పాత నగరం, శివారు ప్రాంతాల్లో పట్టుబిగుస్తున్న బీజేపీ

By Kranti Dec. 04, 2020, 04:00 pm IST
పాత నగరం, శివారు ప్రాంతాల్లో పట్టుబిగుస్తున్న బీజేపీ

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో రెట్టించిన ఉత్సాహాన్ని సొంతం చేసుకున్న బీజేపీ అదే జోష్ తో గ్రేటర్ బరిలోకి దిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఆరాటంలో గ్రేటర్ ఎన్నికలను సవాల్ స్వీకరించింది. అందుకోసం బల్దియా ప్రచారంలోకి ఢిల్లీ పెద్దల్ని సైతం దించి గట్టి పోటీ ఇచ్చింది. ప్రచారంలో బల్దియా పీఠం తమదే అనే ధీమాను వ్యక్తం చేసిన బీజేపీ అందుకు కోసం సర్వ శక్తులనూ ఒడ్డింది. ఫలితాల ట్రెండ్ బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతున్నప్పటికీ అధికార టీఆర్ఎస్ కు మాత్రం ఎంతోకొంత నష్టాన్ని చేకూర్చగలదనిపిస్తోంది.

బల్దియా ఎన్నికల తొలిరౌండ్ ఫలితాలు వెలువడే సరికి టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని కనబరిచింది. దాదాపు 60 స్థానాల్లో కారు జోరు కనిపించింది. తరువాత స్థానంలో ఎంఐఎం, బీజేపీలు నిలిచాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈ సారి 31 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అంతిమ ఫలితాలు వెలువడే సమయానికి బీజేపీ 25 నుంచి 30 స్థానాలను సొంత చేసుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 150 స్థానాల్లో 99 వార్డుల్లో టీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. 44 స్థానాలను ఎంఐఎం, 4 స్థానాలను బీజేపీ, 2 స్థానాలను కాంగ్రెస్, 1 స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది.

ఓల్డ్ సిటీలో పాగా..

గ్రేటర్ ప్రచారంలో దూకుడును ప్రదర్శించిన గతం కంటే మెరుగైన ఫలితాల్ని సొంతం చేసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తోంది. 25కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించగలితే మెజార్టీగా నష్టపోయేది టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే. ఇప్పటికే కాషాయ పార్టీ 31 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రేటర్ ప్రచారంలో ఎంఐఎంను ప్రధానంగా టార్గెట్ చేసిన బీజేపీ పాత నగరంలో పాగావేసే అవకాశం కనిపిస్తోంది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆ పార్టీకి కలిసొచ్చే విషయంగా కనిపిస్తోంది. మంగళ్‌హాట్‌, జాంబాగ్‌, గోషామహల్‌, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్‌ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. పాతనగరంలో కనీసం 10 స్థానాలపైనే గెలుచుకుంటామన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. పాత నగరంలో పాకిస్తానీలు, రోహింగ్యాలు ఉన్నారని గ్రేటర్ లో తాము గెలిస్తే పాతనగరంపై సర్జికల్ స్ట్రైక్ చేసి, అక్రమ వలసదారులను తరిమికొడతామని ప్రకటించింది. ఒకరకంగా హిందువుల ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు వాడిన ఈ భాష భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి దోహదం చేసిందనే చెప్పాలి. పాతబస్తీలో హిందు ఓటు బ్యాంకు అధికంగా గల ప్రాంతంలో బీజేపీ ఆధిక్యానికి అదే కారణంగా చెప్పవచ్చు.

శివారు ప్రాంతాల్లోనూ

పాత నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎల్బీనగర్, మహేశ్వరం సర్కిల్స్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. చైతన్యపురిలో బీజేపీ అభ్యర్థి రంగా నర్సింహ తొలి విజయాన్ని సొంతం చేసుకోగా ఆర్.కే పురం, బీజేపీ గడ్డిఅన్నారం, నాగోల్, మన్సూరాబాద్, చెంపాపేట్, సరూర్ నగర్, వనస్థలి పురం స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభివృద్ధి ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకోలేదనే చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి అంతా మెయిన్ సిటీపై కేంద్రీకరించడంతో ఈ ప్రాంత ఓటర్లపై ఆ ప్రభావం పనిచేయాలేదనే చెప్పుకోవాలి. బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న చాలా చోట్ల వరద సాయం అందలేదనే ఆగ్రహం ప్రజల్లో ఉంది. దీన్ని కూడా బీజేపీ క్యాష్ చేసుకోగలిగింది. మరోవైపు హబ్సిగూడ, తార్నాక, రాం నగర్, ముషీరాబాద్, గాంధీ నగర్ ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని కబరుస్తోంది. మొత్తానికి బీజేపీ బల్దియా పీఠాన్ని దక్కించుకోలేకపోయినా కీలకస్థానాల్ని మాత్రం కైవసం చేసుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp