సుజనా రూటు మార్చారు..!

By Kotireddy Palukuri Sep. 17, 2020, 04:34 pm IST
సుజనా రూటు మార్చారు..!

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అమరావతిపై తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీకి అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలన్న తన లక్ష్యానికి అనుగుణంగా ఢిల్లీలో తనదైన శైలిలో ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు తన పరిధి మేరకు అమరావతి పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.

రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం(హోం శాఖ) ఏపీ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసినా కూడా సుజనా చౌదరి ఎప్పటిలాగే రాష్ట్ర రాజధాని కేంద్ర పరిధిలోనిదంటూ వాదిస్తున్నారు. ఈ రోజు సుజనా చౌదరి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాను కలిశారు. భారత రాజ్యాంగంలో రాజధాని అంశం స్పష్టంగా చెప్పకపోవడంతో.. ఆర్టికల్‌ 246, 248 కింద ఆ అధికారం పార్లమెంట్‌ దక్కుతుందంటూ వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటయ్యే సమయంలో హైదరాబాద్‌ను రాజధానిగా కేంద్రమే ప్రకటించిందని చరిత్రను కూడా తన వినతిపత్రంలో పొందుపరిచారు. అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చిందంటూ విభజన చట్టం సెక్షన్‌ 6 (రెడ్‌విత్‌ 94)ను ప్రస్తావించారు. మొత్తం మీద మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపాలని సుజనా కోరుతున్నారు.

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి ఒకలా ఉంటే.. సుజనా వైఖరి అందుకు భిన్నంగా ఉందని తాజా చర్యలతో స్పష్టమైంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సుజనా వ్యవహారంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం తర్వాత అమరావతిపై సుజనా దూకుడు దగ్గిందనే చెప్పాలి. అంతకు ముందు నిత్యం అమరావతిపై మాట్లాడడం, ట్వీట్టర్‌లలో పోస్టులు, రాష్ట్ర పతి నుంచి కేంద్ర మంత్రుల వరకూ కలిసి వినతిపత్రాలు ఇవ్వడం చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ నేతలను వదిలేసి.. అధికారులను కలవడం విశేషం. సుజనా తీరును గమనిస్తున్న బీజేపీ నేతలు.. తెలుగు బీజేపీ నేత రూటు మార్చారంటూ సెటైర్లు వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp