సోము వీర్రాజు సంకేతాలతో బాబు బ్యాచ్ బేజారు, బీజేపీలో ఆసక్తికర పరిణామాలు తప్పవా?

By Raju VS Aug. 05, 2020, 08:00 am IST
సోము వీర్రాజు సంకేతాలతో బాబు బ్యాచ్ బేజారు, బీజేపీలో ఆసక్తికర పరిణామాలు తప్పవా?

బీజేపీ దేశవ్యాప్తంగా బలపడాలని ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఏపీలో కూడా అనేక ప్రయోగాలు చేసింది. కానీ అవన్నీ ఫలితాలు ఇవ్వలేదు. పైగా బీజేపీ ఒకనాడు 18శాతం ఓట్ల నుంచి ఇప్పుడు 1శాతం ఓట్లు సుమారుగా తెచ్చుకుని కుచించుకుపోయినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే చెబుతున్నారు. 2024లో సీఎం పీఠం మాదే అంటూ ఢంకా బజాయిస్తున్నారు. ఓ పార్టీ నాయకుడిగా తన శ్రేణుల్లో విశ్వాసం పెంచేందుకు ఆయన అలా మాట్లాడుతున్నారా అంటే పూర్తిగా అనుకోవడానికి లేదు. ముఖ్యంగా టీడీపీ బలహీనపడుతున్న తరుణంలో తదుపరి తామే ముందుకొస్తామని అంచనాలతో ఆయన ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఆయన ఇస్తున్న సంకేతాలు దానికి అనుగుణంగానే ఉన్నాయి.

అదే సమయంలో కొంతకాలంగా బీజేపీని ఎవరో నడిపించాలని ప్రయత్నించారని, ఇకపై బీజేపీని బీజేపీయే నడుపుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బీజేపీని ఎవరో నడిపించారని ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఇటీవల ఆపార్టీలో చేరిన టీడీపీ నేతలను ఉద్దేశించిన చేసినవా లేక సుదీర్ఘకాలంగా ఏపీలో బీజేపీని నడిపించిన వెంకయ్య నాయుడు బృందం పైనా అన్నది అంతుబట్టని విషయం. ఎవరిపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఏపీ బీజేపీలో పలుమార్పులు ఖాయం అని చెప్పక తప్పదు. దానికి అనుగుణంగా సోము వీర్రాజు తన టీమ్ ని సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.

ఏపీ రాజధాని అంశంలో బీజేపీ, కేంద్రం కూడా తమ వైఖరి స్పష్టం చేసేశాయి. స్వయంగా సోము వీర్రాజు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేత లంకా దినకర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధం, ప్రశ్నించడానికి లేదని సోము వీర్రాజు చెబితే, ఇప్పుడు గవర్నర్ నిర్ణయం చెల్లదని లంకా దినకర్ కోర్టులో కేసు వేయడం కమలనాధుల భిన్నపోకడలకు దర్పణం పడుతోంది. దానిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగానే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజీయంగా ఆసక్తిని రాజేస్తున్నాయి. ముఖ్యంగా బాబు సన్నిహితులకు కొంత చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయని తర్వాత బీజేపీ అండగా ఉంటుందనే ఉద్దేశంతో చివరకు టీడీపీ ఎంపీలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. రాజ్యసభలో తమకు ఎంపీలు అవసరం ఉన్న తరుణంలో బీజేపీ కూడా వారికి తలుపులు తెరిచింది. ఇలా ఇరువురు ఎవరి ప్రయోజనాల కోసం వారు పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు.

అయినప్పటికీ పసుపు జెండాని వీడి కాషాయ గూటిలో చేరిన కొందరు నేతలు నేటికీ బాబు ప్రయోజనాల కోసమే తప్ప బీజేపీ లక్ష్యాలను పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ముఖ్యంగా బీజేపీలో సుదీర్ఘకాలంగా ఉన్న నేతలకు కొత్తగా వచ్చిన వారి తీరు రుచించడం లేదు. సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు అందుకు కొనసాగింపుగానే చెప్పవచ్చు. ఏపీ బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేయదని, సొంతంగా ఎదగడానికి అవకాశాలు ప్రబలంగా ఉన్నాయని, ఎలా అధికారం సాధిస్తామో చూస్తామని చెబుతున్నారు. ఆ క్రమంలోనే బీజేపీలో చేరిన బాబు అనుచరులను కట్టడి చేయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. దానిని సుజనా, సీఎం రమేష్ వంటి నేతలు ఎలా స్వీకరిస్తారన్నదే చర్చనీయాంశం. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆటంకాలు లేకుండా సాగిన వారి పయనంలో సోము రాకతో వచ్చిన చిక్కులను ఎలా అధిగమిస్తారన్నది చూడాలి. అది ఏపీ బీజేపీ మీద పెద్ద ప్రభావమే చూపుతుందనడంలో సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp