బల్లి దుర్గాప్రసాద్ రాజకీయ ప్రయాణం,చంద్రబాబు భూవివాదం...

By Siva Racharla Sep. 17, 2020, 06:28 pm IST
బల్లి దుర్గాప్రసాద్ రాజకీయ ప్రయాణం,చంద్రబాబు భూవివాదం...

రాజకీయాల్లో అందరి వాడు అనిపించుకోగలిగే నాయకులు చాలా తక్కువ. అందరివాళ్లు అవ్వాలంటే స్థాయి భేదం లేకుండా అందరితో కలిసిపోవటమే ముఖ్యం. సొంత పనులు , వ్యాపారాలు తక్కువగా ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో చిన్నా పెద్ద తేడా లేకుండా,అడిగినా ఆడకపోయినా.. ఆహ్వానం కోసం చూసుకోకుండా కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజల తలలో నాలుకలా వ్యవహరించే నాయకులకు ప్రజాభిమానం ఎక్కువగా దక్కుతుంది...

పై కోవకు చెందిన వారు బల్లి దుర్గాప్రసాద్. ఎన్నో రాజకీయ యుద్దాలు చేసి గెలిచిన తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా నుంచి కోలుకుంటున్న దశలో గుండెపోటు రావటంతో నిన్న మరణించారు.

గూడూరు - నేదురుమల్లి-నల్లపురెడ్ల కోట
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరియు సీనియర్ నేత నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సొంత నియోజకవర్గం. "కోట" సమితి అధ్యక్షుడిగా పనిచేసిన నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1972 ఎన్నికల్లో పీవీ నర్సింహా రావ్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో నల్లపరెడ్డిది "సైకిల్" గుర్తు కావటం గమనార్హం.

1978 ఎన్నికల నుంచి గూడూరు నియోజకవర్గం SC రిజర్వ్డ్ గా మారింది.దీనితో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పొరుగున ఉన్న వెంకటగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరుపున పోటీచేసి గెలిచారు. గూడూరు నుంచి నేదురుమల్లి శిష్యుడు పట్రా ప్రకాష్ రావ్ ఇందిరా కాంగ్రెస్ తరుపున గెలిచారు .

తెలుగుదేశంతో నల్లపరెడ్డి ప్రయాణం
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డిది చాలా క్రియాశీలక పాత్ర.గూడురు, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోవూరు ఇలా పలు నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. వెంకటగిరి నుంచి సొంత అన్న నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించుకున్న శ్రీనివాసుల రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ఎన్టీఆర్ తొలి క్యాబినెట్ లో రహదారులు & భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు .

Read Also : ఏపీ ప్రతిపక్షాలు.. ఆముదం చెట్టు

అన్నాతమ్ముళ్ళు ,తండ్రి కొడుకుల మధ్య చిచ్చుపెట్టిన నాదెండ్ల ఎపిసోడ్ ...
1984 ఆగస్టులో నాదెండ్ల తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎన్టీఆర్ వైపు బలంగా నిలబడి గవర్నర్ వద్దకు మంత్రులను,ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి పెరేడ్ చేయించాడు. కానీ ఆయన అన్న చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నాదెండ్ల శిబిరంలో చేరారు.

మరో వైపు ఆత్మకూర్ ఎమ్మెల్యే ఆనం వెంకట రెడ్డి నాదెండ్ల వర్గంలో చేరగా,ఆయన చిన్న కుమారుడు నెల్లూరు నుంచి గెలిచిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ,మరియు ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మాత్రం ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. వీరి ఆధ్వర్యంలో నెల్లూరులో పెద్ద బహిరంగ సభ కూడా జరిగింది,ఆ సమయంలో ఎన్టీఆర్ పాల్గొన్న పెద్ద సభ అదే.

నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభావంతో గూడురు నుంచి గెలిచిన మస్తానయ్య కూడా నాదెండ్ల వర్గంలోకి వెళ్లారు.

బల్లి దుర్గా ప్రసాద్ రాజకీయ రంగప్రవేశం
1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన మస్తానయ్య నాదెండ్ల వర్గంలోకి వెళ్లటంతో 1985 ఎన్నికల్లో గూడూరు నుంచి టీడీపీ కొత్త అభ్యర్థి కోసం అన్వేషించింది.

28 సంవత్సరాల యువ లాయర్ బల్లి దుర్గాప్రసాద్ జుడీషియరీ పరీక్షల్లో ఉతీర్ణుడై మేజిస్ట్రేట్ నియామకం కోసం ఎదురు చూస్తున్న సమయంలో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహాయంతో గూడూరు టీడీపీ టికెట్ వరించింది.ఆ ఎన్నికల్లో సులభంగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 1989లో ఓడిపోయి 1994,1999 ఎన్నికల్లో గెలిచారు. 1996లో చంద్రబాబు క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు .

చంద్రబాబుతో సాన్నిహిత్యం ..
1978 ఎన్నికల్లో చంద్రబాబుకు తొలిసారి పోటీచేసే అవకాశం మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు (గల్లా అరుణ తండ్రి) వలన వచ్చింది వాస్తవమే కానీ ఇందిరా కాంగ్రెస్లో చంద్రబాబు గురువు నేదురుమల్లి. ఆయన గైడెన్సు లోనే చంద్రబాబు తొలిరాజకీయ పాఠాలు నేర్చుకున్నది. అప్పట్లో చంద్రబాబు నెల్లూరు కు నిత్య సందర్శకుడు.

చంద్రబాబు బాలాయపల్లి భూవివాదం ..
వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలంలో 1984-1985 రోజుల్లో చంద్రబాబు 200 ఎకరాల భూమిని కొన్నాడు. ఈ కొనుగోలు బినామీ వ్యవహారం కాదు అధికారికంగా చంద్రబాబు మరియు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదనే భూములు రిజిస్టర్ అయ్యాయి.ఈ భూముల బాగోగులు బల్లి దుర్గాప్రసాద్ చూసుకునేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. 1985 ఎన్నికలకు ముందు నుంచే బల్లి దుర్గ ప్రసాద్ కు చంద్రబాబుతో సంబంధాలు ఉండేవి. బల్లి దుర్గా ప్రసాద్ కు తొలిసారి 1985 టికెట్ నల్లపరెడ్డి వలన వచ్చిందా లేక చంద్రబాబు వలన వచ్చిందా అన్నదాని మీద నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.చంద్రబాబు బాలాయపల్లి భూముల మీద 1986లో అనేక ఆరోపణలు వచ్చాయి. నాడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు 1986 సెప్టెంబర్ మొదటి వారంలో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తిరుపతిలో ఉన్న హోటల్ అమ్మిన డబ్బుతో బాలాయపల్లిలో ఎకరా రెండు వేల చొప్పున రెండు వందల ఎకరాలు కొన్నట్లు, తనకు నాలుగైదు లక్షల పెట్టి భూమిని కొనుక్కునే ఆర్ధిక స్థోమత లేదా అంటూ ప్రశ్నించాడు.

2004 లో వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకాన్ని చంద్రబాబు తన బాలాయపల్లి భూములకు వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీని మీద వైఎస్ఆర్ శాసనసభలో చంద్రబాబును నిలదీయడంతో తనకు ఆవివరాలు తెలియవని, ఒక వేల అలా వాడుకుంటే బిల్లు కడతానని,ఇక పై ఉచిత్ విద్యుత్ వాడకుండా తన వాళ్లకు చెబుతానని సమాధానం ఇచ్చాడు...

2004లో దెబ్బకొట్టిన చంద్రబాబు..
చంద్రబాబుకు దీర్ఘకాల స్నేహితులు ఉండరన్న మాట బల్లిదుర్గా ప్రసాద్ విషయంలో కూడ నిజమయ్యింది. ఎంత సన్నిహితుడైన రాజకీయ లెక్కలో మాత్రం దాని ప్రభావం ఉండదు అని చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్ళు అనేమాట.

2004లో బీజేపీతో పొత్తులో భాగంగా బీజేపీకి సిట్టింగ్ తిరుపతితోపాటు నెల్లూరు ఎంపీ సీట్లు చంద్రబాబు కేటాయించారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన ఉక్కాల రాజేశ్వరమ్మకు (మాజీ ఎంపీ కామక్షయ్య కుమార్తె) గూడూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి బల్లి దుర్గాప్రసాద్ కు పోటీచేసే అవకాశం చంద్రబాబు ఇవ్వలేదు.
2004 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాకపోవటం బల్లి దుర్గా ప్రసాద్ కు పెద్ద షాక్.. బాలాయపల్లి భూముల మీద కూడా శాసనసభలో చర్చ జరగటం ఒక విధంగా చంద్రబాబుకు-బల్లి దుర్గా ప్రసాద్ కి మధ్య గ్యాప్ పెంచింది.

2009లో అనుకోని అవకాశం ...
2004 ఎన్నికల్లో గూడూరు నుంచి కాంగ్రెస్ తరుపున పట్రా ప్రకాష్ రావ్ గెలిచారు. ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన పనబాక లక్ష్మి 2009 ఎన్నికల్లో తన భార్త పనబాక కృష్ణయ్యకు గూడూరు కాంగ్రెస్ టికెట్ సాధించారు.
2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ జనరల్ సీట్ గా మారటంతో పనబాక లక్ష్మి బాపట్ల నుంచి పోటీచేశారు. మీరు బాపట్ల నుంచి పోటీ చేస్తూ ,మీ భర్తను గూడురు నుంచి ఎందుకు?బాపట్ల లోక్ సభ పరిధిలో SC రిజర్వడ్ శాసనసభ స్థానాలైన సంతనూతలపాడు,వేమూరులలో ఎదో స్థానం నుంచి మీ భర్తకు టికెట్ తెచ్చుకోమని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పినా పనబాక లక్ష్మి వినకుండా ఢిల్లీలో ఉన్న పలుకుబడితో సొంత నియోజకవర్గం గూడూరు నుంచి తన భర్త కృష్ణయ్యకు కాంగ్రెస్ టికెట్ సాధించారు.

Read Also : చాయ్ వాలా నుంచి పీఎం దాకా.. మోదీ ప్ర‌స్థానం..!

మరో వైపు టీడీపీ తరుపున రాజేశ్వరమ్మకు మరోసారి అవకాశం ఇవ్వటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సొంత నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవటంతో కోపగించిన నేదురుమల్లి టీడీపీ తరుపున బల్లిదుర్గాప్రసాద్ కు గూడురు టికెట్ ఇవ్వమని,తాను మద్దతు ఇస్తానని చంద్రబాబుకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా ఆ ఎన్నికల్లో బల్లిదుర్గ ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇచ్చింది ఆయన గెలిచాడు.

నేదురుమల్లి కుట్రతోనే ఓడిపోయామని పనబాక కృష్ణయ్య బహిరంగంగానే ఆరోపించారు.. ఆ విధంగా నేదురుమల్లి మద్దతుతో బల్లిదుర్గ ప్రసాద్ టికెట్ సాధించి గెలిచారు.

టీడీపీకి గుడ్ బై ..
2014 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు బల్లి దుర్గా ప్రసాద్ కు హ్యాండ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కానీ టికెట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో బల్లి దుర్గ ప్రసాద్ టీడీపీ అభ్యర్ధీకే మద్దతు ఇచ్చినా వైసీపీ తరుపున పాశం సునీల్ గెలిచారు.
పాశం సునీల్ కు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ గురువు. 1995లో గూడుర్ మున్సిపల్ చైర్మన్ గా సునిల్ గెలుపులో ప్రసన్న కుమార్ రెడ్డిదే ముఖ్యపాత్ర. సునీల్ కూడ వైశ్రాయ్ సంఘటనలో చంద్రబాబు వైపు వెళ్లకుండా తన గురువు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఎన్టీఆర్ వర్గంలో కొనసాగారు. సునీల్ 1996 లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి వర్గం తరుపున పోటీ చేసి లక్షకు పైగా ఓట్లు సాధించాడు. 2014లో ప్రసన్న కుమార్ రెడ్డి ఆశీస్సులతో వైసీపీ టికెట్ సాధించి గెలిచిన సునీల్ గురువుకి, జగన్ కి ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించాడు.చంద్రబాబు 2019 ఎన్నికల్లో సునీల్ ను కాదని గూడూరు టికెట్ తనకే ఇస్తాడని నమ్మి చివరికి ఆశ నిరాశ కావటంతో 2019 ఎన్నికలకు నెల ముందు దుర్గ ప్రసాద్ వైసీపీలో చేరారు.

2014లో వైసీపీ తరుపున తిరుపతి ఎంపీగా గెలిచిన వర ప్రసాద్ శాసనసభకు పోటీచేస్తానని జగన్ ను అడగటంతో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బల్లి దుర్గా ప్రసాద్ రావ్ కు అవకాశం ఇచ్చింది. ఆయన టీడీపీ తరుపున పోటీచేసిన పనబాక లక్షి మీద రెండు లక్షల ఇరవై వేల మెజారిటీతో గెలిచారు.

చంద్రబాబుకు సన్నిహితుడైన బల్లి దుర్గా ప్రసాద్ కు టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కొందరు చెప్పినా అదే జిల్లాకు చెందిన ఒక పెద్ద నాయకుడు నాది బాధ్యత అని చెప్పి జగన్ ను ఒప్పించాడు.

బల్లి దుర్గా ప్రసాద్ అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారినట్లు చూడాలి. 2014లో టికెట్ రాకపోయినా టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు కానీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దుర్గా ప్రసాద్ కు ఎలాంటి రాజకీయ అవకాశం ఇవ్వలేదు . టికెట్ వదులుకున్న పుష్పరాజ్ లాంటి సీనియర్ దళిత నాయకుడికే చంద్రబాబు ఏ పదవి ఇవ్వలేదు మా నాయకుడికి ఎప్పుడు ఇవ్వాలని బల్లి దుర్గా ప్రసాద్ అనుచరులు అనేవారు.

మరణం...


కోవిడ్ చికిత్స కోసం 15 రోజుల కిందట చెన్నైలో ఒక ఆసుపత్రిలో చేరిన బల్లి దుర్గాప్రసాద్ కోలుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిఛార్జ్ అవుతారనుకుంటున్న సమయంలో గుండెపోటు తో నిన్న ఆసుపత్రిలో మరణించారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ ముద్ర గూడూరు నియోజకవర్గంలో చాలా కాలం ఉంటుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడని మంచిపేరున్న దుర్గ ప్రసాద్ వద్దకు ఎలాంటి సిపార్సులు లేకుండా సామాన్యులు కూడా వెళ్లి పనిచేయించుకునే అవకాశం ఉండేది.ఆయనకు ప్రజల్లో ఉన్న మంచి పేరు ఇదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp