బెంగాల్ హింస దేనికి సంకేతం..?

By Kalyan.S May. 06, 2021, 06:54 pm IST
బెంగాల్ హింస దేనికి సంకేతం..?

ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాదు.. ఎన్నిక‌లు పూర్త‌య్యాక కూడా ప‌శ్చిమ బెంగాల్ లో రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. పోలింగ్ అనంత‌రం అది హింస‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. కొంత హెచ్చుతగ్గులే తప్ప పరస్పర దాడులు, విధ్వంసం వగైరాలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. నాలుగు రోజులుగా దక్షిణ బెంగాల్‌ ప్రాంతంలోని బీర్‌భూమ్, హౌరా, బసీర్హత్, సోనార్‌పూర్, బర్థమాన్‌... ఉత్తర ప్రాంతంలోని దిన్హతా, సీతల్‌కుచిల్లో విచ్చల విడిగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు చేయడం, తలలు పగులకొట్టడం, ఇళ్లపై దాడులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌లు మూడూ ఈ విషయంలో తృణ మూల్‌ కాంగ్రెస్‌ను నిందిస్తుంటే, టీఎంసీ మాత్రం బీజేపీని నిందిస్తోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ 17 మంది హింసాకాండకు బ‌లికావ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

శాంతిభ‌ద్ర‌త‌ల‌పై ప్ర‌ధాని ఆరా

తమ శ్రేణులనే లక్ష్యం చేసుకుని వేరే పార్టీలవారు దాడులు చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అంటుంటే, తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది చనిపోయారని అది టీఎంసీ ప‌నే అంటూ బీజేపీ అంటోంది. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌కు ఆయన ఫోన్‌ చేసి శాంతిభద్రతలపై మాట్లాడారు. ఈ మేరకు గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న హింస, లూటీలు, దహనాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పోలీసులు ముగింపు పలకాల్సిందే. ఇటువంటి ఘటనలు బెంగాల్‌కు సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలోనే ఎందుకీ హింస?’’ అని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు. కాగా హింసపై బెంగాల్ నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు లైనులోకి దిగుతున్నారు. టీఎంసీపై ఆరోప‌ణ‌లు, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’’ అని బీజేపీ నేత గౌరవ్‌ భాటియా ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

హింసకు ఆ పార్టీ వారే కారణం: మమత

బీజేపీని ఓడించవచ్చని బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని, ఆ పార్టీకి ఇప్పుడు రాజకీయ ఆక్సిజన్‌ అవసరమని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘ఏ రాష్ట్రంలో అయినా హింసాత్మక సంఘటనలు జరుగుతాయి. అయితే హింసను నేను సమర్థించడం లేదు. ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామన్న బాధతోనే మతపరమైన కలహాలు సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు’’ అని మమత వ్యాఖ్యానించారు. తమ శ్రేణులనే లక్ష్యం చేసుకుని వేరే పార్టీలవారు దాడులు చేస్తున్నారన్నది తృణమూల్‌ ప్రత్యారోపణ. మృతుల్లో ఆ పార్టీకి చెందినవారు ఆరుగురు చనిపోయిన మాట వాస్త వమే. మరో ఇద్దరు కాంగ్రెస్‌–సీపీఎంల సంయుక్త మోర్చాకి చెందినవారు. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన పార్టీలు ఇప్పుడు హింస‌కు పాల్ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన కార్యకర్తల కుటుం బాలను పరామర్శించటం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్‌కు ఫోన్‌ చేసి హింసను ఆపడానికి చర్యలు తీసుకునేలా చూడాలని కోర‌డం చూస్తుంటే బీజేపీ ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లుంది. కేంద్ర బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాలని, జరుగుతున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి.

రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా కుట్ర అంటూ..

రాష్ట్రపతి పాలన విధించడానికి ఇదంతా చేస్తున్నారన్న తృణమూల్ ఆరోపిస్తోంది. కాగా, ప‌శ్చిమ బెంగాల్ లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లపై కేంద్రం సీరియ‌స్ అయ్యింది. ఇందుకు సంబంధించి నివేదిక స‌మ‌ర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గ‌ర్న‌ర్‌ను ఆదేశించింది. ఇప్ప‌టికే కేంద్రం న‌లుగురు స‌భ్యుల‌తో క‌మిటీ వేసిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చెల‌రేగాయి. బెంగాల్‌లో కేంద్రమంత్రి మురళీధరన్‌ కారుపై దాడి జ‌రిగింది. దుండ‌గ‌లు మంత్రి వాహ‌నంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో తన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు మురళీధరన్ వెల్లడించారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించ‌డ‌మే కాక‌.. ముర‌ళీధ‌ర‌న్ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. ఇక బెంగాల్‌లో చెల‌రేగిన హింస‌కు ఎన్నిక‌ల క‌మిష‌నే కార‌ణ‌మ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ఇక మీద‌ట రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు తానే ప‌ర్య‌వేక్షిస్తాన‌న్న మ‌మ‌తా.. డీజీపీ నీరజ్‌ నయాన్‌పై బదిలీ వేటు వేయ‌డ‌మే కాక‌.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp