బెంగాల్ దంగల్.. ఇంకా ఉంది!

By Ramana.Damara Singh May. 11, 2021, 06:57 pm IST
బెంగాల్ దంగల్.. ఇంకా ఉంది!

అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపించింది. రెండు రాజకీయ శక్తుల మధ్య భీకర పోరు జరిగింది. నందిగ్రామ్ లో అయితే సీఎం మమతా బెనర్జీ, ఆమె మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ముఖాముఖి పోరు జరిగింది. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, నందిగ్రామ్ లే దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తించాయి. ఎట్టకేలకు ఎన్నికలు ముగిశాయి. మమతనే విజయం వరించింది. అయితే అంతటితో యుద్ధం ముగిసిందనుకుంటే పొరపాటే. ఈ యుద్ధాన్ని మరో రూపంలో కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే చర్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పూనుకోవడమే దీనికి నిదర్శనం. తానేం తక్కువ కాదన్నట్లు టీఎంసీ అధినేత్రి , సీఎం మమత కూడా కేంద్ర ప్రభుత్వంపై లేఖాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు.

హింసను సాకుగా చూపి..

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్లో పలు చోట్ల హింస, విధ్వంసం చెలరేగాయి. దాదాపు 14 మంది మరణించారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇటు బీజేపీ, అటు టీఎంసీ వైపు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. బీజేపీ వారిపైనే దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకత్వం మమతను నిందించగా.. కేంద్ర హోంశాఖ కార్యాచరణకు దిగింది. అల్లర్లపై సమగ్ర నివేదిక పంపాలని, వాటిని అరికట్టేందుకు ఎం చర్యలు తీసుకున్నారో ఆ నివేదికలో వివరించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ ఈ నెల మూడో తేదీన లేఖ పంపింది. దానికి స్పందన లేకపోవడంతో రెండురోజుల క్రితం మళ్ళీ రిమైండర్ పంపింది. నివేదిక పంపకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. మరోవైపు గవర్నర్ జగదీప్ ధన్ కర్ కేంద్రం పనుపున మమత సర్కారుపై అప్పుడే విమర్శలు ప్రారంభించారు.

ప్రమాణ స్వీకారం రోజే శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మమతకు సూచిస్తూ పరోక్షంగా హింస గురించి ప్రస్తావించారు. అయితే మమత ఏమాత్రం పట్టించుకోకుండా హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలన్నారు. అప్పటికింకా ఎన్నిక కోడ్ అమల్లో ఉండటం, శాంతిభద్రతలను అదే పర్యవేక్షిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. హింసపై ఈసీనే అడగాలని తేల్చేశారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని గవర్నర్ పూనుకోవడం కూడా వివాదం రేపింది. తన పర్యటనకు ఏర్పాట్లు చేయాలన్న గవర్నర్ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తన సొంత ఏర్పాట్లతోనే పర్యటిస్తానని ప్రకటించారు.

ప్రతిపక్ష నేతగా సువేందు

నందిగ్రామ్ సంగ్రామంలో మమతను ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేయడం ద్వారా సీఎం మమతపై మానసిక ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ప్రకటించారు. దీంతో ఎన్నికల రణక్షేత్రంలో ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడిన మమతా, సువేందులు వచ్చే ఐదేళ్లు అసెంబ్లీలోనూ ఢీకొనబోతున్నారన్నమాట. నిన్నమొన్నటి వరకు టీఎంసీలో తన నీడన ఉండి.. పదవులు, పార్టీ పెత్తనం చెలాయించిన నేత ఎన్నికల్లో తనను ఓడించడమే కాకుండా.. చట్టసభలో ప్రతిపక్ష నేతగా తన కళ్లెదుటే ఉండటం మమతకు కాస్త ఇబ్బంది పెడుతుందనేది వాస్తవం. మరోవైపు ఎక్కడా లేనివిధంగా శాంతిభద్రతల సమస్య సాకుతో రాష్ట్రంలోని 67 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడం వివాదాస్పదమవుతోంది.

మోదీపై లేఖాస్త్రాలు

మూడోసారి అధికారం చేపట్టిన వెంటనే మమత కేంద్రంలోని మోదీ సర్కారుపై దాడి ప్రారంభించింది. బెంగాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నా టీకాలు, ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ మమతా అధికారం చేపట్టిన నాలుగు రోజుల్లోనే మూడు లేఖలు రాశారు. టీకాలు మరింత ఎక్కువగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సిజన్ ను రాష్ట్ర అవసరాలను కాదని.. ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని తప్పుపడుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బెంగాల్ రాష్ట్రానికి రోజువారీ 570 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. అయితే ఇందులో చాలావరకు కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని ఆరోపించారు. తమ రాష్ట్రంలో కోవిడ్ చికిత్సలకు 550 టన్నుల ఆక్సిజన్ అవసరమని అంటూ.. ఆ మేరకు తమకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ఇటువంటి పరిణామాలు బెంగాల్ యు,ద్ధం ఇప్పట్లో ముగిసేది కాదని స్పష్టం చేస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp