వివాదానికి తెరలేపిన రాహుల్ ట్వీట్‌.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ మంత్రి

By Srinivas Racharla Oct. 28, 2020, 06:00 pm IST
వివాదానికి తెరలేపిన రాహుల్ ట్వీట్‌.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ మంత్రి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత రాహుల్‌ ట్విటర్‌లో తొలి దశ ఎన్నికలపై బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపాడు.పనిలో పనిగా న్యాయం, ఉపాధి, రైతులు, కార్మికుల కోసం ఈ సారి మీ ఓటు మహాఘట్ బంధన్‌కే వేయాలి అని విజ్ఞప్తి చేశాడు.అయితే పోలింగ్‌ రోజున ఇలా ట్వీట్‌ చేయడం చెయ్యడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే గయ పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత,వ్యవసాయ శాఖ మంత్రి ప్రేమ్‌కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ఇవాళ ఉదయం మంత్రి ప్రేమ్‌కుమార్ గయలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు.ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల సింబల్‌తో కూడిన స్కార్ఫ్ మెడలో వేసుకొని,పార్టీ గుర్తు ఉన్న మాస్కుని ధరించి పోలింగ్ బూత్‌లోకి ఆయన ప్రవేశించాడు. అయితే ఎన్నికల అధికారి కానీ, పోలీసు సిబ్బంది కానీ మంత్రిని ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఆయనను వెన్నంటే ఉండటం గమనార్హం. కానీ విషయం బయటికి పొక్కడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంత్రి ప్రేమ్ కుమార్‌పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇక కోవిడ్ నిబంధనలు,ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వలన బీహార్ మొదటి దశ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 33.1 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.తాజా సమాచారం మేరకు పోలింగ్‌ జరుగుతున్న 71 నియోజకవర్గాలలో అత్యధికంగా లఖిసరయ్‌లో 40.16శాతం, నవాడాలో 38.08శాతం పోలింగ్‌ నమోదైంది. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp