కోర్టు తీర్పుతో గెహ్లాత్ కు ఊర‌ట‌.. వీడిన ఉత్కంఠ‌

By Kalyan.S Aug. 07, 2020, 10:00 pm IST
కోర్టు తీర్పుతో గెహ్లాత్ కు ఊర‌ట‌.. వీడిన ఉత్కంఠ‌

ఆరుగురు ఎమ్మెల్యేల‌తో కూడిన బీఎస్పీ శాస‌న‌స‌భా ప‌క్షం కాంగ్రెస్ లో విలీనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ బీఎస్పీ పెట్టుకున్న పిటిష‌న్ ను రాజ‌స్థాన్ హైకోర్టు తిర‌స్క‌రించింది. ఆ పిటిష‌న్ పై విచార‌ణ‌ను ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నానికి వ‌దిలేసింది.

ఆ విచార‌ణ ఆగ‌స్టు 11న జ‌ర‌గ‌నుంది. స‌చిన్ పైలెట్ వ‌ర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల‌ తిరుగుబాటుతో ప్ర‌భుత్వం బ‌లం 102కు ప‌డిపోయింది. సాధార‌ణ మెజారిటీ 101 క‌న్నా ఇది కేవ‌లం ఒక సీటు అద‌నం. అది కూడా బీఎస్పీ ఎమ్మెల్యేల‌ను కలుపుకుంటేనే.

గ‌తంలో విచార‌ణ జ‌రిగిన‌ప్పుడు తుదితీర్పు వెలువ‌డే వ‌ర‌కూ ఆ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొన‌సాగేందుకు కోర్టు అనుమ‌తించింది. గురువారం నాటి తీర్పు కాస్త అటూ ఇటూ వ‌చ్చినా గెహ్లాత్ కు ప‌ద‌వీ గండం త‌ప్ప‌క‌పోయేది. ఆగ‌స్టు 11న విచార‌ణ వాయిదా ప‌డితే ఆగ‌స్టు 14 నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో గెహ్లాత్ బ‌ల నిరూప‌ణ చేసుకుని గండం నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రో వారం రోజుల్లో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

అసెంబ్లీ పైలెట్ వ‌ర్గం పాత్ర‌పై...

మ‌రో వారం రోజుల్లో రాజ‌స్థాన్ అసెంబ్లీ స‌మావేశం కానుంది. సీఎం గెహ్లాత్ ఎప్పుడెప్పుడు స‌మావేశాలు ప్రారంభం అవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌చిన్ పైలెట్ వ‌ర్గం అసెంబ్లీలో నిర్వ‌హించే పాత్ర‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే సీఎం రాజీ ఫార్ములాను ప్ర‌యోగించారు. కానీ ఇంత వ‌ర‌కూ స‌చిన్ పైలెట్ నుంచి స‌రైన స‌మాధానం లేదు. అసెంబ్లీకి ఇంకా 7 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో ఈ లోపు ఏం జ‌రుగుతుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంకో ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే.. అసెంబ్లీ స‌మావేశాల‌లో బ‌ల నిరూప‌ణ అంశం లేక‌పోవ‌చ్చు అనే వాద‌న కూడా ఉంది. గ‌వ‌ర్న‌ర్ కు సీఎం ముందుగా చెప్పిన‌ట్లే క‌రోనా త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై మాత్ర‌మే చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం రాజీ ఫార్ములా ఫ‌లించి అసెంబ్లీ స‌మావేశాల లోపు స‌చిన్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలిపితే అదే జ‌రిగేది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp