ తో పాటు  దక్షిణాదిన, ప్రత్యేకించి తమిళనాట తాము కామరాజ్ ను కూడా గౌరవిస్తున్నామని చెప్పి తంబీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్లో లో కూడా బోస్, ఠాగూర్ వంటి వారి పేర్లు చెప్పి బెంగాలీయుల ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్కన రేపు 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో తెలుగువాళ్ళ ఓట్ల కోసం ఎన్టీఆర్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. తమిళనాడులో కామరాజ్ బొమ్మలాగే ఆంధ్రాలో ఎన్టీఆర్ బొమ్మ కూడా కాషాయం ప్రచారంలో దర్శనమివ్వొచ్చు. అయితే ఈ ప్రయోగాలు ఉత్తరాదిన ఉపయోగపడ్డట్టు దక్షిణాదిన ఉపయోగపడతాయా లేదా అన్నది తమిళనాడులో తేలిపోతుంది. అంతవరకూ మోడీ - షా ద్వయం సొంతం చేసుకోబోతున్న బీజేపీ యేతర నేతలను గమనిస్తూ ఉండడమే. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp