జీహెచ్ఎంసీ ఎన్నికలు, సెమీ ఫైనల్ గా భావిస్తున్న బీజేపీ

By Raju VS Nov. 25, 2020, 03:20 pm IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు, సెమీ ఫైనల్ గా భావిస్తున్న బీజేపీ

ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. తూర్పున బెంగాల్ లో ఈసారి బలపడాలని, అధికారానికి చేరువ కావాలని ఆశిస్తోంది. అదే సమయలో దక్షిణ భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగా వారికి దుబ్బాక ఉప ఎన్నికలు ద్వారం తెరిచినట్టయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు సెమీ ఫైనల్ లెక్క భావిస్తోంది. టీఆర్ఎస్ ని గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దానికి అనుగుణంగా తన బలం మొత్తం కేంద్రీకరిస్తోంది. కేంద్ర స్థాయి పెద్దలంతా రంగంలో కేసీఆర్ ఫ్యామిలీ పని పట్టాలని చూస్తున్నట్టుగా ఉంది.

గ్రేటర్ ఎన్నికలను బీజేపీ దాదాపు సాధారణ ఎన్నికల మాదిరిగా భావిస్తోంది. ఇప్పటికే కీలక నాయకత్వం అంతా బల్దియా మీద కేంద్రీకరించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ప్రచారంలో ఉన్నారు. ఆయనకు తోడుగా స్మృతి ఇరానీ వంటి వారు రంగంలో దిగుతున్నారు. ప్రకాష్ జవదేకర్ కూడా జీహెచ్ఎంసీ పనిలో పడ్డారు. త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా కూడా రంగంలో దిగబోతున్నారు. తద్వారా తెలంగాణాలో దాదాపు మూడో వంతు నియోజకవర్గాలను ప్రభావితం చేసే హైదరాబాద్ ని అందిపుచ్చుకునే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో తమకు ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తోంది.

హైదరాబాద్ మేయర్ స్థానానికి బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం ఆసక్తికరమే. కానీ నగరంలోని 150 డివిజన్లకు గానూ 50 డివిజన్లు పాతబస్తీ పరిధిలో ఉంటాయి. అందులో దాదాపుగా 60 నుంచి 70 శాతం ఎంఐఎం హవా ఉంటుంది. మరో 50 స్థానాల్లో సెటిలర్ల ప్రభావం ఉంటుంది. ఇక్కడ బీజేపీ కి జనసేన మద్ధతు తోడ్పతుందని, టీడీపీ కుచించుకుపోవడం ద్వారా కేసీఆర్ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. ఇక మిగిలిన డివిజన్లలో కూడా ఇటీవల వరదల సమయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఎదగాలని లెక్కలేస్తోంది. దాంతో కనీసంగా తమకు 30 స్థానాలు ఖాయమని ఆశిస్తున్న బీజేపీ బలంగా ప్రయత్నాలు చేస్తే 70 నుంచి 80కి చేరడం పెద్ద కష్టం కాదని కూడా చెబుతోంది.

దాంతో 2015 ఎన్నికల్లో కేవలం 4 కార్పోరేటర్లను మాత్రమే గెలిపించుకున్న కమలం ఈసారి ఏకంగా మేయర్ కుర్చీపై కున్నేసింది. కేసీఆర్ , ఆయన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా పాగా వేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోటలు కూలిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలంతా తెరమీదకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేవలం కేటీఆర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అపర చాణిక్యుడినని చెప్పుకునే అమిత్ షా కూడా సీన్ లోకి వస్తున్నారు. తద్వారా టీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇవ్వబోతున్నామనే సంకేతం ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి తెలంగాణా రాజకీయాల్లో పాగా వేయడానికి ఇదో పెద్ద అవకాశం అని బీజేపీ అంచనాలు వేస్తుండగా, అందుకు తగ్గట్టుగా ప్రజల మైండ్ సెట్ మార్చే పనిలో పడింది.

సోషల్ మీడియాలో ఇప్పటికే టీఆర్ఎస్ కి తలనొప్పి కలిగించేలా ప్రయత్నాలు సాగిస్తోంది. అదే సమయంలో జీహెచ్ఎంసీని గెలుచుకోవడం ద్వారా 2023 సాధారణ ఎన్నికలకు ఢీ అంటే ఢీ కొట్టేలా దూకుడు ప్రదర్శిస్తోంది. అందుకు తగ్గట్టుగా మత సంబంధిత అంశాలే ఎజెండాగా భావోద్వేగాల ఆట ఆడుతోంది. టీఆర్ఎస్ కి తొలిసారిగా గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఫలితాలు తెలంగాణా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశం ఉన్నందును ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దాంతో బల్దియా పోరు హోరాహోరీగా మారుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp