వైసీపీలోకి బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌?

By Sodum Ramana Nov. 30, 2019, 07:54 am IST
వైసీపీలోకి బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ‌?

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజ‌య‌మ్మ‌, ఆమె త‌న‌యుడు రితీష్‌కుమార్‌రెడ్డి డిసెంబ‌ర్ మొద‌టి లేదా రెండోవారంలో చేర‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్ర‌స్తుతం టీడీపీలో ఉంటున్న త‌ల్లీకొడుకు...పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ వారు అటువైపు తొంగిచూడ‌లేదు. దీంతో వారు పార్టీ మారుతార‌నే ఊహాగానాలకు బ‌లం వ‌చ్చింది.

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో విజ‌య‌మ్మ వియ్యం అందుకున్నారు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అల్లుడే రితీష్‌కుమార్‌రెడ్డి. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆనం ద్వారా త‌ల్లీకొడుకు క‌ల‌సిన‌ట్టు స‌మాచారం. త‌న కుమారుడికి ప్రాధాన్యం ఇస్తే చాలున‌ని, తాను కేవ‌లం స‌ల‌హాలిస్తూ ప్రోత్స‌హిస్తాన‌ని జ‌గ‌న్‌తో విజ‌య‌మ్మ అన్న‌ట్టు తెలిసింది. విజ‌య‌మ్మ ప్ర‌తిపాద‌న‌కు జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని తెలిసింది.

Read Also: చెప్పులతో వచ్చిన తిప్పలు

విజ‌య‌మ్మ తండ్రి బిజివేముల వీరారెడ్డి క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించాడు. వీరారెడ్డి 1967లో బ‌ద్వేలు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందాడు. ఆ త‌ర్వాత 1972లో కూడా కాంగ్రెస్ నుంచే విజ‌యం సాధించాడు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం టీడీపీ నుంచి మొద‌లైంది. క‌డ‌ప జిల్లాలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక నాయ‌కుడు వీరారెడ్డి. ఆయ‌న ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు కేబినెట్‌ల‌లో మంత్రిగా ప‌నిచేశాడు.

బ‌ద్వేలు వీరారెడ్డి, జ‌మ్మ‌ల‌మ‌డుగు శివారెడ్డి మంత్రులుగా క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్‌లో బ‌ల‌మైన నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని వారిద్ద‌రూ దీటుగా ఎదుర్కొనేవారు. 2001లో వీరారెడ్డి మ‌ర‌ణానంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న త‌నయ విజ‌య‌మ్మ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్థి డీసీ గోవిందురెడ్డి చేతిలో విజ‌య‌మ్మ ఓట‌మి పాల‌య్యారు. 2009లో జ‌న‌ర‌ల్ కేట‌గిరి నుంచి ఎస్సీకి రిజ‌ర్వ్ అయ్యింది. దీంతో విజ‌య‌మ్మ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొనే అవ‌కాశం లేకుండా పోయింది.

Read Also: తాజా సర్వే - అవినీతి రాష్ట్రాల జాబితాలో కనపడని ఆంధ్రప్రదేశ్

అయితే విజ‌య‌మ్మ సూచించిన వారికే చంద్ర‌బాబు టికెట్ ఇస్తూ వ‌చ్చాడు. వియ్యంకుడైన అనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డం, ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో విజ‌య‌మ్మ‌ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంద‌నే చ‌ర్చ కొంత కాలంగా వైసీపీ రాష్ట్ర నాయ‌క‌త్వంలో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని స‌మాచారం.

అన్నీ కుదురితే వచ్చే నెల‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో విజ‌య‌మ్మ‌, ఆమె కుమారుడు చేరే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఎస్సీ రిజ‌ర్వ్ కావ‌డంతో ఆమె రాక‌కు ప్ర‌స్తుత పార్టీ ఇన్‌చార్జ్ గోవిందురెడ్డి నుంచి పెద్ద‌గా వ్య‌తిరేక‌త ఎదుర‌య్యే అవ‌కాశాలు లేవు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp