సాథ్ నిశ్చయ్ పార్ట్-2ను ప్రకటించిన బీహార్ సీఎం నితీశ్‌

By Srinivas Racharla Sep. 27, 2020, 06:55 pm IST
సాథ్ నిశ్చయ్ పార్ట్-2ను ప్రకటించిన బీహార్ సీఎం నితీశ్‌

బీహార్ శాసనసభ ఎన్నికల రణానికి తేదీలు ఖరారు కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల పొత్తులు, మేనిఫెస్టో తయారీపై ఫోకస్ పెట్టాయి. జేడీయూ నాయకత్వంలోని అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దూకుడు ప్రదర్శిస్తోంది. కానీ సుమారు 15 ఏళ్లుగా (మధ్యలో కొద్ది కాలం మినహా) ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌ కుమార్‌ పాలనపై బీహార్ ప్రజలలో అసంతృప్తి గూడుకట్టుకుందని వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠానికి మరోసారి గురిపెట్టిన నితీశ్ కుమార్ తన ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గత ఎన్నికలలో హామీ ఇచ్చిన ఏడు పాయింట్ల అజెండాకు కొనసాగింపుగా " సాథ్ నిశ్చయ్ పార్ట్-2" ను బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంపైనే అధికార జేడీయూ-బిజెపి కూటమి దృష్టి కేంద్రీకరించింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన వరాల జల్లులు ప్రకటించడం గమనార్హం.

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసి కొంతమేర మహిళల అభిమానం చూరగొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మరోసారి తనకు ప్రజలు జై కొడితే ఈసారి మహిళల అక్షరాస్యతను ప్రోత్సహించడానికి కొత్త పథకాలను అమలు చేస్తానని జేడీయూ నేత నితీశ్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో‌ పాసైన బాలికలకు రూ.25 వేలు,డిగ్రీ ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.50 వేలు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి కొత్తగా ఒక శాఖను ఏర్పాటు చేస్తామని సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఐటీఐ,పాలిటెక్నిక్‌ వంటి సాంకేతిక విద్యా సంస్థలను కొత్తగా ఏర్పరిచే శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఇక ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతకు పెద్దపీట వేసి యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. అలాగే కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించేవారికి ఆర్థిక సహాయం చేస్తామని ఆయన హామీ గుప్పించారు. గ్రామాలలో సోలార్ వీధి దీపాలు, చెత్త నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే పట్టణాలు,నగరాలలో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచటానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. వృద్ధాశ్రమాలను, పేదలకు నివాసాలను ఏర్పాటు చేస్తామని సీఎం నితీశ్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తాను మరోసారి అధికారంలోకి వస్తే ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp