సైకిల్ ఎమ్మెల్యే గురించి తెలుసా!

By Ramana.Damara Singh Sep. 25, 2021, 03:00 pm IST
సైకిల్ ఎమ్మెల్యే గురించి తెలుసా!

ఇప్పుడంటే ప్రజాప్రతినిధి అన్న ట్యాగ్ పేరు పక్కన చేరగానే మన నేతల జీవన శైలి మారిపోతుంది. కార్లు వంటి ఖరీదైన వాహనాల్లో రయ్ మని దూసుకుపోతుంటారు. కానీ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చౌదరి సత్యనారాయణ జీవితాంతం సైకిలునే వాహనంగా చేసుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో సైకిలుపైనే గ్రామాల్లో తిరిగేవారు. ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. అందుకే ఆయన్ను ప్రజలు అభిమానంగా సైకిల్ ఎమ్మెల్యే అని పిలిచేవారు.

జమీందారీ కుటుంబంలో జన్మించినా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, భారత స్వాతంత్ర్య పోరాటం.. అనంతర కాలంలో పౌర హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జన నాయకుడన్న ఖ్యాతిని సత్యనారాయణ అందుకున్నారు. 1981లో పరమపదించిన ఆయన మన మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి, ఆయన ప్రారంభించిన పౌర ఉద్యమాలు ఆయన్ను చిరంజీవిగా నిలుపుతున్నాయి.

విద్యార్థిగా ఉన్నప్పుడే స్వరాజ్య ఉద్యమంలోకి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని షేర్ మహమ్మద్ పురం (ఎస్ ఎం పురం) సత్యనారాయణ స్వగ్రామం. 1908 జులై 13న చౌదరి పురుషోత్తమ నాయుడు, నారాయణమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన ఆయన ప్రాథమిక విద్య అనంతరం.. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. థర్డ్ ఫారంలో ఉన్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు 1921లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్కూళ్ల బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. అప్పుడు ఆయన వయసు 13 ఏళ్లే.

Also Read : ఎన్నిక ఏదైనా.. మెగా బద్రర్స్‌కు కలసిరాని సొంతూరు

ఉద్యోగానికి రాజీనామా చేసి..

1929లో ఉప్పు గల్లీల లూటీలో పాల్గొన్న సత్యనారాయణ 1934లో బుడుమూరు లోని తెన్నేటి ఎస్టేట్ లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు. అయితే స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలన్న అభిలాషతో ఏడాదికే దాన్ని వదిలేశారు. 1940లో సామూహిక సత్యాగ్రహ ఉద్యమం వల్ల హింస చెలరేగుతుందని భావించిన గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీన్నే చలో ఢిల్లీ కార్యక్రమంగా వ్యవహరించారు. ఇందుకోసం ప్రాంతాలవారీగా కొందరిని ఎంపిక చేశారు. అలా శ్రీకాకుళం నుంచి చౌదరి సత్యనారాయణ ఎంపికయ్యారు.

శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ లో సత్యాగ్రహం చేపట్టిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి ఆరు నెలలు జైలులో పెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్బంగా బ్రిటీష్ ఆస్తుల విధ్వంసం చేపట్టారు. దూసి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తొలగించడంతోపాటు కళింగపట్నం పోస్టాఫీసుకు నిప్పు పెట్టారు. ఈ కేసులో సత్యనారాయణ మూడు నెలలు జైలు పాలయ్యారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం

రైతు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు

జమీందారీ కుటుంబానికి చెందిన సత్యనారాయణ జీవితాంతం రైతులు, సామాన్య ప్రజల సమస్యలు హక్కుల కోసం పోరాడారు. 1936లో ఆచార్య ఎన్జీ రంగా నాయకత్వంలో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు నిర్వహించిన రైతు రక్షణ యాత్రలో కీలకపాత్ర పోషించారు. మందస జమీందార్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి.. క్రియాశీలంగా పాల్గొన్నారు. 

స్వాతంత్రఅనంతరం  1951లో కాంగ్రెసుకు రాజీనామా చేసి కృషికార్ లోక్ పార్టీలో చేరారు. 1955లో ఆ పార్టీ తరఫున ఎస్సెమ్ పురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1967లో పొందూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

పౌరహక్కుల ఉద్యమంలోకి

రాజకీయ వ్యవస్థలో పెరిగిన వ్యక్తిగత పోటీ, అధికార పిపాస నచ్చక 1972లో సంప్రదాయ రాజకీయాల నుంచి తప్పుకున్న సత్యనారాయణ పౌర హక్కులపై దృష్టి సారించారు. 1974లో తరిమెల నాగిరెడ్డి, శ్రీశ్రీలతో కలిసి తొలి అడుగులు వేశారు. 1975లో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (ఓపీడీఆర్) పేరుతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ జరిగిన ఉద్యమంలోనూ, 1972లో జై ఆంధ్ర ఉద్యమంలోనూ చౌదరి సత్యనారాయణ చురుగ్గా పాల్గొన్నారు. భారత స్వరాజ్య రజతోత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తామ్రపత్రంతో సత్కరించింది. అన్నింటికీ మించి సత్యనారాయణ జన నాయకుడిగా ప్రజా బాహుళ్యంలో పేరు పొందారు.

Also Read : కుమారుడు కోసం పావులు కదుపుతున్న మాజీ ఎంపీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp