గుడ్ బై బాబు- బీదా

By Siva Racharla Dec. 06, 2019, 08:44 pm IST
గుడ్ బై బాబు- బీదా

రాజకీయాల్లో పార్టీ మారటం అతిసహజమయ్యింది. కొందరు నాయకులు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి ఇట్టే మారిపోతారు.మరి కొందరు కష్టాలకు ఇబ్బందులకు ఎదురొడ్డి పోరాడుతారు. అలాంటి నాయకులు పార్టీ మారినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

నెల్లూరు జిల్లాలో రెండు దశాబ్దాలుగా టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆపార్టీకి అండగా నిలిచిన బీసీ నేత,మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావ్ ఈ సాయంత్రం టీడీపీకి రాజీనామా చేశారు.ఎన్నికల్లో ఓటమి తరువాత మస్తాన్ రావ్ రాజకీయంగా క్రియాశీలకంగా లేరు .

మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలవటానికి అవకాశం ఉందని ప్రచారం జరిగిన కావలి నియోజకవర్గం నుంచి 2009లో బీదా మస్తాన్ రావ్ గెలిచారు, 2014లో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో బీదా మస్తాన్ రావును తప్పించి వైసీపీ తిరుగుబాటు నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి చంద్రబాబు కావలి టీడీపీ టికెట్ ఇచ్చాడు. బీద మస్తాన్ రావును బలవంతంగా నెల్లూరు లోక్ సభ బరిలోకి దింపగా ఆయన దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2019 ఎన్నికల కు ముందు బి-ఫారం ఇచ్చే సమయంలో లోక్ సభ స్థానానికి పోటీచేయవలసిన టీడీపీ నేత .మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరి లోక్ సభ సీటు సాధించి ఎన్నికల్లో గెలిచారు . ఆదాల ప్రభాకర్ రెడ్డి ,మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగినా ఆ విషయాన్నీ పసిగట్టడంలో చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాలు విఫలమయ్యాయి. చివరి నిముషంలో ఒంగోలు నుంచి సిద్దా రాఘవ రావును .నెల్లూరు నుంచి బీద మస్తాన్ రావును బరిలోకి దింపి అటు లోక్ సభ స్థానాలతో పాటు ఇటు వారు 2014లో గెలిచిన దర్శి,కావలి శాసనసభ స్థానాలలో కూడా టీడీపీ ఓడిపోయింది.

తన సొంత నియోజకవర్గం కావలి నుంచి తిరిగి పోటీచేయటానికి అవకాశం రాకపోవటంతో బీదా మస్తాన్ రావ్ ఎన్నికల నాటి నుంచే చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు. తెలుగు దేశం హాయంలో బీదా సోదరుల వ్యాపారాల మీద IT దాడులు జరిగాయి.అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి కానీ సాధారణ దాడులే అని తేలాయి.

బీదా సోదరుల రాజకీయ రంగప్రవేశం 2001లో జరిగింది. 2001లో జరిగిన జిల్లా పరిషత్ ,మండల & పంచాయితి ఎన్నికలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్ BC కి రిజర్వ్ అయ్యింది. ఎన్నికలకు ముందే తెలుగుదేశం ఆర్ధికంగా బలవంతుడైన యాదవ యువకుడు “బీదా రవిచంద్ర”ను చైర్మన్ అభ్యర్ధిగా ప్రకటించింది.కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్ధిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగింది.1984లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి నెల్లూరు జిల్లా పరిషత్ టీడీపీ ఆధిపత్యంలోనే ఉంది.2001 ఎన్నికల్లో కాంగ్రెస్25 ,TDP 21 జడ్పీటీసీ లు గెలిచాయి.కాంగ్రెస్ జడ్పీటీసీ లను తమ వైపు లాక్కోవటానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాంపు రాజకీయాలు,ఆనం రామ నారాయణ రెడ్డి చాణుక్యంతో విఫలమయ్యాయి. చైర్మన్ ఎన్నిక రోజు కాంగ్రెస్ తరుపున గెలిచిన రావుల అంకయ్యగౌడ్ టీడీపీ కి ఓటు వెయ్యటంతో కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ అభ్యర్ధి చెంచాల బాబు యాదవ్ కు 24,టీడీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి బీదా రవికి 22 ఓట్లు వచ్చాయి. ఆ విధంగా మూడు సీట్ల తేడాతో బీద రవి జడ్పీ చైర్మన్ గిరి పోగొట్టుకున్నాడు.

బీద సోదరుల రాజకీయ రంగ ప్రవేశం ఓటమితో మొదలైనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు వారి హావా బాగా సాగింది. 2015లో బీద రవి MLC కూడా అయ్యారు. బీదా మస్తాన్ రావ్ 2004లో అల్లూరు నుంచి ఓడిపోయారు. 2009 పునర్విభజనలో అల్లూరు నియోజకవర్గం రద్దు కావటంతో కావలినుంచి పోటీచేసి గెలిచారు. 2014లో కావలి నుంచి మరో సారి ఓడిపొయ్యి 2019లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి ఓడిపోయారు.

టీడీపీకి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావ్ వైసీపీలో చేరుతున్నారని వారి అనుచర వర్గాలు చెప్తున్నాయి. పదవుల్లో లేని నాయకులను పార్టీలో చేరుకోవటానికి వైసీపీ కి ఇబ్బంది లేదు. దేవినేని అవినాష్ ను 2 రోజుల్లో పార్టీలో చేర్చుకున్న వైసీపీ, గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో మాత్రం 2 నెలలు గడుస్తున్నా ఏమి తేల్చకపోవటమే దీనికి ఉదాహరణ.

తన అన్న మస్తాన్ రావ్ టీడీపీని వీడినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని బీద రవి చెప్పాడు. బీద సోదరుల అనుబంధం, రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు బీద రవి టీడీపీలో ఎక్కువ కాలం కొనసాగడని,అన్న దారిలో వైసీపీలోకి వెళతారని అనుకుంటారు. బీదా మస్తాన్ రావ్ రాకతో నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు పెరుగుతుంది. కానీ బీసీ వర్గాలలో ముఖ్యంగా యాదవ,మత్సకార వర్గాలలో వైసీపీకి అదనపు బలం చేకూరుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp