అది బీజేపీకే సాధ్యం..!

By Kotireddy Palukuri Oct. 23, 2020, 12:13 pm IST
అది బీజేపీకే సాధ్యం..!

సబ్బు బిళ్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ.. ఇదే కాదు.. రాజకీయానికి కూడా కాదేది అనర్హం అంటూ నిరూపిస్తోంది భారతీయ జనతాపార్టీ (బీజేపీ). మరో వారం రోజుల్లో బిహార్‌ ఎన్నికల పోరు ప్రారంభం కాబోతున్న తరుణంలో అన్ని పార్టీలతోపాటు బీజేపీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీతో దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోంది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే బిహారీలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని ఆ పార్టీ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించి సంచలనానికి, రాజకీయ విమర్శలకు తెరలేపారు.

బీజేపీ ఇచ్చిన హామీపై ఎన్‌డీయేతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ కరోనాను కూడా రాజకీయానికి వాడుకుంటోందని విమర్శిస్తున్నాయి. ప్రజా రోగ్యాన్ని కూడా బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని మండిపడుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్, ఆర్‌జేడీ తదితర పార్టీలు బీజేపీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. అయితే సిద్ధాంతపరమైన హామీలు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొనడం విశేషం.

బిహార్‌లోనే కాకుండా దేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ ఇచ్చిన హామీపై చర్చ సాగుతోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా రెండేళ్ల సమయం పట్టొచ్చన్న అంచనాలున్నాయి. ఆ లోపు కోవిడ్‌ ఏ స్థితిలో ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటిది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే బిహార్‌ ప్రజలకు ఉచితంగా అందిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ హాస్యాస్పదంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక వేళ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే.. బిహార్‌ ప్రజలకు మాత్రమే ఉచితంగా ఇస్తే.. మిగతా దేశ ప్రజల పరిస్థితి ఏమిటి..? వారికి ముందు ఇవ్వరా..? ఇచ్చినా ఉచితంగా సరఫరా చేయారా..? అనే ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.

బీజేపీ ఇచ్చిన హామీల అమలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా.. అప్పటికప్పడు ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయని తాజా బిహార్‌ ఎన్నికల మేనిఫెస్టోతో మరోమారు నిరూపితమైంది. 2014 సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఇచ్చిన నల్లధనం హామీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనం దేశానికి తీసుకొచ్చి ప్రతి భారతీయుడు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ హామీ అటకెక్కింది. ఇప్పటికీ ఆ హామీపై రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు విమర్శిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా నాడు బీజేపీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న కరోనాకు వ్యాక్సిన్‌ ఇస్తామన్న హామీ బిహార్‌లో బీజేపీ గెలుపునకు ఏ మాత్రం ఉపయోగపడుతుందో నవంబర్‌ 10వ తేదీన తేలుతుంది.

మూడు దశల్లో జరగబోయే బిహార్‌ ఎన్నికల్లో మొదటి దశ ఈ నెల 28వ తేదీన, రెండు, మూడు దశలు వచ్చే నెల 3, 7 తేదీల్లో జరగబోతున్నాయి. 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. బీజేపీ, జేడీయూ సహా చిన్న పార్టీలు కుటమిగా, కాంగ్రెస్, ఆర్‌జేడీ, కమ్యూనిస్టులు మహాఘటబంధన్‌ కూటమిగా ఏర్పడి బిహార్‌ బరిలో నిలుచున్నాయి. లోక్‌జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp