సుజనా, రాయపాటి ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసులు

By Nehru.T Feb. 21, 2020, 11:45 am IST
సుజనా, రాయపాటి ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసులు

చంద్రబాబు నాయుడికి గడ్డుకాలం నడుస్తున్నట్టే ఉంది. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పినట్లు లేదు. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపినా కేసులు వదలడం లేదు. బ్యాంకులు బాకీలు అడగడం మానలేదు. తాజాగా నిన్న ఒక్కరోజే చంద్రబాబు ముఖ్య అనుచరులు ఇద్దరికి బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి . వందలకోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినందుకు ఆస్తులు వేలం వేస్తామని ప్రకటించాయి.

రాయపాటి సాంబశివరావు గతంలో టిడిపి,కాంగ్రెస్ పార్టీల నుంచి గుంటూరు ఎంపీగా పని చేసారు. ఎంపీగా కన్నా అక్రమ వ్యాపారిగానే ఎక్కువ గుర్తింపు పొందిన ఆయన ఆంధ్రాబ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని కట్టడం మానేశారు. దీంతో అసలు వడ్డీ కలిపి దాదాపు రూ.837 కోట్లకు చేరగా ఆయన ఆస్తులు వేలం వేసి బకాయిలు రాబట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరులోని 22500 చదరపు అడుగుల కమర్షియల్ కాంప్లెక్స్ , ఢిల్లీలోని ఇంటిని మార్చ్ 23న వేలం వేస్తామని ప్రకటించింది.

మరోవైపు బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టడంలో స్పెషలైజేషన్ సాధించిన సుజనా చౌదరి కూడా ఇలాంటి నోటీసునే ఎదుర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకులకు దాదాపు రూ.6000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన చౌదరి బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ 322 కోట్లు బకాయి పడ్డారు. వడ్డీతో కలిపి ఆది రూ.400 కోట్లకు చేరగా ఇలాంటి బాకీలు చెల్లించడం తనకు అలవాటు లేదన్నట్లు ఆయన వ్యవహరించారు. దీంతో మార్చి 23న ఆయన ఆస్తులు వేలం వేస్తామని బ్యాంక్ నోటీసులు ఇవ్వడంతో బాటు పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.

చంద్రాబాబు అనుచరుల ఇద్దరికి ఓకేరోజు బ్యాంక్ నోటీసులు రావడమే కాకుండా ఇద్దరి ఆస్తులు ఒకేరోజు వేలానికి రావడం కూడా విచిత్రంగానే జరిగిందని అంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp