బిహార్.. కూట‌ముల్లో కీల‌క ప‌రిణామాలు

By Kalyan.S Sep. 30, 2020, 12:31 pm IST
బిహార్.. కూట‌ముల్లో కీల‌క ప‌రిణామాలు

కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన‌ప్ప‌టి నుంచీ రాష్ట్రంలో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ప్ర‌ధాన కూట‌ముల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మ‌రోవైపు మూడో కూట‌మి దిశ‌గా కూడా అడుగులు ప‌డుతుండ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) ఇప్ప‌టికే స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్‌ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్‌ఎల్‌ఎస్పీ చీఫ్‌, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండ‌గా బీఎస్పీతో కలిసి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్‌ మాజీ సీఎం నితిన్‌ రామ్‌ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు. మహాకూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్‌గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.

కొత్త పొత్తులు దిశ‌గా..

పాట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆర్‌ఎల్‌ఎస్పీ వర్గాలు చిన్న పార్టీలతో జోరుగా చర్చలు జ‌రుపుతున్నాయి. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇలా బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల పోరు ముంగిట కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములు రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడనున్నాయి. ఇదే క్ర‌మంలో మరో జాతీయ పార్టీ స్థానిక పార్టీతో పొత్తు ప్రకటించింది. రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)తో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ నాయ‌కురాలు మాయావతి ప్రకటించారు.

మా కూటమి అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వానా : మాయావ‌తి

ఒకవేళ బిహార్ ప్రజల ఆశీర్వాదంతో తమ కూటమి గెలిస్తే ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధినేత ఉపేంద్ర కుశ్వానాను ముఖ్యమంత్రిని చేస్తామని మాయావ‌తి స్పష్టం చేశారు. ‘‘రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీతో పొత్తు ఖరారైంది. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వానాతో అన్ని చర్చలు పూర్తయ్యాయి. మా కూటమి అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వానాను ప్రతిపాదించాం. బిహార్ ప్రజలు ఆశీర్వదిస్తే మా కూటమి అధికారంలోకి వస్తుంది, కుశ్వానా ముఖ్యమంత్రి అవుతారు’’ అని మాయావతి ప్ర‌క‌టిస్తున్నారు. మొత్తమ్మీద బిహార్ ఎన్నిక‌లు కొత్త పొత్తుల‌కు, కీల‌క ప‌రిణామాల‌కు దారి తీస్తున్నాయి. మున్ముందు మ‌రెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp