బ‌ర్త్ ఇన్ పాకిస్థాన్‌.. ల‌వ్ ఇన్ ఇండియా

By Suresh Dec. 11, 2019, 05:48 pm IST
బ‌ర్త్ ఇన్ పాకిస్థాన్‌.. ల‌వ్ ఇన్ ఇండియా

అతనో పాకిస్థానీ.. పుట్టింది పెరిగింది పాకిస్థాన్‌లోనే అయితే ప్రేమ‌, పెళ్లి మాత్రం ఇండియాలో.. ఇదేంటి క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంద‌నుకుంటున్నారా.. అవును మీరు చ‌దువుతున్న‌ది అక్ష‌రాల నిజం. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఓ వ్య‌క్తి, వైవాహిక జీవితం మాత్రం భార‌త యువ‌తితో గ‌డుపుతున్నాడు. ఇటీవ‌ల వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌తో యావ‌ద్దేశం మొత్తం భ‌యాందోళ‌న‌కు గురైంది. ఇంత‌కీ ఈ పాకిస్థానీ ప్రేమ వ్య‌వ‌హారం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో పోలీసులు ముమ్మ‌ర త‌నిఖీలు చేస్తున్నారు. ఉన్న‌ట్టుండి ఓ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడివిడిగా భార్య‌, భ‌ర్త‌ని విచారించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఇండియాలో ఉండ‌టంతో వెంట‌నే అత‌న్ని అదుపులోకి తీసుకొని లోతుగా విచారణ చేప‌ట్టారు. ఇండియాలోనే గ‌త ప‌దేళ్ల నుంచి నివాసం ఉంటున్నార‌ని తెలుప‌డంతో నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. షేక్ గుల్జార్ ఖాన్ ఇత‌నొక పాకిస్థాన్ పౌరుడు. సియాల్‌కోట్‌లోని పేద కుటుంబానికి చెందిన గుల్జార్ ఉపాధి నిమిత్తం 12 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. ఓసారి అనుకోకుండా రాంగ్ కాల్ ద్వారా గ‌డివేముల‌కు చెందిన దౌల‌త్ బీ ప‌రిచ‌యం అయ్యింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమగా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. దౌల‌త్‌బీ ప్రేమ‌తో సౌదీ నుంచి పాకిస్థాన్ వెళ్లాల్సిన గుల్జార్ నిఘా వ‌ర్గాల క‌ళ్లు గ‌ప్పి భార‌త్‌లో ప్ర‌వేశించాడు. ప‌ది సంవ‌త్స‌రాల నుంచి భార‌త్‌లో నివసిస్తున్నాడు. క‌ర్నూలు జిల్లా పాణ్యం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ‌డివేముల‌కు చెందిన షేక్ దౌల‌త్ బీని వివాహం చేసుకున్నాడు. దౌల‌త్‌బీకు ఇదివ‌ర‌కే వివాహ‌మై భ‌ర్త‌ను కోల్పోయింది. ఇప్పుడు వీరికి న‌లుగురు సంతానం ఉన్నారు. పాకిస్థాన్ పౌరుడైన గుల్జార్ ఖాన్‌కు గ‌డివేముల అడ్ర‌స్‌తోనే పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు కూడా ఉన్నాయి. ప‌దేళ్ల నుంచి జిల్లాలో నివాసం ఉంటున్నా ఏ ఒక్క‌రికీ కూడా అనుమానం రాకుండా త‌న‌ది పంజాబ్ ప్రాంత‌మ‌ని న‌మ్మించాడు.

ఒక పాత ఇంట్లో నివాసం ఉంటున్న గుల్జార్ ఖాన్ పెయింట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. త‌న భార్య పిల్ల‌ల‌ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడ‌ని తెలుస్తోంది. అయితే తెలుగు భాష ఏమాత్రం రాని గుల్జార్ ఖాన్ ఇరుగుపొరుగు ఎవ్వ‌రితోనూ మాట్లాడేవాడు కాదు. ఇక్క‌డున్న ఈ పదేళ్ల‌లో క‌నీసం తెలుగు నేర్చుకోవాల‌న్న ఆలోచ‌న కూడా చెయ్య‌లేదు. ఇంటి ప్ర‌క్క‌ల వారితో మాత్రం అక్క‌, అన్న అంటూ ప‌ల‌క‌రిస్తూ ఉండేవాడు. ఇన్నేళ్ల పాటు పాకిస్థాన్‌కు చెందిన గుల్జార్ ఇండియాలో ఉంటున్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రికీ ఇసుమంతైనా అనుమానం రాకుండా చూసుకున్నాడు. స్థానికులంద‌రితో త‌న సొంత ప్రాంతం పంజాబ్ అని చెప్ప‌డ‌మే కాకుండా త‌న ముగ్గురు అక్క‌ల‌తో త‌రుచూ మాట్లాడుతుండేవాడు. అయితే ముందుగా అనుకున్న విధంగానే గుల్జార్ ఖాన్ పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. రెండో వ్య‌క్తికి కూడా స‌మాచారం తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ఇంట్లో భార్య పిల్ల‌ల‌తో పాటు, ఇరుగుపొరుగు వారంద‌రికీ కూడా సొంత ప్రాంత‌మైన పంజాబ్‌కు వెళుతున్న‌ట్లు చెప్పాడు. అక్క‌డే సంతోషంగా జీవిద్దామ‌ని న‌మ్మించాడు. ఇటీవ‌లే పాస్‌పోర్టు రెడీ చేసుకున్నాడు.

ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సియాల్‌కోట్‌కు గ‌త ఐదు నెల‌లుగా ఫోన్ కాల్స్ వెళుతుండటం ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు క‌నుకొన్నాయి. వివ‌రాలు ఆరా తీయ‌గా ఆంధ్రప్ర‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లా గ‌డివేముల ప్రాంతం నుంచి ఫోన్లు వెళుతున్నాయ‌ని నిర్ధారిచుకున్నారు. నెల రోజుల క్రితం పాస్‌పోర్టు తీసుకున్న‌ట్లు గుర్తించారు. అంతేకాకుండా ప‌ది రోజుల నుంచి పాకిస్థాన్‌కు కాల్స్ ఎక్కువ అవ్వ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నిఘా వ‌ర్గాలు అనుమానించిన‌ట్లుగానే గుల్జార్ ఖాన్ గ‌డివేముల నుంచి పాక్ వెళ్లేందుకు సిద్ధ‌మై హైద‌రాబాద్ రావ‌డంతో పోలీసులు అత‌న్ని సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే గుల్జార్‌ను, అత‌ని భార్య పిల్ల‌ల‌ను పోలీసులు విడివిడిగా విచారించారు. కేవ‌లం ప్రేమ కోస‌మే తాను ఇండియా వచ్చిన‌ట్లు గుల్జార్ తెలిపారు. అయితే త‌న భార్య కూడా విష‌యంలో క్లారిటీ ఇచ్చింది. గుల్జార్‌ది పాకిస్థాన్ అని త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. ఎప్పుడూ పంజాబ్ అనేవాడ‌ని.. ఇప్పుడు కూడా పంజాబ్‌కు వెళుతున్న‌ట్లు చెప్పాడ‌ని తెలిపింది.

ప‌దేళ్ల‌పాటు పాకిస్థాన్‌కు చెందిన వ్య‌క్తి త‌మ మ‌ధ్య ఉన్నాడ‌న్న నిజం తెలియ‌డంతో గ‌డివేముల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు. గ‌డివేముల‌లో ఏ రోజూ ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా చూసుకున్నాడు. పాకిస్తాన్ వెళ్లేముందు ఇంట్లో ఉన్న ముఖ్య‌మైన సామాగ్రిని త‌న భార్య బంధువుల‌కు ఇచ్చారు. మిగిలిన వాటినంతా కాల్చివేశాడు. గుల్జార్ ఖాన్ కాల్చివేసిన దాంట్లో ఏమైనా ఆధారాలున్నాయా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

షేక్ గుల్జార్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్య పిల్ల‌ల‌ను గ‌డివేముల‌కు పంపారు. గుల్జార్ భార‌త్‌లో ఏమేం చేశాడ‌న్న దానిపై లోతుగా విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. గుల్జార్‌కు ఆధార్ కార్డు ఎలా వ‌చ్చింద‌న్న దానిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. పాస్‌పోర్టు ప్ర‌క్రియ‌పై కూడా లోతుగా ఆరాతీస్తున్నారు. అయితే గుల్జార్‌ను పాకిస్థాన్‌కు అప్ప‌గిస్తారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే గుల్జార్‌ను పాకిస్థాన్ పంపాలంటే అత‌ని భార్య పిల్ల‌ల‌ను కూడా అక్క‌డ‌కు పంపాల్సి ఉంటుంది. అయితే భార్య పిల్ల‌ల‌కు పాకిస్థాన్ పౌర‌స‌త్వం లేదు. భార‌త ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp