నాగార్జునసాగర్‌లో కామ్రేడ్స్‌ కొత్త పంథా!

By Kalyan.S Apr. 12, 2021, 01:00 pm IST
నాగార్జునసాగర్‌లో కామ్రేడ్స్‌ కొత్త పంథా!

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ఇంకో నాలుగు రోజుల్లో ముగియనుంది. కానీ, కమ్యూనిస్టుల పయనమెటు అనేది నేటికీ స్పష్టత రాలేదు. ఈ విషయంలో స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా నేతలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ఇచ్చే యోచనలో వామపక్షాలు ఉన్నాయని ఇప్పటి వరకూ ప్రచారం జరుగుతూ వస్తోంది. అధికార పార్టీపై నిత్యం పోరాడుతూ, విమర్శలు, ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై నేడో, రేపో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో స్థానిక నాయకత్వం యూ టర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌కు మద్దతు?

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 10న నిడమనూరు మండలంలో నియోజకవర్గ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఇందులో సీపీఎం, సీపీఐ నేతలూ ఇరువురూ హాజరయ్యారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. కొందరైతే టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ విషయం బహిరంగంగా ప్రకటించకూడదని నిర్ణయం తీసుకున్నారట. అలాగే బహిరంగంగా ప్రచారం కూడా చేయరట. కేవలం ఇరు పార్టీల క్యాడర్‌కు చెప్పి ఓటు అధికార పార్టీకి బదలాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే అధికార పార్టీ స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారట. దీనిపై వారిలో వారికే సఖ్యత రాకపోవడం కొసమెరుపు.

కేడర్‌లో భిన్నాభిప్రాయాలు

టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై కొందరు కామ్రేడ్స్‌ ఒకలా, మరికొందరు ఇంకోలా మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలిచే పరిస్థితి లేదని, ఆ స్థానంలోకి బీజేపీ రాకుండా అడ్డుకోవాలంటే అధికార టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వడం అనివార్యమని కొందరు నేతలు ప్రకటించారు. దీనిపై కిందిస్థాయి క్యాడర్‌ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌, బీజేపీ ఒక్కటేనన్న భావన మరికొందరు వ్యక్తం చేశారట. రాష్ట్రంలో బీజేపీది నాలుగో స్థానం. అటు కాంగ్రెస్‌కు, ఇటు టీఆర్‌ఎస్‌కు కాకుండా ఎంసీపీఐ పోటీలో ఉంది కాబట్టి గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇస్తే హుందాగా ఉంటుందన,్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఇదేందిదీ..

ఒక వేళ ఏ పార్టీకైనా మద్దతు ఇస్తే బహిరంగంగా ప్రకటించాలి. ప్రచారంలో పాల్గొనాలి. అలాంటిది కేడర్‌కు, ఆ పార్టీకి మాత్రమే చెప్పి ప్రచారంలో పాల్గొనకపోవడం ఏం పద్ధతి అని కింది స్థాయి నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతున్న క్రమంలో ఇటువంటి చర్యలు మరింత ముప్పుగా మారతాయని అభిప్రాయాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అలాగే, తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎ్‌సకు సంపూర్ణ ఆదరణ ఉన్నప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించాం, ఇప్పుడు ఆ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుపై పునరాలోచించాలని కింది స్థాయి నేతలు చెబుతున్నట్లు తెలిసింది. ‘‘దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి 1200 ఓట్లతోనే గెలిచారు. సీపీఐ తటస్థంగా ఉండగా సీపీఎం, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పోటీ చేయగా వెయ్యి ఓట్ల వరకు వచ్చాయి. ఇంకా గట్టిగా పనిచేస్తే బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచేవాడు కాదు. ఆలిండియా కమిటీ ఆలోచనతోనే సాగర్‌లో నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు.

Also Read : తిరుప‌తి బై పోల్ : బీజేపీకి దెబ్బ మీద దెబ్బ‌!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp