మహారాష్ట్రలో బీజేపీకి చేదు ఫలితాలు..!

By Karthik P Dec. 05, 2020, 01:10 pm IST
మహారాష్ట్రలో బీజేపీకి చేదు ఫలితాలు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సత్తా చాటామనే సంతోషంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదరయ్యాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే స్థానంలో గెలిచింది. అధికార శివసేన–ఎన్‌షీపీ–కాంగ్రెస్‌ (మహా వికాస్‌ ఆఘాఢీ) కూటమి సత్తా చాటింది. నాలుగు స్థానాల్లో మహాకూటమి గెలుపొందింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

పట్టభద్రుల నియోజకవర్గాల్లో మహాకూటమి జయకేతనం ఎగురవేసింది. ఔరంగాబాద్, పుణెలలో ఎన్‌సీపీ, నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఉపాధ్యాయుల నియోజకవర్గాలలో పుణే నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, అమరావతిలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. థూలే సందూర్బాగ్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

బీజేపీకి కంచుకోటగా ఉన్న నాగ్‌పూర్‌లోనూ ఆ పార్టీ ఓడిపోవడం కమలం నేతలకు మింగుడుపడడం లేదు. విద్యా వంతులు బీజేపీకి మద్ధతుగా ఉంటారనే ప్రచారం నాగ్‌పూర్‌ ఎన్నికల్లో తేలిపోయింది. ప్రత్యర్థుల బలం అంచనా వేయడంలో తాము విఫలమయ్యామంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp