హిట్లర్ జాత్యహంకారం మీద దెబ్బకొట్టిన ఒలింపిక్ స్ఫూర్తి

By Sannapareddy Krishna Reddy Jul. 30, 2021, 02:03 pm IST
హిట్లర్ జాత్యహంకారం మీద దెబ్బకొట్టిన ఒలింపిక్ స్ఫూర్తి

1936 ఆగస్టులో జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఒలింపిక్స్ జరిగేనాటికి జర్మనీ, దాని నాయకుడు హిట్లర్ ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతూ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి జర్మనీ ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న రైన్ లాండ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నా, సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని కూడగట్టుకున్నా ఆనాటి అగ్ర రాజ్యాలు కానీ, మరో యుద్ధం రాకుండా చూడ్డానికి ఏర్పడిన నానాజాతిసమితి కానీ నోరు మెదపలేదు.

జర్మనీలో తన నాజీ పార్టీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్నింటినీ నిషేధించి, తనని తాను జర్మనీకి ఛాన్సలర్ గా ప్రకటించుకున్నాడు హిట్లర్. అటువంటి సమయంలో తన దేశంలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలను తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి మంచి అవకాశంగా భావించాడు హిట్లర్. దానికి తోడు ఆ ఒలింపిక్ క్రీడలని మొదటిసారి టీవిలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆ క్రీడలమీద మరింతగా దృష్టి పెట్టాడు హిట్లర్.

1936 ఒలింపిక్ క్రీడలకు వేదికగా బెర్లిన్ నగరాన్ని ప్రకటించిన వెంటనే వివిధ క్రీడాసంఘాల అధికారులను సమావేశపరిచి ఒకటే లక్ష్యం ఏర్పాటు చేశాడు. "ఎంత డబ్బు కావాలన్నా, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా తీసుకోండి. పతకాల పట్టికలో జర్మనీ అగ్రస్థానంలో ఉండాలి!"

లాంగ్ జంప్ లో సూపర్ స్టార్
జర్మనీ తరఫున క్రీడల్లో పాల్గొంటున్న అందరిలో లాంగ్ జంపర్ లజ్ లాంగ్ తప్పకుండా స్వర్ణ పతకం సాదించగలడని అందరికి నమ్మకం. నాజీ పార్టీలో సభ్యుడిగా ఉన్న లజ్ లాంగ్ అప్పటికే యూరప్ ఖండపు పోటీల్లో అనేక పతకాలు గెలిచి, యూరోపియన్ రికార్డు స్ధాపించి ఉన్నాడు. ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం కోసం అన్ని సౌకర్యాలతో ప్రత్యేక కోచ్, ఆహార నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ఆరడుగుల రెండంగుళాల లజ్ లాంగ్ తో పోటీ పడటానికి అట్లాంటిక్ మహా సముద్రానికి అవతలి వైపు అమెరికా దేశంలో తీవ్రమైన జాతి వివక్షత ఎదుర్కొంటూ నల్లజాతీయుడైన అయిదడుగుల పదకొండు అంగుళాల జెస్సీ ఒవెన్స్ తనకి అందుబాటులో ఉన్న అరకొర సదుపాయాలతో శిక్షణ పొందుతూ ఉన్నాడు.

చిన్నప్పటి నుంచి వివక్ష
అమెరికా దక్షిణ ప్రాంతంలోని అలబామా రాష్ట్రంలో పుట్టిన జెస్సీ ఒవెన్స్ పదిమంది సంతానంలో చిన్నవాడు. వర్ణవివక్ష ఎక్కువగా ఉన్న దక్షిణ రాష్ట్రాల నుంచి చాలామంది నల్లవారు ఉత్తర రాష్ట్రాలకు తరలివెళ్ళినప్పుడు ఓవెన్స్ కుటుంబం కూడా ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ లాండ్ నగరానికి తరలివెళ్ళింది. అక్కడ ఓవెన్స్ చదువుతున్న పాఠశాలలోని కోచ్ పరుగులో అతని ప్రతిభను గుర్తించి సానపెట్టాడు. 1933లో చికాగో నగరంలో జరిగిన నేషనల్ హైస్కూల్ ఛాంపియన్ షిప్స్ లో 100 గజాలు(91 మీటర్లు) పరుగులో, లాంగ్ జంప్ పోటీలో రికార్డు సృష్టించి ఛాంపియన్ గా నిలవడంతో దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు జెస్సీ ఓవెన్స్.

ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే పెద్ద కుటుంబం నడవడానికి తండ్రికి చేదోడువాదోడుగా ఉండడానికి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన జెస్సీ మే25, 1935 మిచిగాన్ రాష్ట్రంలోని ఆన్ ఆర్బర్ నగరంలో జరిగిన బిగ్ టెన్ క్రీడల పోటీల్లో గంట వ్యవధిలో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పి, మరొక ప్రపంచ రికార్డును సమం చేయడంతో 1936 ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా ఆశాజ్యోతిగా మారాడు.

ఒలింపిక్స్ లో రికార్డులు
1936 జులై మాసం చివరిలో సముద్రమార్గంలో జర్మనీ చేరిన ఒవెన్స్ కన్నా ముందే మైదానంలో అతను సాధించిన రికార్డులు క్రీడాభిమానులను చేరాయి. అమెరికా బృందం ఎక్కడికి పోయినా అభిమానుల నుంచి ఒకటే ప్రశ్న ఎదురయ్యేది - "జెస్సీ ఎక్కడ?". జర్మన్ బూట్ల తయారీ కంపెనీ ఆడిడాస్ యజమాని స్వయంగా వచ్చి ఒవెన్స్ తో స్పాన్సర్ షిప్ ఒప్పందం చేసుకున్నాడు. ప్రపంచంలో ఒక నల్లజాతి క్రీడాకారుడు చేసుకున్న మొట్టమొదటి స్పాన్సర్ షిప్ డీల్ అది.

క్రీడలు మొదలయ్యాక ఆగస్టు 3న 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన ఒవెన్స్ ఆగస్టు 4న లాంగ్ జంప్ లో పాల్గొన్నాడు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో మొదటి రెండు జంప్ లూ టేకాఫ్ లైన్ మీద కాలు పడడంతో ఫౌల్ అయ్యాయి. ఫైనల్ రౌండ్ కి క్వాలిఫై కావడానికి మరొక అవకాశం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకలా జరిగిందో అర్థం కాక, చివరి ప్రయత్నంలో అయినా సరిగా దూకగలనో లేదో అన్న సందేహంతో దిగులుగా కూర్చుని ఉన్న ఒవెన్స్ దగ్గరకు తన జంప్ పూర్తి చేసిన లజ్ లాంగ్ వచ్చాడు.

ఉపోద్ఘాతం ఏమీ లేకుండా నేరుగా తను చెప్పాలనుకున్నది చెప్పాడు అతను. "నువ్వు దూకినప్పుడు డిస్టెన్స్ బాగా కవర్ చేశావు. కానీ టెన్షన్ వల్ల ఫౌల్ చేశావు. ఈసారి దూకినప్పుడు టేకాఫ్ లైనుకి అయిదారు అంగుళాలు ఇవతల ఒక లైన్ ఉన్నట్టు ఊహించుకుని దూకు. ఈజీగా ఫైనల్ కి క్వాలిఫై అవుతావు. అప్పటికి టెన్షన్ తగ్గించుకొని నీ ఫుల్ పొటెన్షియల్ చూపించవచ్చు"అని చెప్పి వెళ్ళిపోయాడు లజ్ లాంగ్. ఒవెన్స్ ఆ టిప్ ఉపయోగించి ఫైనల్ కి క్వాలిఫై అయ్యి, ఫైనల్లో లజ్ లాంగ్ ని వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన జంప్ తో స్వర్ణపతకం సాధించాడు.

లజ్ లాంగ్ రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రేక్షకులలో కూర్చుని ఉన్న హిట్లర్ తన ఆర్యుల ఆధిక్యత సిద్ధాంతాన్ని ఒక నల్లజాతీయుడు దెబ్బ కొట్టడాన్ని జీర్ణించుకోవడానికి కష్టపడుతూ ఉంటే లజ్ లాంగ్ ఒవెన్స్ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపి, డ్రస్సింగ్ రూమ్ వరకూ చేతిలో చెయ్యి వేసుకుని నడిచి అతని కడుపుమంటని మరింత ఎక్కువ చేశాడు.ఒవెన్స్ ఆ మరుసటి రోజు 200 మీటర్ల పరుగులో, తొమ్మిదో తేదీన 4X100 మీటర్ల రిలేలో స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుని 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో కార్ల్ లూయీస్ సమం చేశాడు.

ఒలింపిక్స్ అనంతర జీవితం

1936 ఒలింపిక్స్ అనంతరం జెస్సీ ఒవెన్స్, లజ్ లాంగ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. లజ్ లాంగ్ తన న్యాయవాది వృత్తిని వదిలి సైన్యంలో చేరాడు. రెండవ ప్రపంచయుద్ధంలో భాగంగా జులై 10,1943న అమెరికా ఆధ్వర్యంలో మిత్రదేశాల సైన్యం సిసిలీ ద్వీపాన్ని ఆక్రమించినప్పుడు జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయపడి, నాలుగు రోజుల తర్వాత మరణించాడు.

మరోవైపు అద్భుతమైన విజయాలు సాధించి, అప్పటివరకూ ప్రపంచం చూడని అత్యుత్తమ క్రీడాకారుడు అన్న బిరుదు జెస్సీ ఒవెన్స్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. నల్లజాతీయుడైన కారణంగా అతని పట్ల మునుపు ఉన్న వివక్షత ఏమాత్రం తగ్గలేదు. ఒలింపిక్ విజేతలకు సన్మానించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవడానికి న్యూయార్క్ నగరంలోని వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ లోకి ప్రధాన ద్వారం గుండా ప్రవేశాన్ని నిరాకరించి, సామాన్లు తీసుకెళ్ళే పక్కద్వారం నుంచి పంపించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ శుభాకాంక్షల సందేశం కూడా పంపలేదు.

ఆ తర్వాత డబ్బులు కోసం కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించడంతో అతని అమెచ్యూర్ అధ్లెట్ హోదా రద్దయింది. ఆ దశలో ఒవెన్స్ పెట్రోలు బంకు అటెండెంటుగా, ఒక క్రీడల స్టేడియంలో పారిశుద్ద్య కార్మికుడిగా, లాండ్రీలో మేనేజరుగా పనిచేస్తూ, రేసుగుర్రాలతో పరుగులో పోటీపడి డబ్బులు సంపాదిస్తుండగా ఒక తోటి క్రీడాకారుడు డెట్రాయిట్ లోని ఫోర్డ్ మోటారు కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.

రోజుకో పెట్టె సిగరెట్లు కాల్చే ఛెయిన్ స్మోకర్ అయిన జెస్సీ ఒవెన్స్ తీవ్రమైన ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడి, అరవై ఆరేళ్ళ వయసులో మార్చి 31,1980న మరణించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp