పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మరో భారీ కుంభకోణం..! ఎంతో తెలుసా..?

By Jagadish J Rao Jul. 11, 2020, 03:46 pm IST
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మరో భారీ కుంభకోణం..! ఎంతో తెలుసా..?

ప్రభుత్వ రంగ బ్యాంకు... పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పిఎన్‌బి)లో మరో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డిహెచ్‌ఎఫ్‌ఎల్‌)కు ఇచ్చిన 3,688.58 కోట్ల రుణంలో ఆర్థిక మోసం చోటు చేసుకుందని పిఎన్‌బి తాజాగా ఆర్బీఐకి తెలిపింది.

ముంబాయిలోని పిఎన్‌బి కార్పొరేట్‌ శాఖ నుంచి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఈ రుణం మంజూరైందనీ, అదిప్పుడు మొండి బకాయిగా మారిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిఎన్‌బి తెలిపింది. ఈ విషయాన్ని ఆర్బీఐకి తెలియజేశామని అందులో పేర్కొన్నారు.

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సంస్థ అయిన 'డిహెచ్‌ఎఫ్‌ఎల్‌' వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.లక్ష కోట్లు దాటాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు చేయటంలో సంస్థ విఫలమైంది. దాంతో కంపెనీ దివాలా ప్రకటించింది.

గత కొద్ది నెలలుగా కంపెనీ ప్రమోటర్లు విచారణను ఎదుర్కొంటున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలు ఎటు మళ్లించారన్న దిశగా విచారణ సాగుతున్నది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాల్ని కూడా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎగవేసింది. ఈ రుణాల్ని మొండి బకాయిలుగా ఎస్బీఐ, యూనియన్‌బ్యాంకు ఇప్పటికే ప్రకటించాయి.

దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన పిఎన్‌బిలో వరుస ఆర్థిక నేరాలు బ్యాంకింగ్‌రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ, పిఎన్‌బి బ్యాంకుకు రూ.11,300 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవటం దేశవ్యాప్తగా సంచలనం సృష్టించింది.

ఆ తరువాత వరుసగా మరో రెండు భారీ ఆర్థిక నేరాలు పిఎన్‌బిలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆర్థికమోసం పిఎన్‌బిలో నాలుగవది. ఈ ఏడాది జూన్‌ నాటికి మొండి బకాయిలు(ఎన్‌పిఎ) రూ.73,500కోట్లకు చేరుకున్నాయని పిఎన్‌బి ప్రకటించింది. ఆగస్టు 4 బ్యాంకు 19వ సాధారణ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp