మీరు గెలిస్తే మళ్ళి మీ వైపే వస్తా!

By Siva Racharla Dec. 13, 2019, 06:32 pm IST
మీరు గెలిస్తే మళ్ళి మీ వైపే వస్తా!

రాజకీయాల్లో కొందరికి పట్టిందల్లా బంగారమే. అందులో గంటా శ్రీనివాస్ బ్యాచ్ ముఖ్యమైనది. నిన్నా మొన్నటివరకు గంటా గ్రూప్లో అవంతి శ్రీనివాస్ ప్రముఖుడు. ఇప్పుడు అవంతి గురించి చర్చ ఎందుకు అంటే...నిన్న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తానూ వైసీపీ లో చేరే ముందునాటి సంగతి చెప్పాడు.

అవంతి శ్రీనివాస్ పార్టీ మారే ముందు చంద్రబాబుని కలసి వైసిపిలో చేరి మంత్రిని అవుతానని చెప్పాడంట. దానికి చంద్రబాబు ఒకవేళ నువ్వు గెలిచినా జగన్ ఓడిపోతాడని మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనని చెప్పాడంట. అవంతి శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు వెనుక కూర్చొని ఉన్న అచ్చం నాయుడు ,నువ్వు వైసిపిలో గెలిచి మళ్లీ తెలుగుదేశంలోకి వస్తానని చంద్రబాబు తో చెప్పావంటూ కామెంట్ చేశాడు .

ఇక అసలు విషయంలోకి వెళితే ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా విశాఖ రాజకీయాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస్) కీలకమైన నేతగా ఎదిగాడు. గతంలో ద్రోణంరాజు సత్యనారాయణ దగ్గర నుండి కొణతాల రామకృష్ణ, సబ్బం హరి లాంటి వాళ్లు చక్రం తిప్పినప్పటికి విశాఖ సిటీలో మొదటినుండి స్థానికేతరుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది

కాని 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుండి జిల్లాలో రాజకియ పరిస్తితులు ఒక్కసారిగా మారిపొయ్యాయి. ఆప్రాంతంలో బలమైన కులంగా ఉన్న కాపుల్లో ఎక్కువమంది చిరంజీవి ప్రజారాజ్యంకు మద్దతుగా అనిలిచారు అందువల్లే ప్రజారాజ్యం విశాఖ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలిచి, లోక్ సభ స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది.

ఇక అవంతి విద్యాసంస్థల అధిపతిగా అప్పటికే వైజాగ్ లో సెటిల్ అయిన ముత్తంశెట్టి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చిన మొదలు పరిస్థితులు అతనికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. మొదట పవన్ కల్యాణ్ ద్వారా ప్రజారాజ్యం పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్ కి పవన్ కల్యాణ్ పట్టుబట్టి అవంతి శ్రీనివాస్ కి భీమిలి టికెట్ ఇప్పించాడు.

2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా భీమిలి నియోజకవర్గం నుండి పోటీచేసి అప్పుడు జరిగిన త్రికోణ పోరులో తెలుగుదేశం అభ్యర్ధి ఆంజనేయరాజు పై 7 వేలు పైచిలుకు మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుబెట్టడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో చిరంజీవి ప్రజారాజ్యన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ కి మంత్రి పదవి వరించడంతో ఆయన కోటరిలో ముఖ్యనేతగా ఎదిగి తిరిగి 2014లో గురువు గంటా తో కలసి తెలుగుదేశంలో చేరి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తన శిష్యుడు గుడివాడ అమరనాధ్ మీద గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టాడు.

అప్పటివరకు బాగానే ఉన్న గురు శిష్యుల సంబంధంలో గ్యాప్ రావడం 2015 తరువాత ఆ గ్యాప్ అలాగే పెరిగిపోయి 2018 నాటికి తీవ్రస్థాయికి చేరి గురువు గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలీ టికెట్ తనకు కావాలని అవంతి చంద్రబాబును అడిగాడు. చంద్రబాబు సర్దుబాటు చెయ్యాలని చూసినా అవంతి రాజి పడలేదు.చివరికి ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యాడు.భీమిలిలో గురు శిష్యులు గంటా-అవంతి ఎన్నికల బరిలో తలపడకుండా గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు.

పార్టీ మారి అవంతి శ్రీనివాస్ మంత్రి కాగా,టీడీపీ తుడిచిపెట్టుకొని పోయినా గంటా తిరిగి గెలిచాడు.ఇప్పుడు గంటా బీజేపీ లోకి వెళతాడని ప్రచారం జరుగుతుంది.మూడు ఎన్నికల్లో గెలుపు దేవత వరించిన వీరి అదృష్టం మరిన్ని ఎన్నికల్లో కొనసాగుతుందో లేదో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp