పోలవరంలో అవినీతి ముమ్మాటికి నిజం...కేంద్రమంత్రికి బిజెపి ఫిర్యాదు

By Voleti Divakar Jul. 08, 2020, 06:30 pm IST
పోలవరంలో అవినీతి ముమ్మాటికి నిజం...కేంద్రమంత్రికి బిజెపి ఫిర్యాదు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, అయితే ఈ విషయంలో కేంద్రాన్ని, జలవనరుల శాఖను తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు తప్పుదోవట్టించినట్లు బిజెపి నాయకులు భావిస్తున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి ముమ్మాటికి నిజమని వారు ఘంటాపథంగా స్పష్టం చేస్తున్నారు. జలవనరుల శాఖ టిడిపి ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడంపై కూడా నివేదిక పంపినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ విషయమై కేంద్రానికి, జలవనరుల శాఖకు ఫిర్యాదు కూడా చేసినట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు.

గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతే జరగలేదని, నిబంధనల ప్రకారమే నిధులు ఖర్చు చేసినట్లు ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటూ జలవనరుల ప్రకటన ఇచ్చిందంటూ టిడిపి అనుకూల మీడియా బాగా ప్రచారంలోకి తెచ్చింది. టిడిపి నాయకులు కూడా ఈ సందర్భంగా తమను తాము సమర్థించుకునేందుకు ఈ అవకాశాన్ని వాడుకున్నారు.

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎటిఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీయే ఆరోపణలు చేయడం, తాజాగా జలవనరులశాఖ అందుకు విరుద్ధమైన ప్రకటన చేయడంతో ముఖ్యమైన బిజెపి నాయకులు రంగంలోకి దిగి మోడీ ఆరోపణలకు మద్దతుగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

దీనిలో భాగంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితరులు కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం తరుపున ఫిర్యాదు చేస్తే పోలవరం, పట్టి సీమ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి పై విచారణకు కేంద్రం చొరవ తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ విషయమై తాము ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టి సీమల్లో జరిగిన అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు పంపకపోవడమే జలవనరుల శాఖ క్లీన్ చీట్ కు కారణమని కూడా సోము విశ్లేషించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp