దిశా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడానికి గల కారణాలు

By Kiran.G Dec. 06, 2019, 05:37 pm IST
దిశా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడానికి గల కారణాలు

చటాన్ పల్లి వద్ద దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో సీపీ వీసీ సజ్జనార్‌ ఘటనాస్థలంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌ ఎందుకు చేయవలసి వచ్చిందో సీపీ వీసీ సజ్జనార్ మీడియాకు వివరించారు. దిశా హత్యాచార ఘటనలో ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించామని,తర్వాత సైంటిఫిక్‌ ఆధారాలను సేకరించామని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గత నెల 28న దిశను చటాన్‌పల్లి వద్ద నిందితులు కాల్చివేశారని, ఆ తర్వాత ఆధారాల సాయంతో నిందితులను పట్టుకుని 30న మెజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరిచామని తెలిపారు.మేజిస్ట్రేట్ నిందితులను 10 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 4న నిందితులను కస్టడీకి తీసుకున్నామని, విచారణలో భాగంగా నిందితులను అనేక విషయాలు ప్రశ్నించామని తెలిపారు.

దిశకు సంబంధించిన వస్తువులు చుపిస్తామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చామని, దిశ ఫోన్‌, వాచీ, పవర్‌బ్యాంక్‌ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులను చటాన్ పల్లి తీసుకెళ్లలేదని స్పష్టం చేసారు. ఘటనా స్థలంలో నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ కర్రలతో దాడి చేస్తూ పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. మహ్మద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు మాత్రం పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరపడానికి ప్రయత్నించారని, పోలీసులు నిందితులను సరెండర్ కావాలని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపాల్సి వచ్చిందని సీపీ వీసీ సజ్జనార్ మీడియాకు వివరించారు.

ఈరోజు ఉదయం 5.45 నుంచి 6.15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని,పోలీసులకు బుల్లెట్‌ గాయాలు కాలేదని కానీ నిందితులు జరిపిన రాళ్లదాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయని తెలిపారు.పోలీసులకు ప్రథమచికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించామని మీడియాకి వెల్లడించారు. గతంలో నిందితులు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకల్లోనూ ఈ తరహా ఘటనలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయని వాటిపై లోతుగా విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp