అప్పడాలు తినండి,కరోనాని జయించండి:కేంద్రమంత్రి సలహా

By Srinivas Racharla Jul. 24, 2020, 05:30 pm IST
అప్పడాలు తినండి,కరోనాని జయించండి:కేంద్రమంత్రి సలహా

కరోనా పేరు వినిపిస్తేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.మహమ్మారికి మందు ఎప్పుడొస్తుందా అని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు తమకు తోచిన చిట్కాలు చెప్పేవారు కొందరు. మా ప్రోడక్ట్ వాడితే కరోనా తగ్గిపోతుందని ప్రచారం చేసుకునేవారు మరికొందరు.ఇక కరోనా వైరస్‌పై వదంతులను నమ్మవద్దని కేంద్రం,డబ్ల్యూహెచ్‌ఓ ప్రచారం చేస్తోంది.

అందుకు విరుద్ధంగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలోని ఓ కేంద్రమంత్రి విడుదల చేసిన వీడియో మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. జల వనరులు,గంగానది పునరుజ్జీవనం,పార్లమెంటరీ వ్యవహారాలు,భారీ పరిశ్రమల సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ కొత్త అప్పడాల బ్రాండ్‌ను ఆవిష్కరిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు.ఆ వీడియోలో "బాబ్జీ పాపడ్ "బ్రాండ్‌ అప్పడాలు తింటే కరోనా వైరస్‌ను జయించే యాంటీబాడీస్ తయారవుతాయంటూ వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ అవుతున్న వీడియోలో కేంద్ర ప్రభుత్వ పథకమైనా 'ఆత్మనిర్భర్ భారత్' ద్వారా తయారీదారులు ‘బాబ్జీ పాపడ్’ను ఉత్పత్తి చేశారని బిజెపి ఎంపీ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. ఇది కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఇక పాపాడ్ తయారీదారులకి నా శుభాకాంక్షలు.వారికి విజయం లభించాలని కోరుకుంటున్నా అని మేఘ్వాల్ చెబుతున్నట్టు వీడియోలో వినిపిస్తోంది.

బిజెపి మంత్రి వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే నెటిజన్లు వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. కొందరు "ఇంకా దేశానికి కరోనా వ్యాక్సీన్ అవసరం లేదు. మోదీ ప్రభుత్వంలో మంత్రిగారు ఇప్పటికే 'బాబ్జీ' పాపాడ్‌ను విడుదల చేశారు. అవి తింటే చాలు.. ఆటోమేటిక్ గా మీ శరీరంలో వైరస్‌తో పోరాడేందుకు యాంటీబాడీస్ తయారైపోతాయి" అని సెటైర్లు వేస్తున్నారు.

కాగా యూత్ కాంగ్రెస్ "బిజెపి నేతలు అప్పడాలను కరోనా మందులంటూ అమ్ముతున్నారు. ఇలాంటి నేతల కోసమే కాంగ్రెస్ హయాంలో ‘విద్యాహక్కు’ చట్టాన్ని తీసుకొచ్చాం" అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇక నెట్టింట వైరల్‌గా మారిన తన వీడియోపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp