ఇరిగేషన్ అతిధిగృహాన్ని ఖాతాలో వేసుకున్న మాజీ మంత్రి

By Voleti Divakar Jul. 11, 2020, 06:46 pm IST
ఇరిగేషన్ అతిధిగృహాన్ని ఖాతాలో వేసుకున్న మాజీ మంత్రి

పోలవరం జాతీయ ప్రాజెక్టు పేరు చెప్పి ఒక మాజీ మంత్రి భారీగా సొమ్ము చేసుకున్నారు. పోలవరం ప్రధాన కుడికాలువ పనుల్లో ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిచింది. ఏకంగా ఆయన విజయవాడలోని ఇరిగేషన్ అతిధిగృహాన్నే కమిషన్ల కింద తన ఖాతాలో వేసుకున్నారు. ఈ బహుళ అంతస్తుల భవనం ఖరీదు కోట్లలో ఉంటుందని అంచనా. ఈ పనుల్లో మాజీ ఆర్థిక మంత్రి వియ్యంకుడికి కూడా వాటా దక్కింది. ఆర్థిక మంత్రి ఖాతాలో ఇది ఆయన వియ్యంకుడికి దక్కినట్లు భావిస్తున్నారు. ఈ విషయాలన్నీ వెల్లడించింది. ప్రత్యర్థి పార్టీకి చెందిన వైసిపి నాయకులు కాదు...మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న బిజెపి నాయకులు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ చెప్పినట్లు టిడిపి నేతలు, అనుకూల మీడియా లో ప్రచారం చేసుకున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టు పేరిట జరిగిన దోపిడీ వ్యవహారాలన్నీ మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలో భాగంగా సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీయే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును ఎటిఎంలా వాడుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, బిజెపి నాయకులు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు వంటి వారు పోలవరంలో జరిగిన అవినీతిని పదేపదే ఎండగట్టారు. అయితే కేంద్ర నివేదిక పేరిట టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడంతో బిజెపి నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు.

దీనిలో భాగంగా టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవ రంతో పాటు, ఇతర అవినీతి వ్యవహారాలను మళ్లీ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పోలవరం, ఇళ్ల నిర్మాణం తదితర అంశాల్లో గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలను అన్యాపదేశంగా ప్రస్తావించారు. అయితే ఇప్పటికీ బిజెపిలోని ఒక వర్గం టిడిపికి కొమ్ముకాసే పనిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి పార్టీ అభివృద్ధి కన్నా వారి సామాజిక నేతల ప్రయోజనాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp