బీహార్ ఎన్నికల సమరం..రైతు,నిరుద్యోగ ఓటర్లకు గాలం వేసిన మహాఘట్ బంధన్‌

By Srinivas Racharla Oct. 17, 2020, 05:50 pm IST
బీహార్ ఎన్నికల సమరం..రైతు,నిరుద్యోగ ఓటర్లకు గాలం వేసిన మహాఘట్ బంధన్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాలక ఎన్డీయే,ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

బీహార్‌ శాసనసభ ఎన్నికలలో నాలుగోసారి అధికారం కోసం నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్డీయే పోరాడుతుంది.15 ఏళ్ల తర్వాత తిరిగి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ ఆరాటపడుతుంది. ఇవాళ తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘మార్పు తీసుకురావడం మా సంకల్పం’ నినాదంతో మేనిఫేస్టోను రూపొందించారు. ఈ సందర్భంగా నితీశ్ ప్రభుత్వ వైఫల్యాలపై మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

గ్రాండ్ అలయన్స్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా నిరుద్యోగ యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల రద్దును ప్రధానంగా ప్రస్తావించారు.బిహార్‌కు ప్రత్యేక హోదా సాధన,కేంద్రము నుండి వరద సహాయం పొందడంలో సీఎం నితీశ్ కుమార్ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.

బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం అమెరికా అధ్యక్షుడు అనుమతి అవసరమేమో..

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నితీశ్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని,15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిహార్‌కు ప్రత్యేక హోదాను తీసుకురావడంలో సీఎం నితీశ్ ఘోరంగా విఫలమయ్యారని ఆర్జేడీ యువనేత తేజస్వీ విమర్శించాడు.దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఆమోదం తెలపలేమోనని ఎద్దేవా చేశాడు. బిహార్‌లో నిరుద్యోగంతోపాటు నేరాలు పెరిగిపోయి శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించాడు.నితీశ్ పాలనలో అభివృద్ధి శూన్యమని అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ ప్రజలు చేతిలో పరాభవం తప్పదని తేజస్వీ జోస్యం చెప్పడం గమనార్హం.

కాగా మేనిఫెస్టో విడుదల అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తోందని అభిప్రాయపడ్డాడు.జాలే నియోజకవర్గానికి చెందిన తమ అభ్యర్థి ఎన్నడూ జిన్నాను పొగడలేదని ఆయన స్పష్టం చేయడం విశేషం.అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థి నేతగా ఉన్న సమయంలో జిన్నా ఫొటోను తొలగించాలని తమ అభ్యర్థి డాక్టర్ అహ్మద్ ఉస్మాన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని సూర్జేవాలా వెల్లడించాడు. కానీ ఈ అంశం మీద మోడీ స్పందించలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక మహాకూటమి అధికారంలోకి వస్తే మొదటి శాసనసభ సమావేశాలలోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తీర్మానం చేస్తామని సూర్జేవాలా హామీ ఇచ్చాడు.ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముగ్గురితో పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగిందని ఆయన ఎద్దేవా చేశాడు. ఒకటి ప్రజలకు కనిపించే జేడీయూతోను, రెండోది ప్రజలు అర్థం చేసుకునే లోక్‌ జనశక్తి పార్టీతోను, మూడోది ఓవైసీతో పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

ప్రధానంగా యువ ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి పెట్టిన తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పది లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఆర్జేడీ- కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి విజయ అవకాశాలను పెంచే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp