సచిన్‌ పైలట్‌ వర్గానికి ఊరట

By Srinivas Racharla Jul. 21, 2020, 08:09 pm IST
సచిన్‌ పైలట్‌ వర్గానికి ఊరట

రాజస్థాన్ రాజకీయ సంక్షోభ ఎపిసోడ్‌కు రేపటితో తెరదించాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ భావించారు. అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకొని సచిన్ పైలట్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి గహ్లోత్‌ రంగం సిద్ధం చేశాడు.ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులతో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ వర్గానికి తాత్కాలిక ఊరట లభించింది.

గతవారం కాంగ్రెస్ నిర్వహించిన రెండు సీఎల్పీ సమావేశానికి పైలట్‌తోపాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకుండా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు స్పీకర్ జోషి రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇవాళ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీచేసిన నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. సచిన్‌ పైలట్‌ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఆయన పైలట్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జోషి సరైన కారణాలను చూపకుండానే నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టులో వాదించాడు.. అలాగే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ వారి వాదనను తెలపడానికి కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఇచ్చారని కోర్టు దృష్టికి పైలట్‌ న్యాయవాది తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నట్టు అర్థం చేసుకోవాలని కోర్టుకు విన్నవించాడు. దీంతో హైకోర్టు సచిన్‌ పైలట్‌తో పాటు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ సీపీ జోషిని ఆదేశించింది.తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. 

మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇవాళ వస్తుందని భావించిన సీఎం అశోక్ గహ్లోత్‌ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే నేటి ఉదయం రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగడం గమనార్హం.

ఇదిలా ఉంటే తనతో పాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలెవరూ బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్ మాజీ నేత సచిన్ పైలెట్ మరోసారి పునరుద్ఘాటించాడు. తమ పోరాటం పార్టీపై కాదని రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసమేనని ఆయన ప్రకటించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp