సోము ‘‘రివ‌ర్స్’’ రాజ‌కీయాలు..!

By Kalyan.S Oct. 30, 2020, 02:40 pm IST
సోము ‘‘రివ‌ర్స్’’ రాజ‌కీయాలు..!

సోము వీర్రాజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ప్ప‌టి నుంచీ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీసుకున్న నిర్ణ‌యాల‌కు ఎగ్జాట్ ఆపోజిట్ గా వెళ్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. క‌న్నా హ‌యాంలో టీడీపీ - బీజేపీ రాజ‌కీయాలు ఇంచుమించు ఒకే పంథాలో ఉన్నాయ‌న్న ప్ర‌చారం జ‌రిగేది. టీడీపీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందుకు బీజేపీ కూడా అదే దారిలో వెళ్లేది. మూడు రాజ‌ధానుల విష‌యంలో కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు లేఖ రాసిన వెంట‌నే అదే సారాంశంతో క‌న్నాకూడా గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. సీఎం జ‌గ‌న్ పై ఇద్ద‌రూ ఒకే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేసేవారు. దీంతో బీజేపీకి టీడీపీ తోక పార్టీ అన్న ముద్ర ప‌డిన విష‌యం కూడా తెలిసిందే. ఈ ప‌రిణామాల‌న్నీ నిశితంగా ప‌రిశీలించిన బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఏపీ లో ఉనికి చాటాలంటే నాయ‌క‌త్వ మార్పు అనివార్య‌మ‌ని గుర్తించారు. దీనిలో భాగంగా క‌న్నా స్థానంలో అదే సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజును నియ‌మించారు.

వ్యూహాత్మ‌కంగా అడుగులు

బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి సోము వీర్రాజు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. క‌న్నా చేసిన పొర‌పాట్లు చేయ‌కుండా ఆది నుంచీ ముందుకు వెళ్తున్నారు. ప్ర‌ధానంగా టీడీపీ టార్గెట్ గా రాజ‌కీయాలు చేస్తున్నారు. కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో టీడీపీ దిగువ క్యాడర్ లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అలాగే క‌న్నా దూరం చేసిన నాయ‌కుల‌ను ఆద‌రిస్తున్నారు. బీజేపీ నేత లక్ష్మీపతిరాజాపై ఆ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉ‍న్న సమయంలో రాజాపై సస్పెన్షన్‌ను విధించారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్కొక్క‌రిపై వేటు వేసి బ‌య‌టికి పంప‌డ‌మే త‌ప్ప ... చేర్చుకునేది లేద‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దానికి చెక్ పెట్ట‌డంతో పాటు.. త‌న మార్క్ రాజ‌కీయాలు పార్టీకి తెలిసేలా ల‌క్ష్మీప‌తిరాజాను ఆహ్వానించారు. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు ల‌క్ష్మీప‌తి రాజాపై ఈ ఏడాది జూన్‌లో వేటు వేశారు. పార్టీ నియ‌మావ‌ళికి విరుద్ధంగా ల‌క్ష్మీప‌తిరాజు సాక్షి చాన‌ల్ డిబేట్‌కు వెళ్లినందుకు క‌న్నానేతృత్వంలోని క్ర‌మ‌శిక్ష‌ణ విభాగం ఈ నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు నాలుగు నెల‌ల అనంత‌రం ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ సోము వీర్రాజు నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై పార్టీలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సోము ‘‘రివ‌ర్స్’’ రాజ‌కీయాలు పార్టీకి ఎంత వ‌ర‌కు మేలు చేస్తాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp